Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

సాంస్కృతిక నియంతృత్వం

sampadakeyam

అత్యంత వివాదాస్పదమైన హిందీ చలనచిత్రం ‘పద్మావతి’ టైటిల్‌ను ‘పద్మావత్’గా మార్పుచేయటం, కొద్దిపాటి కట్‌లు, డిస్‌క్లెయిమర్స్ జోడింపుతో సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ (మామూలు పరిభాషలో సెన్సార్ బోర్డ్) ప్రదర్శన సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ, ఆ చిత్రాన్ని తమ రాష్ట్రంలో ప్రదర్శించనీయబోమని రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ బిజెపి ప్రభుత్వాలు ప్రకటించాయి. శాంతిభద్రతలు కాపాడలేమన్న పోలీసు నివేదికలను చూపి చిత్ర ప్రదర్శనను నిషేధించేందుకు మహారాష్ట్ర, గోవా బిజెపి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో పయనించే అవకాశాలున్నాయి. అసమ్మతి గ్రూపుల నిరసన ప్రదర్శనలతో నిలిపివేయాలనుకున్న సినిమా, చట్టబద్ధ సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధమవుతుండగా, దాని ప్రదర్శనను అనుమతించబోమని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించటం ప్రజాస్వామిక, రాజ్యాంగ స్వేచ్ఛలపై దాడితో సమానం. ప్రజలు ఏమి తినాలో, తినకూడదో, స్త్రీలు ఎటువంటి వస్త్రధారణ చేయాలో, చేయకూడదో, ఎవరిని ప్రేమించవచ్చో, ప్రేమించకూడదో, ఏమి చదవాలో, చదవకూడదో నిర్దేశిస్తున్న హిందూత్వవాద ప్రభుత్వాలు ఇప్పుడు ‘పద్మావత్’ సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నాయి. ఇది సాంస్కృతిక ఫాసిజం తప్ప మరొకటి కాదు. రాజ్యాంగ పరిరక్షకురాలైన కేంద్రప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ‘మౌనముని’లాగా నోరు విప్పదు.
ప్రసిద్ధ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కళాసృష్టికి షూటింగ్ సమయంలోనే పెద్ద అంతరాయం ఏర్పడింది. ఈ చిత్ర సన్నివేశాలు రాజపుత్రుల మనోభావాలను, రాజపుత్ర స్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నాయని ఆరోపిస్తూ ‘కర్ణిసేన’ అనే రాజపుత్ర గ్రూపు ఒకటి షూటింగ్ సెట్లను, అలంకార దుస్తులు, ఆభరణాలను దహనం చేసింది. సాధారణ నిర్మాత అయితే దుకాణం బంద్ చేసి పారిపోయేవాడు. కాని భన్సాలీ మొండివాడు మాత్రమే కాదు, తన చిత్రంపై అపారమైన ఆత్మవిశ్వాసంతో షూటింగ్ ప్రదేశం మరో చోటుకు మార్చి చిత్ర నిర్మాణం పూర్తి చేశాడు. కథామూలం లోకి వెళితే మహాసౌందర్యవతి అయిన కిట్టూరు రాణి పద్మావతి గూర్చిన గాథ ఆధారం. రాజపుత్ర రాణి అయిన ఆమెను మోహించిన ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేయగా రాజు యుద్ధంలో హతుడవుతాడు. రాణి పరివార సమేతంగా నాటి సతీధర్మంగా అగ్నికి ఆహుతి అవుతుంది. 16వ శతాబ్దం నాటి గాథను 200 ఏళ్ల తర్వాత ఒక జానపద కవి గేయకావ్యంగా రాశాడు. దాని ఆధారంగా చిత్ర నిర్మాణం జరిగింది. పద్మావతిఖిల్జీ మధ్య కొన్ని సన్నివేశాలున్నాయని, అవి రాజపుత్ర మనోభావాలను దెబ్బతీస్తున్నాయనేది కర్ణిసేన ఆరోపణ. సెన్సార్ సర్టిఫికేట్ నిలుపుదలను ఆదేశించాలని కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం నియమించిన స్వయం ప్రతిపత్తిగల సెన్సార్‌బోర్డ్ విధి నిర్వహణను అడ్డుకోజాలమని సుప్రీంకోర్టు చెప్పింది. సెన్సార్‌బోర్డు కూడా చిత్రాన్ని తమకు సమర్పించిన వెంటనే సర్టిఫికేట్ ఇవ్వలేదు. చిత్రానికి వ్యతిరేకంగా నాలుగైదు రాష్ట్రాల్లో కొన్ని విభాగాలు చేస్తున్న ఆందోళనలు, దర్శకునికి, కథానాయికకు చంపుతాం, ముక్కుకోస్తాం లాంటి బెదిరింపులు, ఆందోళన కారులకు రాష్ట్రప్రభుత్వాల మద్దతు దృష్టా ఆచితూచి వ్యవహరించింది. తమ సభ్యులతోపాటు భిన్న రంగాలకు చెందిన మేధావులతో కూడిన సలహామండలికి కూడా చిత్రం చూపించి, వారి ఉమ్మడి అభిప్రాయంగా కొన్ని కట్‌లు, చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవికావు, కల్పితాలు లాంటి డిస్‌క్లెయిమర్స్ సూచించగా, వాటిని పాటించిన తదుపరి సర్టిఫికేట్ జారీ చేసింది. సాధారణ క్రమంలో అయితే చిత్రం విడుదలవుతుంది. ప్రేక్షకులు మెచ్చితే కొంతకాలం ఆడుతుంది, లేకుంటే లేదు. లాభమైనా, భారమైనా నిర్మాతది, చిత్రాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లది. ఎక్కడైనా కొన్ని సమూహాలు అల్లరిచేస్తే శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు విభాగాలది. కాని రాష్ట్రప్రభుత్వాలే చిత్ర ప్రదర్శనను నిషేధించటం నిరంకుశం, రాజ్యాంగ విరుద్ధం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమ రాష్ట్రప్రభుత్వాలకు ‘రాజ్యధర్మాన్ని’ బోధించాలి.

Comments

comments