Search
Friday 20 April 2018
  • :
  • :

కాళేశ్వరం భేష్

phhపనుల తీరు, వేగం ఘనం
ప్రశంసలు కురిపించిన కేంద్ర జలసంఘం సిఇ

 హైదరాబాద్: కాళేశ్వరం ప్రా జెక్టుకు నిధుల ఖర్చు, సకాలంలో నిర్మించడం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సవాల్ వంటిదని కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్ సికెఎల్ దాస్ అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు విభిన్నమైందని కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తపరిచారు. పనుల వేగాన్ని మరింత పెంచాలని, అప్పుడే వచ్చే జూన్‌లో ప్రాజెక్టు తొలి ఫలితాన్ని పొందుతారని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన కేంద్ర జలసంఘం బృందం సభ్యులు బుధవారం నాడు జలసౌధలో మీడియాతో మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం అన్ని విధాలుగా ప్రత్యేకమైందని జలసంఘం బృందం అభిప్రాయపడింది. ఇది సమీకృత, బహుళార్ధసాధక ప్రాజెక్టు అని జలసంఘం ప్రాజెక్టుల అప్రైజల్ విభాగం చీఫ్ ఇంజనీర్ సికెఎల్ దాస్ అన్నారు. మిడ్ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్‌పి సహా పలు ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆధారం కాబోతుందని చెప్పారు. ఇలా ఒక భారీ ప్రాజెక్టు మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తున్న ప్రక్రియ తెలంగాణలోనే కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తపరిచారు. ప్రాజెక్టులోని వివిధ విభాగాల నిర్మాణం, ప్రణాళిక, పనుల వేగం, పనులు జరుగుతున్న తీరు తమను ఆకట్టుకున్నాయన్నారు. రేయింబవళ్లు మూడు షిఫ్టులలో భారీగా జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి వచ్చే వానాకాలం నాటికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలురాయి దాటుతుందని జలసంఘం బృంధ సారధి దాస్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా వేగవంతమైన పనులు ఎక్కడా చూడలేదన్నారు. కాళేశ్వరం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు అని ఆయన ప్రశంసించారు. జూన్‌లో ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితాన్ని అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని, అనుకున్న దాని ప్రకారం లక్ష్యాన్ని చేరడమే పెద్ద సవాల్ అన్నారు. ప్రాజెక్టు వ్యయం పెరగకుండా పనులు పూర్తికావాలని ఆకాంక్షించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషిచేయాలని సూచించారు. పనులలో వేగం మరింత పెంచాలన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక సవాల్‌గా తీసుకుందన్నారు. జాతీయ అభివృద్ధిలో కాళేశ్వరం భాగస్వామి అవుతుందన్నారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు ఎలాంటి సమస్య లేదని కేంద్ర జలసంఘం హైడ్రాలజీ డైరెక్టర్ నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తపరిచారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టుగా కాళేశ్వరం అవుతుందన్నారు. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలతో పాటు బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమని, ఇదో మెగా ప్రాజెక్టు అని కొనియాడారు. నిర్ణీత గడువులోగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి తెలిపారు. ఈ పనులపై సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు నిరంతర సమీక్షలు, పర్యవేక్షణ, హైదరాబాద్ నుంచే లైవ్ కెమెరాలతో సమీక్షిస్తున్నట్లు వివరించారు. జలసౌధలో మంత్రి హరీశ్‌రావు చాంబర్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌజ్‌ల పనులను లైవ్‌లో జలసంఘం బృందానికి చూపారు. ఈ సమావేశంలో జలసంఘం డైరెక్టర్లు ముఖర్జీ, రాజీవ్‌కుమార్, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్లు హరిరాం, ఎన్.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments