Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గాలిలో దీపం ఆధార్ గోప్యత!

adr

‘బయోమెట్రిక్స్ లేకుండా కేవలం ఆధార్ ప్రదర్శన వల్ల ఆ సమాచారం దుర్వినియోగం జరగదు’. ఇది ఆధార్ డేటా బేస్‌ను నిర్వహించే యుఐడిఎఐ (భారత విశిష్ట గుర్తింపు సంస్థ) ఇచ్చిన భరోసా. సుమారు 100 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం బయటకు పొక్కినట్లు ఈ నెల 4న వార్త వెల్లడి కాగానే ఆ సంస్థ అలా స్పందించింది. భారత పౌరులకు వారి బయోమెట్రిక్ సమాచారంతో అనుసంధానం చేసిన 12 అంకెల గుర్తింపు సంఖ్యను ఇచ్చేదే ఆధార్ ప్రాజెక్టు. ఆ సమాచారం లీక్ అయిందన్న వార్తకు యుఐడిఎఐ సంస్థ ఇచ్చిన జవాబు అసంపూర్ణంగా ఉందని సైబర్ భద్రతా నిపుణులు, న్యాయవాదులు విమర్శించారు. ఆధార్ భద్రతా అంశాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఆ సంస్థ ఇవ్వడం లేదనడానికి అది నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. ఆధార్ సమాచారం లీక్ అవడం కేవలం వ్యక్తుల గోప్యత హక్కుకు భంగకరమే కాక వారిని అనేక ప్రమాదాల కు గురి చేస్తుందని వారన్నారు. ఆ ప్రమాదాల్లో ఆర్థిక పరమైన మోసాలు, గుర్తింపును దుర్వినియోగపర్చడం వంటివి ఉండవచ్చు. మొత్తం ఆధార్ డేటాబేస్ కేవలం రూ. 500 ధరకు 10 నిమిషాలలో చేజిక్కినట్లు ‘ది ట్రిబ్యూన్’ పత్రిక బయటపెట్టింది. జనాభాకు సంబంధించిన వివరాలన్నీ తృటిలో అందుకొనే ‘సౌలభ్యం’ నేరస్థులకు ప్రస్తుత ఆధార్ వ్యవస్థలో ఉందని దీనితో రుజువయింది. పేర్లు, చిరునామాలు, పోస్టలు కోడ్‌లు, ఫోన్ నంబర్లు, ఫోటో గ్రాఫులు, ఇమెయిల్ అడ్రస్సులు వంటి సమాచారం నేరస్థుడు డబ్బిచ్చి సులభంగా కొనుక్కోగలుగుతున్నాడు.
ఈ వార్తకు సరిగా స్పందించని యుఐడిఎఐ అంతటితో ఆగకుండా ఆ వార్తను బయటపెట్టిన రిపోర్టర్‌పై పోలీస్ ఫిర్యాదు దాఖలు చేసింది. ఆ రిపోర్టర్ వేరే వ్యక్తిగా చెప్పుకొన్నారని, మోసానికి, దొంగ సంతకానికి పాల్పడ్డార ని వగైరా అభియోగాలు ఆ ఫిర్యాదులో ఉన్నాయి. దీనిని పత్రికా స్వాతంత్య్రంపై దాడిగా ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది కూడా. ట్రిబ్యూన్ వెల్లడించినది అనధికార వ్యవహారమని, అటువంటి వాటికి తావు లేదని, ఎట్టి పరిస్థితిలో ఆధార్ భద్రతతో రాజీపడే సమస్య లేదని యుఐడిఎఐ ప్రకటించింది. అయినప్పటికీ దేశ జనాభాకు సంబంధించిన సమాచారం ప్రధానంగా ప్రైవేటు సమాచారమని, అందుచేత ఎవరైనా అనుకుంటే సంపాదించుకోగల అవకాశం ఉందని సైబర్ భద్రతలో నైపుణ్యంగల లాయర్ కిస్లే చౌధరి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలో సమాచార భద్రతకు భంగం కలగదన్న యుఐడిఎఐ వాదనతో చౌధరి అంగీకరించలేదు. ఆర్థిక నేరాలకు పాల్పడే ముఠాలు ఆధార్ సమాచారాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ప్రబలంగా ఉందని ఆయన అన్నారు. సోషల్ ఇంజినీరింగ్ అనే ఎత్తుగడ ద్వారా ఆర్థిక మోసగాళ్లు అటువంటి నేరాలకు పాల్పడతారని ఆయన వివరించారు. ఫోన్‌లోగాని, ఆన్‌లైన్‌లోగాని వ్యక్తులను సంప్రదించి వారిని బురిడీ కొట్టిస్తూ ఉంటారని చెప్పారు. నమ్మకమైన వ్యక్తులుగా ఫోన్‌లో నటించి ఎంచుకున్న వ్యక్తులను భారీ ఎత్తున మోసం (ఫిషింగ్) చేసే ప్రమాదం ఉందని చెప్పారు. జనాభాకు సంబంధించిన ఏ సమాచారం పొక్కినా నేరస్థులపని సులభం అవుతుందని సైబర్ పీస్ ఫౌండేషన్ నిపుణులు వినీత్ కుమార్ చెప్పారు. అది కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా వ్యవస్థ కోసం దానిని నెలకొల్పింది.
ప్రధానంగా అది సలహా సంప్రతింపుల బృందం. ‘ఇంతవరకు భారీ ఎత్తున నేరస్థుల ముఠాలకు సమాచారం అందడం లేదు. ఇప్పుడు ఆధార్ డేటా బేస్‌ను అందుకోవడం ద్వారా వ్యక్తుల సమగ్ర సమాచారాన్ని ఆ ముఠాలు చేజిక్కించుకుంటున్నాయి. దీనితో ఆర్థిక మోసాలవంటి నేరాలు పెచ్చుపెరిగే ప్రమాదం ఉంది. దానితోపాటు పౌరుల భద్రతకు ముప్పు కూడా పెరుగుతుంది’ అని కుమార్ వివరించారు. మన దేశంలో డిజిటల్ అక్షరాస్యత చాలా తక్కువగా ఉండడంతో గురిపెట్టి మోసాలు చేసే ముఠాల పని సులభం అవుతోంది. ఆధార్ డేటాబేస్ ద్వారా ప్రభుత్వం వారికి మంచి వెసులుబాటు కలగకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జరగడం లేదని ట్రిబ్యూన్ వార్త స్పష్టం చేస్తోంది. మోసాలను బయటపెట్టిన రిపోర్టర్‌ను ప్రశంసించడం పోయి పోలీసు కేసులు పెట్టడం ద్వారా యుఐడిఎఐ కూడా సరియైన మార్గంలో ఆధార్ భద్రత విషయంలో లేదని కూడా తెలుస్తోంది.
‘ఆధార్ సమాచారం బయటకు పొక్కితే దేశ భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడినట్లే. ఆ సమాచారం ద్వారా వ్యక్తుల గుర్తింపు పత్రాల ఆచూకి సులభంగా పొందవచ్చు. సిమ్ కార్డులు వంటివి చేజిక్కితే చాలా సున్నితమైన ప్రాంతాలకు నేరస్థులు చొచ్చుకుపోవడం సులభం అవుతుంది’ అని కూడా కుమార్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ‘ఫిషింగ్’ జరిగిన అనేక కేసులు దృష్టికి వచ్చాయి. చాలా మంది వ్యక్తుల డబ్బును కొన్ని ముఠాలు మోస మార్గంలో సొంతం చేసుకున్నాయి. ఆ నేరస్థులు ఫొన్‌లో నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేస్తామని నమ్మబలికారు. మోసగాళ్లు ఇచ్చిన తమ వ్యక్తిగత వివరాలు సరిగా ఉండడంతో డిజిటల్ విద్య అంతగాలేక వారిని నమ్మిన వ్యక్తులు చివరకు మోసపోయారు.
ఆధార్ డేటాబేస్ నుంచి సమాచారాన్ని సంగ్రహించిన వారు కొందరు వ్యక్తులను ఎంచుకొని మోసం చేయడం ఇంకా సులభమని సైబర్ నేరాల నిపుణులు చెప్పారు. వ్యక్తులు డిజిటల్ వ్యవహారాల్లో నిష్ణాతులయినప్పటికీ మోసపోక తప్పని చాకచక్యాన్ని నేరస్థుల ముఠాలు ప్రదర్శిస్తాయన్నారు. ఎందుకంటే ఆధార్ డేటాబేస్ నుంచి పొందిన సమాచారం చాలా ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి సమాచారాన్ని ఎరగావేసి మోసం చేయడం తేలిక. సమాచార భద్రత విషయంలో యుఐడిఎఐ చాలా నిర్లక్షంగా ఉన్నదని పవన్ దుగ్గల్ అనే మరో నిపుణుడు ఇటీవల విమర్శించాడు. ఆధార్ సమాచారాన్ని చోరీ చేయడం ఎవరి తరం కాదని అనడం ఆ సంస్థ అసమర్థతకు, తప్పుడు ధోరణికి నిదర్శనమన్నారు. జనాభాకు, దేశీయ వ్యవహారాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో మెలగాల్సినంత పకడ్బందీగా యుఐడిఎఐ మెలగడం లేదని ఆయన అన్నారు. ముఖ్యంగా సైబర్ భద్రత విషయంలో అది చాలా బలహీనంగా ఆలోచిస్తోందని విమర్శించారు. అటువంటి ప్రైవేటు సమాచారంతో మెలిగే ఏ సంస్థ అయినా ఆ సమాచార భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త ప్రదర్శించాలని, యుఐడిఎఐ ఈ విషయంలో పూర్తిగా వెనకబడిందని దుగ్గల్ అభిప్రాయపడ్డారు. ఆధార్ భద్రత గాలిలో దీపంలా తయారయిందని ‘ది ట్రిబ్యూన్’ వార్త స్పష్టం చేస్తుండగా, యుఐడిఎఐ వైఖరి సమాచార చోరీ ఆపడంపై కాక, చోరీని బయటపెట్టిన వారిపై కక్ష గట్టే రీతిలో ఉండడం దేశ ప్రజలకు భయాందోళనలు కలిగిస్తోంది.

Comments

comments