Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఉరితాళ్ళయిన విద్యారుణాలు

edit

దేశంలో వేలాదిమంది ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు తమ చదువుకు చేసిన రుణాలను తిరిగి తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి ఇంజనీరింగ్ ఉద్యోగాలు రాకపోడంతో వేరే చిన్న చిన్న ఉద్యోగాలలో కుదురుకోవడం వల్ల రుణాలను తీర్చలేని పరిస్థితిలో పడ్డారు. తమిళనాడుకు చెందిన బి. జయరామన్ అనే విద్యార్థి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బాచిలర్ టెక్నాలజీ డిగ్రీ పొంది నాలుగు ఏళ్లయినా ఇంతదాకా ఇంజనీరింగ్ ఉద్యోగం రాలేదు. తంజావూర్‌లోని ప్రైవేట్ సంస్థనుంచి 2011లో ఆ పట్టా పొందిన అతడు చివరకు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలలో కుదురుకొన్నాడు. బీమా ఏజెంట్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా కూడా ఉద్యోగాలు చేశాడు. ప్రస్తుతం తంజావూరులో చిన్న నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. జీతం చాలక ఇంజనీరింగ్ చదువుకు తీసుకొన్న రుణం తీర్చలేక పోతున్నాడు. దేశంలో వేలాదిమంది ఇంజనీరింగ్ పట్ట భద్రులది ఇదే పరిస్థితి.
తమిళ విద్యార్థి జయ చంద్రన్ ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో తీసుకొన్న రూ.1.5 లక్షల రుణం ఇప్పుడు రూ.3 లక్షలు అయింది. ఇంజినీరింగ్ చదివి ఓడిపోయానని ఇప్పుడతను అంటున్నాడు. అతని తండ్రి తమిళనాడు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన రెండేళ్ల క్రితం తన కుమారుడి రుణ బకాయిలో రూ.45వేలు తీర్చారు. ఆ తర్వాత నెలసరి వాయిదాలు చెల్లించడం ఆయనకు సాధ్యం కావడం లేదు. చాలామంది ఇంజినీరింగ్ ఉద్యోగాలు రాని పట్టభద్రుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇంజినీరింగ్ చదువులకు చేసిన రుణాల భారం వారి తల్లిదండ్రులపై పడింది. దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఆర్థిక సహాయాన్ని అందించడం బ్యాంకు లు ప్రారంభించాక ఇంజినీరింగ్ కాలేజీల వ్యాప్తి విస్తారంగా జరిగింది.
2001లో చదువులకు రుణాలు ఇచ్చే పథకాన్ని నాటి ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పథకాన్ని 2006, తిరిగి 2009లో సవరించారు. వడ్డీ సబ్సిడీకి కేంద్ర పథకాన్ని ప్రవేశపెట్టడంతో చదువుల రుణాలపై వడ్డీ భారం లేకుండా అయింది. ఆ కోర్సు పూర్తికాలం తర్వాత కూడా ఏడాదిపాటు ఆ రుణంపై వడ్డీ లేదు. అయితే ఈ రుణ దరఖాస్తులకు ఒక షరతు విధించారు. ఆ విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.4.5లక్షలు మించకూడదు.2015లో విద్యారుణాలకు క్రెడిట్ గ్యారంటీ నిధి పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికింద ఎటువంటి కొలేటరల్(హామీ)చూపకుండా రూ.7.5లక్షల గరిష్ఠ రుణం తీసుకోవచ్చు.
అదే కాలంలో సాంకేతిక విద్య అందించే కళాశాలల సంఖ్య దేశం లో విపరీతంగా పెరిగింది. వాటి సంఖ్య 20062007లో 1600 కాగా 2016-17లో 3,391కి పెరిగింది. కళాశాలల వ్యాప్తి అంత విపరీతంగా ఉంటే విద్యాప్రమాణాలు పడిపోతాయని సాంకేతిక విద్య భారతీయ మండలి పలు సమావేశాల్లో హెచ్చరించినప్పటీ ఈ పెరుగుదల ఆగలేదు. మొత్తం బ్యాంకుల బకాయిల్లో విద్యార్థుల రుణాలు మొత్తం 2013 మార్చి నుంచి 2016 డిసెంబర్‌కు 142 శాతం పెరిగింది. ఈ మొత్తం రూ.6,336 కోట్లు అయింది.
ఇంజినీరింగ్ కోర్సుల కోసం తీసుకున్న రుణాలే అధికంగా బకాయిపడ్డాయి. అఖిల భారత బ్యాంకు సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వెంకటాచలం ఈ విషయం చెప్పారు. తన వద్దకు వచ్చే కేసులలో 90శాతం ఇంజినీరింగ్ బకాయిల కేసులే అని 2013లో విద్యారుణాల అవగాహన ఉద్యమం నడిపిన మాజీ బ్యాంకర్ రాజ్ కుమార్ చెప్పారు. తమిళనాడుతో సహా చాలా రాష్ట్రాలలో ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య పెరిగినట్లుగా వాటిలో విద్యా ప్రమాణాలు పెరగడం జరగలేదు. ఉదాహరణకు 500దాకా ఇంజినీరింగ్ కాలేజీలు గల తమిళనాడులో మౌలిక సౌకర్యాలు చాలా వాటిలో లేక ప్రమాణాలు పడిపోయాయి.
భారతీయ సాంకేతిక విద్యామండలి అందించిన సమాచారం ఇది. చాలాకాలంగా ఆ విద్యాసంస్థలను క్రమబద్ధీకరించనందువల్ల ఈ సమస్య వచ్చిందని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఆ మంత్రిత్వ శాఖ ‘విద్యా లక్ష్మీడాట్ కామ్’ అనే వెబ్‌సైట్‌ను ఆయన సారథ్యంలోనే ప్రారంభించింది. ఇంజినీరింగ్ విద్యా రుణాలకు, వడ్డీ సబ్సీడీకి దరఖాస్తు చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను నెలకొల్పారు. చాలా కేసులలో విద్యార్థులు తీర్చలేకపోయిన రుణ బకాయిలను కొంతకాలంపాటు తండ్రి తీర్చడం, తర్వాత చేతులెత్తేయడం జరిగింది. రుణాల మాఫీ కాలం పూర్తి అయ్యాక కూడా బకాయిలు చెల్లించని కొన్ని కేసులలో రుణ గ్రహీతలను పిలిపించి దర్యాప్తు జరుపుతారు. చాలామంది తల్లిదండ్రులు బ్యాంకు రుణభారాన్ని అవమానంగా భావించి తమ పిఎఫ్ సొమ్ము నుంచి తిరిగి చెల్లించడం చేస్తున్నారు.
సరియైన ఉద్యోగం లేక, బ్యాంకుల రుణభారం తీరక చాలా మంది విద్యా జీవితం అక్కడితో ముగిసిపోతోంది. ఈ సమస్య దేశమంతటా ఉన్నప్పటికీ, తమిళనాడు, కేరళలో విద్యా రుణాల ఎగవేత ఎక్కువగా ఉంది. ‘విద్యా రుణాల తిరిగి చెల్లింపు సమర్థన పథకం’ ను కేరళ గత ఆగస్టులో ప్రారంభించింది. అది రుణం నుంచి ఊరట కల్పించే పథకం కాదని వివరణ ఇచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ విద్యార్థి రుణంలో కొంత భాగం చెల్లిస్తుంది. ఏడాదికి రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేసింది. తమిళనాడులో అటువంటి పథకం ఏదీ లేదు. రుణ భారం భరించలేక ఇటీవల మదురైలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. రుణాల వసూలు ఏజెంట్లు వెంటపడి వేధించడం వల్ల 23 ఏళ్ల అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతని రుణ బకాయి మొత్తం రూ.1.9 లక్షలు. చదివే విద్యార్థులు, చదువు చెప్పే కళాశాలలు పెరిగినట్లుగా ఇంజినీరింగ్ రంగంలో ఉద్యోగాలు పెరగకపోవడం ఈ సమస్యకు మూలకారణమని విద్యారుణాల అవగాహన ఉద్యమ నాయకుడు రాజ్ కుమార్ తెలిపారు.
ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 40 శాతం మందికే ఉద్యోగాలు వచ్చినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ మార్చిలో తెలిపారు. తమ విద్యా సంస్థలు ఇచ్చిన తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ఆ విద్యార్థులు ఇప్పుడు అంటున్నారు. భారీ జీతాలతో నూటికి నూరుశాతం ఉద్యోగ కల్పన జరుపుతామని ఆ సంస్థలు హామీ ఇచ్చి విఫలం అయ్యా యి. ప్రభుత్వం కల్పించిన రుణ సౌకర్యం విద్యార్థులపాలిట యమపాశంగా మారడం ఇందులోని విషాదం.
* శ్రేయ రాయ్ చౌదరి

Comments

comments