123 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో చివరి టెస్టులో గెలుపు
4-0తో యాషెస్ సిరీస్ ఆసీస్ కైవసం
ప్యాట్ కమిన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’
సిడ్నీ: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఐదో టెస్టు చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 123 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0 ఆధిక్యంతో దక్కించుకుంది. సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేయడానికి ఒక్క టెస్టు మాత్రమే తగ్గింది. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరి టెస్టులోనైనా పరువు దక్కించుకుందామన్న ఆశతో వైరల్ ఉదరకోశ వ్యాధితో చికిత్స పొందుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఆసుపత్రి నుంచి వచ్చి బ్యాటింగ్ చేసినా ఫలితం దక్కలేదు. జోరూట్ ఎంతో చమటోడ్చి సిరీస్‌లో తన ఐదో అర్ధ శతకాన్ని కూడా నమోదు చేశాడు.
ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటిం గ్ ఎంచుకుంది. కమిన్స్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకే చేతులెత్తేసింది. ఆ తర్వాత బ్యా టింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 649 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో బ్యాట్స్‌మెన్ ఖవాజా 171, ఎస్. మార్స్ 156, ఎం.మార్స్ 101, స్టీవ్ స్మిత్ 83, వార్నర్ 56 పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 39 పరుగులిచ్చి 4 వికెట్లు, 54 పరుగులిచ్చి లియోన్ 3 వికెట్లతో రాణించారు.
రెండో ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన ఇంగ్లాండ్ మళ్లీ కమిన్స్ ధాటిని తట్టుకోలేకపోయారు. ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా 123 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. 1993లో హెడింగ్లేలో 148 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడే మళ్లీ ఇంత పెద్ద ఓటమి ఎదురైంది. ఎనిమిది వికెట్లు తీసుకున్న ప్యాట్ కమిన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు, 687 పరుగులు చేసి, అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ దావిద్ మాలన్ కన్నా 300 ఎక్కువ పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.