Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

అర్జున్‌పై ఆసీస్ మీడియా ఫిదా

arjn

ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సచిన్ తనయుడు

సిడ్నీ: క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌పై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. అర్జున్ ప్రస్తుతం సిడ్నీలో జరుగుతున్న గ్లోబల్ టి20 టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో అర్జున్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో సత్తా చాటిన అర్జున్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతేగాక బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 27 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ మీడియా అర్జున్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. అర్జున్ తన తండ్రిలాగే మెరుగైన క్రికెటర్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ప్రశంసించింది. బ్యాట్‌తో, బంతితో అతను చెలరేగుతున్న తీరు చూడముచ్చటగా ఉందని మీడియా అభిప్రాయపడింది. అర్జున్‌లో ఆల్‌రౌండ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అతను మంచి క్రికెటర్‌గా పేరు తెచ్చుకోవడం ఖాయమని ఆ మీడియా జోస్యం చెప్పింది. మరోవైపు అర్జున్ మాట్లాడుతూ తన తండ్రి సూచనలు పాఠించడం వల్లే తాను మెరుగైన క్రికెటర్‌గా ఎదుగుతున్నానని వివరించాడు. తన కోసం కాకుండా జట్టు గురించి ఆడాలని తన తండ్రి ఎప్పుడూ సూచిస్తు ఉంటారని, అందువల్లే బరిలోకి దిగిన ప్రతిసారి పూర్తి సామర్థం మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తానని అర్జున్ పేర్కొన్నాడు. తనకు ఫాస్ట్ బౌలింగ్ అంటే చాలా ఇష్టమన్నాడు. దీని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని వివరించాడు. మిఛెల్ స్టార్క్, బెన్ స్టోక్స్ తన అభిమాన బౌలర్లు అని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు దూసుకెళుతానని స్పష్టం చేశాడు. ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ఆడాలన్నదే తన కల అన్నాడు. దీని కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని తెలిపాడు. తాను సత్తానే నమ్ముకున్నానని, ఈ స్థాయికి చేరుకున్నానంటే తనలో ఉన్న ప్రతిభే కారణమన్నాడు. సిఫార్సులంటే తనకు ఇష్టం ఉండదని, తనను తాను నిరూపించుకునేందుకే ఇష్టపడతానని అర్జున్ పేర్కొన్నాడు.

Comments

comments