Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ఆధార్ తో జర భద్రం

AADAR

* సైబర్ క్రిమినల్స్‌కు టార్గెట్ కావొచ్చు 

*స్వల్ప, దీర్ఘకాలికంగా సవాళ్లను ఎదుర్కోనుంది
 *ఆర్‌బిఐ అనుబంధ సంస్థ రీసెర్చ్ నివేదిక

న్యూఢిల్లీ : బ్యాంక్‌ల నుంచి పథకాల వరకు ప్రతి దానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ ఆధార్ వివరాలు భద్రమైనా అంటే ఇప్పటికీ ప్రశ్నార్థకమే.. రూ.500లకే ఆధార్ వివరాలు పొందవచ్చని వచ్చిన వార్తలు ఇటీవల అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆధార్ వివరాల గోప్యతపై ఆందోళన ఎక్కువవుతోంది. ఆధార్ డేటా చాలా భద్రమంటూ ప్రభుత్వం ఊదరగొడుతున్నా.. ఎడ్వర్డ్ స్నోడెన్ వంటి నిపుణులు చెబుతున్న విషయాలను చూస్తే ఆందోళన కల్గించేవే.. కేవలం ప్రైవేట్ అధ్యయనాలు మాత్రమే కాక, ఆర్‌బిఐ అనుబంధ సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆర్‌బిఐ రీసెర్చర్లు ఆధార్ డేటా భద్రతపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌బిఐకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ ఇన్ బ్యాకింగ్ టెక్నాలజీ సమర్పించిన రీసెర్చ్ పేపర్ ఆధార్‌పై భద్రతా సమస్యలను బయటపెట్టింది. స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఆధార్ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపింది. దీనిలో యుఐడిఎఐ ప్రధానమైన సవాల్ తన ఆధీనంలో ఉన్న డేటాను భద్రపరచడమని పేర్కొంది. తొలిసారి సైబర్ క్రిమినల్స్‌కూ, భారత వెలుపలి శత్రువులకు ఆధార్ టార్గెట్‌గా అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ఈ వివరాలు బయటికి వస్తే, ఏ మేర నష్టం వాటిల్లుతుందో కూడా ఊహించలేమని పేర్కొంది. వ్యాపార పరంగా కొందరు ఈ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయి. అంతకంటే మించిన ఆందోళన సైబర్ ముప్పు.. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు పదేపదే జరుగుతున్నాయి. ఆధార్ ఇప్పుడు దేశంలో అత్యవసరంగా మారిపోయింది. ఎన్నో ప్రభుత్వ , బ్యాంకింగ్ వ్యవస్థలకు ఆధార్ అనుసంధానంగా ఉంది. ఇక సైబర్ నేరగాళ్లకు ఆధార్ సులువైన లక్ష్యంగా ఉంది. బయోమెట్రిక్ వివరాలే ప్రస్తుతం దేశీయ ముఖ్యమైన ఆస్తిగా ఆర్‌బిఐ రీసెర్చర్లు అభివర్ణించారు. ఏమైనా ఉల్లంఘన జరిగితే ఈ సమాచారం అంతా సైబర్ క్రిమినల్స్‌కు వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉందని, సమాచారం గోప్యతను కాపాడాల్సి ఉందని నివేదిక పేర్కొంది. ఇక ఆధార్ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ ప్రయోజనాలు మిశ్రమంగానే కన్పిస్తున్నాయని నివేదిక తెలిపింది.

5 వేల మంది సిబ్బందిపై యుఐడిఎఐ ఆంక్షలు

ఆధార్ డేటా ఉల్లంఘన వ్యవహారాన్ని యుఐడిఎఐ సీరియస్‌గా తీసుకుంది. అన్ని స్థాయిల్లో భారీ సంఖ్య లో ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తూ అధికారులకు షాకిచ్చింది. ఆధార్ పోర్టల్ నుంచి దాదాపు 5వేల మంది అధికారులపై ఆంక్షలు విధించినట్టు ఎకనామిక్స్  టై మ్స్ నివేదిక పేర్కొంది. ఆధార్ వివరాల్లో మార్పుల కోసం రోజూ 5 లక్షలకు పైగా అభ్యర్థనలు యుఐడిఎఐకి వస్తాయి. ఆధార్ యాక్సెస్ కోసం అధికారులకు ఇచ్చిన అన్ని ప్రత్యేక అధికారాలను తక్షణమే ఉపసంహరించుకుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. యుఐడిఎఐ వ్యవస్థను పునఃపరిశీలిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారి వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం  కేవలం బయోమెట్రిక్ ద్వారా మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కొంతమంది ప్రభుత్వ అధికారులతోపాటు ఇతర  ప్రైవేట్ ఆపరేటర్లకు  ‘పరిమితమైన‘ అవకాశం ఉంది.  తాజా మార్పు ప్రకారం ఆధార్ కార్డ్ హోల్డర్  వేలిముద్రల ద్వారా యాక్సెస్‌ను ప్రామాణీకరిస్తారు. దీంతో అందుబాటులో ఉన్న సమాచారం ఆ వ్యక్తికి పరిమితం చేయబడుతుంది. కాగా కేవలం రూ.500లకే  ఆధార కార్డ్  డేటా వివరాలు  లభ్యమని ఓ వార్తా సంస్థ నివేదించడం  సంచలనం రేపింది. అయితే ఈ వార్తలను ఖండించిన  యుఐడిఎఐ సదరు జర్నలిస్టుపై కేసు నమోదు చేయడం మరింత  విమర్శలకు దారి తీసింది.

Comments

comments