Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

‘భూం’ఫట్

cartoon

* కొనసాగుతున్న భూ ఆక్రమణలు
* అసైన్డ్ భూములకు ఎసరు
* రెవెన్యూ యంత్రాంగం నిర్వాకంపై విమర్శలు
* కోట్లాది రూపాయల్లో సాగుతున్న లావాదేవీలు

మన తెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో   జిల్లావ్యాప్తంగా భూముల దందా హద్దులు మీరి పోయిందని అంటున్నారు. భూబకాసురులు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు తెగబడుతున్నప్పటికీ వారిని అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిర్వీర్యమైందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. రాజకీయ అండదండలతో సాగుతున్న ఈ భూ ఆక్రమణల దందా వెనుక పెద్దల హస్తం ఉందన్న వాదనలున్నాయి. అధికారులపై ఒత్తిడిలు తెస్తూ వారిని దిగ్బందం చేస్తున్నారని అంటున్నారు. మాట వినని, తమకు అడ్డు తగిలే అధికారులపై కక్ష సాధింపు చర్యలే కాకుండా బదిలీ అస్త్రాన్ని సైతం ప్రయోగిస్తూ యధేచ్చగా తమ భూముల కార్యకలాపాలను సాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా అసైన్డ్ భూములకు నకిలీ నిరభ్యంతర ద్రువీకరణ పత్రాలను తయారు చేసి వాటిని లే అవుట్లు చేసుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లోని పలువురు వ్యక్తులు విక్రయించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఎవరు ఫిర్యాదు చేసినా వారిని భయభ్రాంతులకు చేయడం, ఫిర్యాదులను పట్టించుకోవద్దని అధికారులపై ఒత్తిడి తేవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇలా ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల తదితర ప్రాంతాలలో వందలాది ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నా పట్టించుకొనే వారు కరువవ్వడంతో ఈ వ్యవహారం నడిపించే వారికి అడ్డే లేకుండా పోతుందని అంటున్నారు. ముందుగా అసైన్డ్ భూములను గుర్తించి వాటికి సంబంధించిన పత్రాలను సృష్టించి ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా సంపాదించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా నూతన జిల్లా కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాలలో ఈ వ్యవహారం ఎక్కువగా సాగుతుందనే విమర్శలున్నాయి. గతంలో మంచిర్యాలలో ప్రభుత్వ భూమని కబ్జా చేయడం, దీనిపై విచారణ జరగడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నా రాజకీయ నాయకుల హస్తం ఉండడంతో అధికార యంత్రాంగం సైతం బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు మీనమేషాలు లెక్కిస్తుందని అంటున్నారు. అసైన్డ్ భూములతో పాటు శిఖం భూములు, వక్ఫ్ భూములకు నిరభ్యంంతర సర్టిఫికెట్లు పొందుతూ ప్లాట్లు వేసి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంతేకాకుండా నాలా ట్యాక్స్‌లు కట్టకుండా నిబంధనలకు విరుద్దంగా లే అవుట్‌లను వేస్తూ ధరలు పెరుగుతాయని ఆశ చూపిస్తూ లక్షలాది రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంపై అడపాదడపా వస్తున్న ఫిర్యాదులను కొందరు అధికారులు విచారణ పేరిట పక్కన పెడుతుండడం సైతం కబ్జా దారులకు వరంగా మారుతుందని అంటున్నారు. భూ ప్రక్షాళనలో భాగంగా అసైన్డ్, శిఖం, వక్ఫ్ భూముల వివరాలను పక్కాగా నమోదు చేసి కబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

Comments

comments