Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కంది కొనుగోలు తేమ యంత్రంలో గోల్‌మాల్

meeting

*అయోమయంలో రైతులు
*అధికారులపై ఆగ్రహం వ్యక్తం
చేసిన పిఎసిస్ చైర్మన్ కిషన్‌నాయక్
*మరో తేమ యంత్రంతో కొనుగోళ్లు
ప్రారంభించిన అధికారులు

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : ఎంతో కష్టపడి పండించిన కందిని కనీసం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా పలు శాఖల అధికారులు కుమ్మక్కై రైతులకు శఠగోపం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పన్నెండు శాతం తేమ ఉన్న క్వింటాలు కందుల కొనుగోలుకు ప్రభుత్వం 5 వేల 450 రూపాయలను నిర్దేశించింది. వికారాబాద్ మార్కెట్ కమిటీ గోదాంలో కందుల కొనగోలు కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు. కందులు విక్రయించడానికి వచ్చే రైతులు తమ కందుల శాంపుల్స్‌ను తీసుకువచ్చి తేమ శాతం యంత్రంలో వేయగా 12 శాతం కన్నా అధికంగా చూపుతుంది. దీంతో కందులను మంచిగా ఎండబెట్టి తీసుకురావాలని డిసిఎంఎస్ అధికారులు తిప్పి పంపుతున్నారు. దీంతో మళ్లీ ఎండలో ఎండబెట్టి శాంపుల్స్ తీసుకువచ్చి తేమ శాతం యంత్రంలో వేయగా మళ్లీ 12 కన్నా ఎక్కువ శాతం చూపుతున్నది. అనుమానం వచ్చిన శివారెడ్డిపేట పిఎసిఎస్ చైర్మన్ ఎన్.కిషన్‌నాయక్ కందుల కొనుగోలు కేంద్రానికి వెళ్లి డిసిఎంఎస్ అధికారులను నిలదీశారు. డిసిఎంఎస్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తేమ శాతం కొలిచే మరో యంత్రాన్ని తీసుకువచ్చారు అధికారులు. దానిలో కందులను వేయగా 10 శాతం తేమ ఉన్నట్లు చూపించింది. దీంతో ఆగ్రహం చెందిన పిఎసిఎస్ చైర్మన్ కిషన్‌నాయక్, రైతులు తేమ శాతం కొలిచే యంత్రాలను తీసుకుని జిల్లా కలెక్టర్‌ను కలువడానికి వెళుతుండగా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి వచ్చి కిషన్‌నాయక్, రైతులను సముదాయించి నూతనంగా తెచ్చిన తేమశాతం యంత్రం ద్వారా కందుల కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా శివారెడ్డిపేట పిఎసిఎస్ చైర్మన్ ఎన్.కిషన్‌నాయక్ విలేకరులతో మాట్లాడుతూ, కందులు కొనుగోలు చేయడానికి కనీస మద్దతు ధర 5,450 రూపాయలను నిర్ణయించిందని చెప్పారు. కందుల తేమ శాతం అధికంగా ఉన్నదని రెండుమూడు సార్లు తిప్పితే రైతులు కందుల కొనుగోలు కేంద్రానికి తిరగలేక గంజ్‌లోని కమీషన్ ఏజెంట్ల వద్ద కందులను విక్రయిస్తారని తెలిపారు. ఇదే అదనుగా భావించి కమీషన్ ఏజెంట్లు సిండికేట్‌గా ఏర్పడి రైతుల వద్ద నుంచి క్వింటాళు కందులను 3,800 రూపాయల నుంచి 4 వేల రూపాయలకు చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం బినామీ పేరుపై డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగే కందుల కొనుగోలు కేంద్రానికి క్వింటాళుకు 5,450 రూపాయల చొప్పున విక్రయిస్తారు. రైతుల కడుపుకొట్టి డిసిఎంఎస్ అధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు కుమ్మక్కై క్వింటాళుకు 15 వందల రూపాయల చొప్పున తక్కువ ధరకు రైతులు విక్రయించుకునేలా పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కందుల కొనుగోలు కేంద్రంలో డిసిఎంఎస్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే సంబంధంలేని మార్కెట్ కమిటీ చైర్మన్ వారికి వత్తాసు పలుకడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

Comments

comments