Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం

trs

*టిఆర్‌ఎస్, బిజెపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలు
*ఇక మిగిలింది ఓటర్లను ప్రలోభపెట్టడమే
*ఏర్పాట్లలో మునిగిన అధికారులు
*ఓటమి, గెలుపును మరో 24 గంటలలో నిర్ణయించనున్న ఓటర్లు

మన తెలంగాణ/వరంగల్‌బ్యూరో : వరంగల్ మహానగర పాలక సంస్థలోని 44వ డివిజన్‌కు జరుగనున్న ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ఈనెల 9న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగనున్నది. అనిశెట్టి మురళి హత్యతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికను అధికార పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. కాంగ్రెస్,ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా అధికార పార్టీకి మద్దతుగానే బరిలోకి రాలేదు. కాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం అభ్యర్థిని బరిలో నిలిపింది. టిఆర్‌ఎస్ పార్టీ తరుపున అనిశెట్టి మురళి భార్య సరితను బరిలో దింపగా బిజెపి మురళీపై ఓడిపోయిన కొలను సంతోష్‌రెడ్డినే బరిలో నిలిపారు. టిఆర్‌ఎస్ పార్టీకి దీటుగా హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించింది. కాని అధికార టిఆర్‌ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కార్పొరేటర్లు మొత్తం 44వ డివిజన్‌పై కేంద్రీకరించి ప్రచారం నిర్వహించారు.
* ఇంటింటా ప్రచారం…. టిఆర్‌ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు, నాయకులు టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిఆర్‌ఎస్ యూత్‌విభాగంతోపాటు, టిజిఏ, టిఆర్‌ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా ఇంటింటికి ప్రభుత్వ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. ఇంటింటి ప్రచారంలో ఎంఎల్‌ఎ, మేయర్,ఎంపితోపాటు కుడా చైర్మన్ పాల్గొన్నారు.
* చివరి రోజున బైక్ ర్యాలీ… ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వరంగల్ ఎంపి దయాకర్, ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్, మేయర్ నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. 44వ డివిజన్‌లోని ప్రతి గల్లీలో బైక్ ర్యాలీ నిర్వహించి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సరితను గెలిపించాలని ప్రచారం చేశారు.
* బిజెపి ముఖ్యనాయకులతో ప్రచారం… టిఆర్‌ఎస్ పార్టీకి దీటుగా బిజెపి ప్రచారాన్ని నిర్వహించింది. బిజెపి మాజీ ఎంఎల్‌ఎ మార్తినేని ధర్మారావు, బిజెపి అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డితోపాటు బిజెపి జాతీయ కార్యదర్శి ఆచారి, శాసన మండలి ప్రతిపక్షనేత రామచందర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి నేతలు వరంగల్ నగరంలో జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందని, కేంద్ర నిధులను ఖర్చు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకపోయారు. ఏది ఏమైనప్పటికి టిఆర్‌ఎస్, బిజెపి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరాహోరిగా నిర్వహించారు. ఎవరి గెలుపు,ఎవరి ఓటమి అనేది మరో 24 గంటలలో ఓటర్లు నిర్ణయించనున్నారు.

Comments

comments