Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఒంటరి మహిళలే… టార్గెట్

Chin-snacing

భయాందోళనల్లో నగరం, శివారు మహిళలు యథేచ్ఛగా పరారవుతోన్న దుండగులు నిమిషాల వ్యవధిలోనే రెండు సంఘటనలు ప్రభావం చూపని సాంకేతిక వ్యవస్థ, సిసికెమెరాలు 2017లో నమోదైన స్నాచింగ్‌లు మొత్తం 178 కేసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు

మన తెలంగాణ/సిటీబ్యూరో : వేగంగా లక్షం చేరుకోవాలని, నిందితులను పట్టుకోవడంలో ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పోలీసు యంత్రాంగానికి పెట్రోలింగ్‌కు కొత్తగా ఇన్నోవా వాహనాలను సమకూర్చింది. సమర్థవంతంగా పర్యవేక్షణ చేయడం, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టడానికి బ్లూకోట్స్‌కు మోటార్‌సైకిళ్లను ప్రభుత్వం చేకూర్చింది. ఇదిలా ఉండగా ఉన్నతస్థాయి అధికారులు నేరస్థులు నగరంలోకి రావాలంటేనే వెనుకడుగువేసేలా 10 లక్షల సిసిటీవి కెమెరాల ఏర్పాటు లక్షంగా ముందుకువెళ్తున్నామని ప్రకటిస్తున్నారు. కానీ హైదరాబాద్ మహానగరంలో చైన్‌స్నాచింగ్‌లు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ప్రజలు మెడలో నగలు వేసుకొని బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొన్నది. సిసిటీవి కెమెరాలున్నా పోలీసులకు సవాల్ విసిరినట్టుగా దుండగులు స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. నడివయసుదాటిన మహిళలనే లక్షంగా చేసుకుని స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసు యంత్రాంగంలోని పట్టింపులేని ధోరణి, పర్యవేక్షణలోని నిర్లక్షం, నిఘాలోని లోపాలను ఆసరాగా చేసుకున్న దుండగులు తమతమ చేతులకు పనిచెప్పుతూ యథేచ్ఛగా అనుకున్నది పూర్తిచేస్తున్నారు.

వరుసగా స్నాచింగ్‌లు
గురువారం కూకట్‌పల్లి పరిధిలో వెంటవెంటనే రెండు స్నాచింగ్‌లు చోటుచేసుకున్నాయి. ఉదయం వేళలోనే కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండు స్నాచింగ్‌లు చోటుచేసుకోవడం నగరంలో కలకలం రేకెత్తించింది. గత వారం రోజుల క్రితం ఎల్‌బినగర్, మీర్‌పేట్, బాచుపల్లిలో వరుసగా స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో మహిళలు నడుచుకుంటూ వెళ్లాలంటేనే భయాందోళనలకు లోనవుతున్నారు. ఉదయం ఇళ్ల ముందు వాకిళ్లను ఊడ్చాలన్నా, కిరాణం దుకాణాలకు వెళ్లాలన్నా బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా ఉండగా నిందితులు సిసిటీవిల్లో రికార్డు అవుతున్నామని తెలిసినా తాము నిర్దేశించుకున్న లక్షాన్ని పూర్తిచేసుకుని మరీ పరారవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి స్నాచింగ్ చేసేవారి సంగతి అలా ఉంటే నగరానికి చెందిన యువకులు, విద్యార్థులు స్నాచింగ్‌ల వైపు దృష్టి సారిస్తున్నారనేది పోలీసుల దర్యాప్తులోనే తేలుతున్నది. పెట్రోలింగ్ వాహనాల్లోని సిబ్బంది, బ్లూకోట్స్ బృందాల పర్యవేక్షణ లోపం వల్లనే ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నట్టు విమర్శలున్నాయి.

ప్రభావం చూపని సాంకేతిక వ్యవస్థ
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ. కోట్లాది రూపాయలు వెచ్చించి అమలులోకి తీసుకువస్తున్న సాంకేతిక వ్యవస్థతో పోలీసుల విధులపై, వారి బీట్లపై, పర్యవేక్షణపై నిఘాపెట్టవచ్చనేది ప్రకటనలకే పరిమితమైంది. 2017లో 178 (సైబరాబాద్‌లో 86, హైదరాబాద్‌లో 51, రాచకొండలో 41) చైన్ స్నాచింగ్‌లు చోటుచేసుకున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే టెక్నాలజీ ఎంతమాత్రం ప్రభావం చూపడంలేదనేది నగర, శివారు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు వెల్లడిస్తున్నాయి. పెట్రోలింగ్ వాహన, బ్లూకోట్స్ బృందాల పనితీరును మెరుగుపరచలేకపోతున్నట్టు స్నాచింగ్‌లు జరుగుతున్న తీరు వెల్లడిస్తున్నది. కేవలం నిందితులను పట్టుకోవడంలోనే కీలకంగా మారుతుందే తప్ప నేరాల నియంత్రణలో, పోలీసుల్లోని నిర్లిప్తతను పోగొట్టడంలో నిరుపయోగంగా మారిందనే విమర్శలున్నాయి.

Comments

comments