Search
Monday 23 April 2018
  • :
  • :

జంతువులకు సేవ ప్రత్యక్ష దైవాలకు ఈసడింపు!

వినడానికి కఠినంగా ఉన్నా, అతిగా అనిపించినా మనలో చాలామంది కుక్కపిల్లలను పెంచడంలో చూపించే శ్రద్ధ, వాటిమీద కురిపించే ప్రేమ వయసుడిగిన తల్లిదండ్రుల మీద, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల మీద చూపించలేక పోతున్నారన్నది వాస్తవం! చాదస్తం, సర్దుకు పోవడం లేదు, కొత్త వాతావరణానికి అలవాటు పడటం లేదు, వెనుకటి అలవాట్లు మానుకోవడం లేదు, కొత్త కుటుంబ సభ్యులను గుర్తించడం లేదు, మంకుపట్టు పడతారు. ఇలాంటి కారణాలేవైనా మనలో చాలామంది తల్లిదండ్రులను ముఖ్యం గా వయోవృద్ధులను దూరంగా ఉంచడానికే మొగ్గుచూపుతున్నారన్నది వాస్తవం. కుక్కపిల్ల చేష్టలను ఓర్పుతో భరించే మనం వయసు తెచ్చిన చిత్త వైకల్యమో, లేక పిల్లలు పెద్దవారయ్యారు, నిర్ణయాలు తీసుకోగల సమర్థులు అన్న విషయాన్ని గ్రహించలేని బలహీనత వల్లనో ముసలి తల్లిదండ్రులు, అమ్మమ్మ/నాన్నమ్మ, తాతయ్యలు బెట్టు చేస్తే భరించలేక పోతున్నాం. మూగ జీవాలమీద చూపుతున్నది మానవత్వమైతే, మనసుపెట్టి మాటలాడే తల్లిదండ్రుల పట్ల, ముసలి అవ్వల పట్ల మన దాష్టీకాన్ని ఏమని పిలవాలి? మన చిన్నతనంలో అన్నివేళలా మనం అమ్మానాన్నల మనసెరిగి అనుకూలంగా మసలుకున్నామా? మారాం చేయలేదా? ధిక్కరించలేదా?ప్రశ్నించలేదా? పారిపోతానని బెదిరించలేదా? హక్కులకోసం పోరాటం చేయలేదా?నాడు మనలను ఆవహించిన పసితనమే నేడు వయసుడిగిన మన అమ్మానాన్నలను, తాతయ్యలను అమ్మమ్మ, నాన్నమ్మలను ఆవహించింది, ఇది ప్రకృతి సహజం. నాడు పసితనంలో మన ప్రశ్నలను ఓపికగా విని, తిరుగుబాటును ప్రేమతో సహించి, బెదిరింపులకు భయపడి, హక్కులను గుర్తిస్తూ మనమీద మన అమ్మా నాన్న లు చూపిన ఔదార్యం, కురిపించిన ప్రేమామృతం, మన కోరికలు నెరవేర్చడానికి చేసిన త్యాగాలు, వొదులుకున్న సొంత సుఖాల్లో కొంతయినా నేడు మనం వారిపట్ల చూపలేమా? పసితనంలో తెలిసీ తెలియక తప్పటడుగులు వేసినప్పుడు మనకు ఆసరాగా నిలిచిన, గోరుముద్దలు తినిపించిన చేతులవి, మనకు నడకలు నేర్పిన పాదాలవి, కళ్ళలో వత్తులు వేసుకొని మన కండ్లలో నిద్ర కొరకు ఎదురుచూసిన నేత్రాలవి, నేడు వయసుడిగి, కండరాలలో పట్టు సడలి ఆసరాకు ఎదురు చూస్తున్నాయి, ఊతం గా నిలబడలేమా? సుదీర్ఘ తీరాలకు అడుగులు వేస్తున్న వారి ఈ చివరి మజిలీలో పసితనపు చిరునవ్వులను వారికి పరిచయం చేయలేమా?
పాలు, బిస్కట్లు, కోడిగుడ్లు, బొక్కలు, సబ్బులు, వాక్సిన్‌లు అంటూ నెలకు 2 వేలు కుక్కకు ఖర్చు చేస్తాం కాని చిన్నతనంలో తమ అవసరాలను, కోరికలను చంపుకొని మన కోరికలకోసం ఖర్చుచేసిన తల్లి దండ్రుల కొరకు 500ఖర్చు చేయడానికి వెనుకా ముందు చేస్తాం, అసలు వారికి అవసరాలు ఉంటాయనే గుర్తించడం లేదు! కుక్కల మేటింగులమీద చూపే శ్రద్ధలో పదోవంతు కూడా తల్లిదండ్రుల హెల్త్ చెకప్ మీద చూపడం లేదు! మన కడుపున పుట్టిన పిల్లల కోరిక మేరకు పెంచుకుంటున్నామని సరిపెట్టుకుందామా, మరి మనలను కనిపెంచిన వారిపట్ల మనకు బాధ్యత లేదా! రెండురోజులు ఊరు కెళితేనే పెంచుకున్న కుక్కను డాగ్ కేర్ సెంటర్‌లోనో లేదంటే నమ్మకమైన పక్కింటి వారికో, బంధువులకో అప్పగించి పూటపూటకి దాని ఆలనా, పాలనా తెలిసికొనే ప్రేమమూర్తులైన మనం వయసు ఉడిగిన తల్లిదండ్రులను, బామ్మలను, జేజమ్మలను, తాతయ్యలను వాళ్ళ మానాన ఒదిలేసి రోజుల తరబడి తిరుగుతున్నాం, వేరు కాపురాలు పెడుతున్నాం. వారి ఆలనాపాలనా గుర్తురాదెందుకో! పొద్దున్నే ఇంత వండేసి దాన్నే సాయంత్రం కూడా తినేయమని చెప్పి మరునాడు ఉదయమే వస్తామంటూ ముసలివాళ్లను ఇండ్లలో ఒంటరిగా వదిలేసి వెళ్ళే వాళ్లెందరో ఉన్నారు మనలో, ఆ ఒంటరి పక్షులకు ఏదైనా జరగరానిది జరిగితే, ఆత్మీయ పలుకులేని ఆ ముసలి గుండె ఆగిపోతే ఎలా అనే ఆలోచనే మనకు రాదెందుకు! వయసుడిగిన మన తల్లిదండ్రులకు, నాన్నమ్మ, తాతయ్యలకు చోటులేని మన ఎసి కారులో ఆశ్చర్యంగా పెంపుడు కుక్కలకు మాత్రం ప్రత్యేక ప్రవేశం ఉంటుంది! మనసు విప్పలేని మూగ జీవానికి, నోరున్నా బలవంతంగా మనసు కట్టేసుకుంటున్న ముసలివాళ్ళకు తేడా లేదంటారా?
చిన్న విశ్వాసానికే పొంగిపోయి కుక్కపిల్లకు ఎంతో చాకిరీ చేస్తు న్నాం, చిన్నతనంలో అమ్మ వెళ్ళమంటే ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణంలోకి వెళ్ళటానికి కూడా బద్దకించి, మసకబారిన నాన్న చూపుమీద శ్రద్ధ చూపకుండా పెంచుకున్న కుక్కకు చికెన్ బొక్కలకోసం మార్కెట్ మొత్తం వెతుకుతాం. కుక్క బిస్కెట్ల కొరకు ఎంతైనా ఖర్చు చేస్తాం. కుక్కను కొనడానికి, వాక్సిన్‌ల కొరకు, సబ్బులని, షాంపులని ఎంతైనా ఖర్చు చేసే మనం ఇంట్లో ఉన్న ముసలివాండ్ల కనీస ఖర్చుల విషయంలో మాత్రం లెక్కలు వేసుకుంటాం, అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య వాటాలు వేసుకుంటాం! వంతులు పెట్టుకుంటాం? నాడు నేను అమ్మ కొడుకును, నేను నాన్న బిడ్డను అని పోటీపడి మన అవ్యాజమైన ప్రేమతో నాడు వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేసిన మనం, నేడు మలి వయసు లో అమ్మ బాధ్యత నీదే, నాన్నను నేను భరించలేను నీతో ఉంచుకో అంటూ విదిలించుకుంటున్నాం, అదనపు బరువంటూ నిట్టూరుస్తు న్నాం! మనమే లోకమనుకుని మనకోసం ఎన్నో వదులుకున్న వారి విలువ కుక్క విశ్వాసం పాటిది కాదా? ఇంతకూ మన విశ్వాసం ఏపాటిది?
తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళిన తరువాత ఘనంగా జరిపే ఖర్మకాండల మీద చూపే శ్రద్ధలో పావలావంతు కండ్లముందు కదలాడుతున్న రోజుల్లో మనింట్లోని ముసలివాండ్ల మీద చూపగలిగితే, ఆప్యాయతతో కూడిన స్పర్శను, మాటను వారి కందించగలిగితే వారు జీవన్ముక్తులు కారా? ఎవరూ చూడని వైతరణిని దాటించాలనుకోవడం కన్నా బ్రతికుండగా ఆదరించడం గొప్ప కర్మ కాదంటారా? అంతిమ ఘడియల్లో ఆప్యాయతకు, ఆసరాకు అంగలార్చిన తల్లిదండ్రులు, తాతయ్య లు, అమ్మమ్మ, నాన్నమ్మలు తనువు చాలించిన తరువాత పిండాల రూపంలో మనం పెట్టే మృష్టాన్న భోజనం కోసం ఆత్మలుగా ఎగిరివస్తారంటారా? మూగజీవాల మీద కురిపిస్తున్న వల్లమాలిన ప్రేమలో కొంతైనా మలిసంధ్యలోని కన్నవారిమీద చూపించగలిగితే అంతకు మించిన మహాయజ్ఞం, కర్మయోగం మరోటి ఉండదు కదా. బ్రతుకంతా ధారబోసి కట్టుకున్న తన స్వంత ఇంట్లో ఎక్కడో ఓ మూలన ఇంకా చెప్పాలంటే ఇంటిని ఆనుకొని ఉన్న ఏ షెడ్డులోనో, పాత పాకలోనో చావుకోసం ఎదురు చూస్తూ చుట్టూ తనవాళ్లున్నా తానుమాత్రం ఒంటరిగా బతుకులీడుస్తున్న నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఎందరో. ఎసి రూముల్లో మనముంటే ఏసిసి షెడ్లలో మనింటి పెద్దలు! ఎండలో మాడిపోతుందని, వానలో తడిసి పోతుందని కుక్కపిల్లలకు మన పక్కలో కాదంటే పడకకింద చోటిచ్చే గొప్ప మనసున్న మనకు తనువిచ్చిన తల్లికి, దారి చూపిన తండ్రికి కాసింత చోటిచ్చే మనసే ఉండటం లేదు ఎందుకు? పిల్లలకు ప్రత్యేక పడక గదులు నిర్మించుకుని మురిసిపోతున్న తల్లిదండ్రులు విరివిగా అగుపిస్తున్నారు కాని తల్లిదండ్రులకు, నాన్నమ్మ, తాతయ్యలకు ప్రత్యేక పడక గదులు నిర్మించుకుంటున్న పిల్లలు, మనుమలు, మనుమరాండ్లు తోకచుక్క వోలె ఎక్కడో అక్కడ మాత్రమే అగుపిస్తున్నారు. మార్పుకు మనమే శ్రీకారం చుట్టలేమా? పెద్దలు అని కసురుకోకుండా వారిని మన పిల్లల్లాగే చూడలేమా? మారాం చేస్తే మనసు మీదకు తీసుకోకుండా మన పిల్లలతో పాటు క్షమించలేమా.

చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
9440449392

Comments

comments