Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

వర్గీకరణలు తప్పవు

వెనుకబడిన తరగతులను (బిసి) వర్గీకరించిన విధంగానే షెడ్యూల్డు కులాలను(ఎస్‌సి), షెడ్యూల్డు తెగలను (ఎస్‌టి) కూడా వర్గీకరించటం ఒక తప్పనిసరి అవసరం. ఎస్‌సి, ఎస్‌టి వర్గీకరణలను వ్యతిరేకిస్తున్నవారు న్యాయమైన దృష్టితో ఆలోచించినట్లయితే ఇది కాదనలేని విషయం. అట్లా వ్యతిరేకిస్తున్న వారికి ప్రస్తుతం పలురకాలైన బలాలు ఉన్నందువల్ల వర్గీకరణను ఆపగలుగుతుండవచ్చు. కాని ఆ విధంగా ఆపగలిగినంత మాత్రానవారి వైఖరి న్యాయమైనది కాబోదు. ఎస్‌సిల సంగతి చూసినట్లయితే, వర్గీకరణను మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అన్నిరాజకీయ పార్టీలు అందుకు అనుకూలంగా ఉండటాన్ని బట్టి మాలలు ఒంటరి అయినట్లు కన్పించటం లేదా? ఏ ఒక్క పార్టీ మినహాయింపు లేకుండా ఇదే వైఖరిని చాలా కాలం క్రితమే తీసుకున్నాయి. అందులో దాపరికం లేకుండా ఆ పని బహిరంగంగా చేశాయి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాలను పలుమార్లు ఆమోదించాయి. ఆ పని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జరిగింది. దీనిని బట్టి తాము ఈ విషయంలో ఒంటరులమని మాలలకు అర్థం కావాలి. పార్టీలకు మాలల ఓట్లు కావాలి. సంఖ్య రీత్యా ఉమ్మడి రాష్ట్రంలో మాలలకన్న మాదిగలు కొద్ది గా ఎక్కువ. కాని వారిద్దరి జనాభాలు కేంద్రీకృతమై ఉన్న దానిని బట్టి ఆంధ్రలో మాలలు, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తంగానే ఆంధ్రాలో మాదిగలకన్నా మాల ల సంఖ్య ఎక్కువ. తెలంగాణలో పాత పరిస్థితే కొనసాగుతూ మాదిగలు ఎక్కువగా ఉన్నారు.
కాని ఇందులో గుర్తించవలసింది ఏమంటే, అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ అనుకూల వైఖరిని తీసుకోవటంలో ఇటువంటి రకరకాల లెక్కలు, వాటి కోణాలు ఏవీ పనిచేసినట్లు కన్పించదు. ఒకవేళ ఉమ్మ డి రాష్ట్రంలోగాని, తర్వాత గాని మాలల కన్న మాదిగల సంఖ్య మరీ ఎక్కువై ఉంటే మాదిగల ఓట్ల కోసం ఆ పని చేసారనేందుకు ఆస్కారం ఉండేది. కాని పరిస్థితి అది కాదు. దానిని బట్టి, వర్గీకరణ కోరికలోని సమంజసస్థితి ఎవరూ ఎంతమాత్రం విస్మరించలేని విధంగా ఉందనాలి. ఇందుకు సంబంధించిన అన్ని గణాంక వివరాలు సమాజం ముందున్నాయి కూడా. అందువల్లనే కేంద్ర ప్రభుత్వ కమిషన్ సైతం ఆ మాట ను కాదనలేక పోయింది. రాజకీయ పార్టీలే కాదు. సామాజికంగా మేధావి వర్గాలు కూడా దీనిపై ఏకాభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. స్వయంగా మాలలు అయిన పలువురు మేధావులు, కళాకారులు, రచయితలు సైతం వర్గీకరణ అనుకూల వైఖరి తీసుకుని, ఆ మాట పైకి అనటాన్ని బట్టి ఈ కోరికలోని న్యాయం ఎంతటిదో తేలికగా అర్థం చేసుకోవచ్చు.
ఎస్‌సిలను వర్గీకరించటం మాలల పట్ల వ్యతిరేకతతో ఎంతమాత్రం కాదు. అటువంటి అవసరమూ ఎవరికీ లేదు. కేవలం మాదిగల స్థితిగతులను గుర్తించి, వారికి కూడా రిజర్వేషన్లలో సమంజసమైన అవకాశాలు లభించాలన్న దృష్టితో మాత్రమే అందరూ ఈ వైఖరి తీసుకుంటున్నారు. దళితులకు సంబంధించిన చరిత్ర ఏమిటో, మాలమాదిగల మధ్య పరిణామ క్రమంలో ఈ వ్యత్యాసాలు ఎట్లా ఏర్పడ్డాయో ఈ రోజున ఎవరూ ఎవరికీ చెప్పనక్కరలేదు. ఈ పరిణామాలలో మాలల పాత్ర, దోషం ఉందని ఎవరూ అనటం లేదు.
మనదేశంలోని కుల వ్యవస్థ, దానిని ఉపయోగించుకున్న సామాజికఆర్థికరాజకీయ వ్యవస్థలు ఇందుకు కారణమని అంద రూ అంగీకరిస్తున్నదే. అదే సమయంలో ఈ వ్యవస్థలు, పరిణామ క్రమాల ఫలితంగా మాదిగలు ఎక్కువ నష్టపోవటమన్నది ఈ రోజున మనకి కనిపిస్తున్న వాస్తవం. అందుకు పరిష్కారం అవసరం. అది కేవలం రిజర్వేషన్లు, వర్గీకరణ కాకపోయినా, అది ఒక కీలకమైన పరిష్కారమన్నది నిజం. మాదిగలు అనేక విధాలుగా ముందుకు వచ్చి, తమ మాల సోదరులతో సమానమయేందుకు ఇది తోడ్పడుతుంది.
అట్లా ముందుకు వచ్చేందుకు వారికి ప్రత్యేక నిధులు, చదువులు, శిక్షణలు కల్పిస్తే సరిపోతుంది గదానని, వర్గీకరణ ఎందుకనే అభిప్రాయం ఒకటుంది. స్థూలంగా చూసినపుడు ఇందులో విలువ ఉంది. కాని వివరాలలోకి వెళ్ళినపుడు ఈ ప్రతిపాదన ఆచరణలో అంత సులువైనది కాదు.– దాని అమలు ఎంత బాగా జరిగినా ఆ మార్గంలో సమానతా సాధనకు ఎన్ని దశాబ్దాల కాలం తీసుకోగలదో, అసలు ఎప్పటికైనా అది సాధ్యమవుతుందో ఎవరూ హామీ ఇవ్వలేరు. అసలు వర్గీకరణ అంటూ ఒక మార్గం ఎదురుగా ఉండగా ఇదంతా ఎందుకనే ప్రశ్న ఉండనే ఉంది. దానికి సమాధానం చెప్పటం తేలికకాదు. పైగా, ఇదే విధమైన వర్గీకరణకు బిసిలలోని ముందుబడిన కులాలనుండి వ్యతిరేకత లేనపుడు, ఎస్‌సిలలో ముందుబడిన వారికి అభ్యంతరం ఎందుకుండాలి? ముస్లిములలో కూడా వర్గీకరణలు ఉండి, అసలు తమలో కులాలే లేవనే ఒక మతం వారు కులం ఉనికి అనే వాస్తవిక స్థితిని గుర్తించినపుడు, ఎస్‌సి వర్గీకరణను కాదనటం ఏ న్యాయ సూత్రాలప్రకారం, ఏ సామాజిక సూత్రాల ప్రకారం సహేతుకమవుతుంది. వర్గీకరణ వల్ల దళితుల ఐక్య గుర్తింపు, వారి మధ్య సంఘీభావాలు, వారంతా కలిసి ఈ “కుల వ్యవస్థపై, దోపిడీ వ్యవస్థపై” పోరాడగల బలిమి దెబ్బతింటాయనే వాదన ఒకటి మాలలవైపు నుంచి ఉంది. మాదిగల వెనుకబాటుతనం, వారి వర్గీకరణ కోరిక దశాబ్దాలనుంచి కొనసాగటం, రెండు దళిత కులాల మధ్య తీవ్రమై మనస్యాలవల్ల, ఇవి ఎప్పటికి తేలేదీ ఊహించని పరిస్థితుల మధ్య, మాలలు అనే ఐక్యత, ఉమ్మడి పోరాటాల మాట కేవలం ఒక అపహాస్యంగా కన్పించటం లేదా? పోనీ అదెట్లా సాధ్యమో వారు తమ మాదిగ సోదరులతో మాట్లాడి ఒప్పించగలరా?
షెడ్యూల్డు తెగల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వారి రిజర్వేషన్లు అత్యధిక భాగం లంబాడాలకు లభిస్తుండగా, ఆదివాసీ తెగలైన గోండు, కోయ, నాయక్ పోడ్ మొదలైన పలువురు మాదిగల వంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. అందువల్లనే, ఎస్‌సి వర్గీకరణను సమర్థించే వారంతా ఎస్‌టి వర్గీకరణకూడా న్యాయమైనదని భావిస్తున్నారు. ఆసక్తికరం ఏమంటే రెండు కేసులలోనూ పరిస్థితులు చాలావరకు ఒకటిగా ఉన్నాయి. ఒక ముఖ్యమైన తేడా మాల మాదిగలు ఇద్దరూ అనాదిగా ఇక్కడి స్థానికులు కాగా, గోండులు కోయలు మొదలైనవారితో పోల్చినపుడు లంబాడాలు మధ్యలో ఇటువచ్చినవారు. కాని ప్రతి అంశాన్ని చారిత్రకంగానే చూడటం ఆచరణ రీత్యానైనా, తార్కికంగా నైనా వీలుపడేది కాదు. అందువల్ల, 1947లో స్వాతంత్య్రం నాటి నుంచి ఆధునిక రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు దేశంలో ఏర్పడినందున, వర్తమాన స్థితిగతులను బట్టి పరిష్కారాలను వెతకవలసి ఉంటుంది. లంబాడాలకన్న ఆదివాసీలు బాగా వెనుకబడి ఉండటమన్నది స్పష్టంగా కన్పిస్తున్న విషయం. ఇపుడున్న పరిస్థితులు, పరిపాలనా పరమైన తీరు ఇదే విధంగా కొనసాగితే వారి మధ్య సమానత గాని, అంతకన్న ముఖ్యంగా ఆధునిక వ్యవస్థ రాజ్యాంగపరంగా, చట్టాలరూపంలో కల్పిస్తున్న అవకాశాలను ఆదివాసీలు అందుకోగలగటగటం కాని అనుమానాస్పదం. మాదిగల విషయమై మాలలు చెప్తున్నట్లు, ఆదివాసీలకు ప్రత్యేక నిధులు, చదువులు, శిక్షణల మార్గం అన్నది ఆచరణలో సందేహాస్పదం. అందువల్ల సమానతలు, లంబాడాల స్థాయికి చేరటం, అవకాశాలను వినియోగించుకోవటం వంటివన్నీ జరిగేదీ లేనిదీ తెలియని అరచేతి స్వర్గపు మాటలు.
కనుక, తిరిగి మాలమాదిగ పరిస్థితి మాటనే చెప్పాలంటే, వర్గీకరణ మార్గం ఒకటి తక్షణం రూపంలో ఎదురుగా ఉన్నప్పుడు, బిసిలలో అది జరిగినపుడు, ఎస్‌టిలలో ఎందుకు జరగకూడదు? ఈ రెండు సమస్యలకు ఆదర్శవంతమైన, అత్యంత ప్రజాస్వామికమైన పరిష్కారం ఒకటున్నది. అది, మాలలో, లంబాడాలలో న్యాయం గా ఆలోచించే వారంతా కలిసి, వర్గీకరణ న్యాయమైనదని వివరిస్తూ తమ వారిని అందుకు ఒప్పించటం. అందుకు వారొక ఉద్యమం వంటిది చేయాలి.

టంకశాల అశోక్
9848191767

Comments

comments