Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

గ్రీన్‌సోల్‌తో సమాజసేవ

Life-style-image

ఇంట్లో పాతబడిన షూలు ఉంటే ఏం చేస్తాం …ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? బయట పడేస్తాం. అంతేకదా..పాత షూలను చెప్పులుగా మార్చి పేదలకు అందించాలనే వినూత్న ఆలోచనే గ్రీన్‌సోల్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది…ఎలా వచ్చిందో చూద్దాం…

ముంబయికి చెందిన శ్రేయాన్స్ అతని స్నేహితుడు రమేశ్ ధామి ఇద్దరూ మారథాన్ రన్నర్లు. ప్రాక్టీస్‌లో, పోటీల్లో వీరిద్దరూ ఉత్సాహంగా పాల్గొనేవారు. దీంతో నెలకు రెండుమూడు జతల బూట్లు పాడైపోయేవి. వాడుకున్న ఖరీదైన బూట్లను ఊరికే బయట పడేసే బదులు రీఫర్నిష్ చేసి తిరిగి వాడుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు. ఈ ఆలోచనే గ్రీన్‌సోల్‌కు బీజం వేసింది. సామాజిక బాధ్యతగా ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపార రూపం దాల్చింది. రతన్‌టాటా, ఒబామా లాంటివారి ప్రశంసలు అందుకుంది. 2014లో పదిలక్షల పెట్టుబడితో ముంబయి కేంద్రంగా గ్రీన్‌సోల్ సంస్థను స్థాపించారు. జనం వాడి పడేసే బూట్లను సేకరించి, మరమ్మతు చేసి విరాళంగా అందించడం, ఇంకాస్త ఫ్యాషన్‌గా తయారుచేసి విక్రయిస్తుందీ సంస్థ. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు ఎవరైనా సరే పాత బూట్లు, చెప్పులు, సోల్, లేసులను విరాళంగా అందించవచ్చు. షూ మరమ్మతు కోసం అయ్యే ఖర్చు కూడా దాతే ఇవ్వాలి. ఒక్కో జతకు రూ.199 అందించాల్సి ఉంటుంది. బూట్ల సేకరణ కోసం దేశంలో నాలుగువేల కేంద్రాలున్నాయి. ఆంధ్రప్రేదేశ్, తెలంగాణలో 15 పాయింట్లున్నాయి. గతేడాది లక్ష జతల బూట్లను, రూ.20కోట్లను విరాళంగా సేకరించారు. టాటా, రోల్స్ రాయిస్, ల్యాండ్ రోవర్, ఎల్ అండ్ టీ, వివంత, నాప్‌టోల్, జస్ట్ డయల్, యాక్సిస్ బ్యాంక్, సిగ్నా టీటీకే, మేక్‌మై ట్రిప్ వంటి వందలాది కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నారు. సేకరించిన బూట్లను ముంబయిలోని రీఫర్బిష్ కేంద్రలో మరమ్మతు చేస్తారు. ఒక జత తయారుచేయడానికి అరగంట పడుతుంది.

మరమ్మతు చేసిన చెప్పులను నెలకోసారి ఒక్కోప్రాంతంలో చెప్పుల్లేని ప్రజలకు , గ్రామాల్లోని పాఠశాలలకు అందజేస్తున్నారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62వేల జతల చెప్పులను దానం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 4వేల జతల బూట్లను విద్యార్థులకు అందజేశారు. వీటిని అడిడాస్ కంపెనీ స్పాన్సర్ చేసింది. ఒరిస్సాలో 4,500 జతల చెప్పులను అందించారు.
ఆన్‌లైన్‌లోనూ…

గ్రీన్‌సోల్ కంపెనీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చుల కోసం కొన్ని రకాల ఫ్యాషన్ చెప్పులను కూడా తయారుచేస్తున్నారు. వీటి విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును నిర్వహణ ఖర్చులుగా వినియోగిస్తున్నారు. డిజైన్‌ను బట్టి వీటి ధర రూ. 600, -1200లుగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షల వ్యాపారాన్ని చేసినట్లు వారు తెలిపారు. ఈ ఏడాది రూ.20లక్షల టర్నోవర్‌ను లక్షంగా పెట్టుకున్నారు. సంస్థ మరింత వృద్ధి చెందాలని కోరుకుందాం.

Comments

comments