Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

పల్లెల్లో నిరంతర వెలుగులు

electric*రూ.67.43 కోట్లతో విద్యుత్ ఆధునీకరణ
*సబ్‌స్టేషన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు
*వేసవిలోనూ కరెంట్ సమస్యకు చెక్

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో సోమవారం నుంచి నిరంతరాయంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తూ రికార్డు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా గృహ అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ అంతరాయం కలుగకుండా వుండేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల విస్తరణ, అవసరమైన సబ్‌స్టేషన్‌ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నది. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం 67.43 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టడానికి 30కోట్లు మంజూరు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఆధునీకరణ పనులు చేపట్టడానికి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద 37.43 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద 37.43 కోట్ల రూపాయలతో సబ్‌స్టేషన్‌ల సామర్థాన్ని పెంచడం, విద్యుత్ లైన్ల సామర్థం పెంచడం వంటి పనులు చేపట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, సదాశివపేట పట్టణాల్లో వుండే విద్యా వంతులు, ఇతర వ్యాపార వర్గాల్లో విద్యుత్ శాఖ పట్ల సదభిప్రాయం వుండేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అధికారులు పనులను ముమ్మరంగా చేపడుతున్నారు.

పట్టణాల్లో ఏ వీధిలో కూడా సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం కింద ప్రభుత్వం విడుదల చేసిన 30 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అధికారులు సంగారెడ్డి మున్సిపాలిటీకి రూ.7.57 కోట్లు, జహీరాబాద్, సదాశివపేట మున్సిపాలిటీలకు రూ.7.62కోట్ల్ల చొప్పున, పటాన్‌చెరుకు రూ.8.48 కోట్లు  కేటాయించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులతో అధికారులు పటాన్‌చెరు, జహీరాబాద్ పట్టణాల్లో సబ్‌స్టేషన్‌ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌ను దాదాపు మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్ ఎనిమిది మెగావాట్ల సామర్థంతో జహీరాబాద్‌లోని పస్తాపూర్, పటాన్‌చెరులోని  బండ్లగూడలో ఈ సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. గతంలో వర్షాలు పడినా, ఈదురు గాలులు వచ్చినా చెట్ల కొమ్మలు తగిలి ఇతర కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడేది. కానీ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, సదాశివపేట పట్టణాల్లో 160 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్లు మొత్తం 40 వరకు ఏర్పాటు చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు జహీరాబాద్, పటాన్‌చెరు, సంగారెడ్డిలో 40 అదనంగా వంద కిలోవాట్ల సామర్థం గల ట్రాన్స్‌ఫార్మర్లు, సదాశివపేటలో 20 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వంద కిలోవాట్ల సామర్థం గల ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థాన్ని 160 కిలోవాట్లకు పెంచడానికి కూడా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ శాఖ చేపడుతున్న ఆధునీకరణ పనుల వల్ల పట్టణాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా వుంటుంది. దీంతో పాటు లోఓల్టేజి సమస్య కూడా పరిష్కారమవుతుంది. కరెంట్ కోసం గతంలో రోడ్డెక్కిన రైతులు, ప్రజలు ఇక నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.

Comments

comments