Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

రైతు సమితుల సహకారం

f

పెట్టుబడి సాయం సవ్యంగా అందేలా ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య వారధులు
చెక్కుల పంపిణీ నుంచి నగదు చేయించే వరకు అడుగడుగునా అండదండలు

హైదరాబాద్:వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకానికి రైతు సమన్వయ సమితులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. సమితుల సభ్యుల ను ఆ దిశగా సన్నద్ధం చేయడానికి సిద్ధమవుతోంది. పెట్టుబడి సొమ్మును చెక్కుల రూపంలో ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినందున గ్రామాల్లో సమన్వయంతో పంపిణీ చేసేందుకు రైతు సమితుల సహకారం తీసుకోనుంది. పథకం ఏ మాత్రం బెడిసికొట్టకుండా, ప్రతి పక్షాలు ఆరోపణలు, విమర్శలు చేసేందుకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అమలులో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకే సమితుల సభ్యులకు భాగస్వామ్యం కల్పించనున్నట్లు తెలిసింది. ఇటీవల మద్దతు ధర ఇప్పించడంలో సమితుల సభ్యులు పట్టించుకోకపోవడంపై సిఎం కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడి పథకంలో ఇలా వ్యవహరించకుండా కాస్త కట్టుదిట్టంగా, క్రమశిక్షణతో పనిచేసేలా చూడాలని అధికారులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చెక్కులను పంపిణీకి ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా రైతులు క్రమ పద్ధతిలో తీసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. గ్రామంలోని రైతులందరూ ఒకేసారి బ్యాంకుకు వెళితే నగదు కొరత ఏర్పడటం, గందరగోళం చోటు చేసుకుంటుందని ఈ క్రమంలో సభ్యులు ముందుగానే బ్యాంకు అధికారులను సంప్రదించి సమన్వయం చేయనున్నారు. తద్వారా ఏకకాలంలో కాకుండా రైతులను గ్రూప్‌లుగా చేసి, డబ్బులు డ్రా చేసుకునేందుకు సమితుల సభ్యులు సహకరించే విధంగా ప్రభుత్వం విధానాలు రూపొందించనుంది. చెక్కుల ద్వా రా నగదు ఎలా తీసుకోవాలో అవగాహన కల్పించడంతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అవసరమైతే ఈ విషయంలో వ్యవసాయ శాఖ రైతు సమితుల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సిఎం చెప్పినట్లు తెలిసింది. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వుల్లో కూడా ప్రభుత్వం రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను తెలుసుకోవడం, ఏ పంటలు ఎప్పుడు పండించాలో తెలియజేయడం, మద్దతు ధర ఇప్పించడం, యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం ప్రోత్సహించడం వంటి వాటితో పాటు పెట్టుబడి పథకానికి ప్రభుత్వానికి సహకరించడం వారి బాధ్యత అని స్పష్టంగా పేర్కొంది. గ్రామాల్లో 15 మందితో, మండలాల్లో 24 మందితో రాష్ట్రం మొత్తం 559 మండలాలకు, అందులోని 10,733 గ్రామాలకు సంబంధించిన సమితుల ఏర్పాటు పూర్తైంది. వీటన్నింటిలో మొత్తం 1,60,995 మంది సభ్యులు ఉన్నారు. రైతుల సమన్వయ సమితుల ఏర్పాటులో జాపం జరుగుతుండడంపై నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.

Comments

comments