Search
Friday 20 April 2018
  • :
  • :

మోడీ పాలనలో కార్పొరేట్ శక్తులకే అచ్చేదిన్

cpi

*హామీలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలం
*వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
*నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు
*జిఎస్‌టి పేరుతో పన్నుల భారం
*సిపిఐ నేత, కేరళ మాజీ మత్రి బినోయ్ విశ్వం

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, కేరళ మాజీ మంత్రి వినోయ్ విశ్వం అన్నారు.  ఆదివారం ఉదయం వరంగల్ రూరల్ జిల్లా సిపిఐ జిల్లా సమితి సమావేశం వరంగల్ శివనగర్‌లోని తమ్మెర భవన్‌లో పార్ధసారధి అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బినోయ్ విశ్వం మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోడీ పాలనలో కార్పొరేట్, పెట్టుబడిదారి శక్తులకే అచ్చేదిన్‌గా మారింది తప్ప పేదల బతుకులు మారలేదన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోడీ దేశ ప్రజలను మోసం చేశారని ఆయన  ఆరోపించారు. మూడున్న సంవత్సరాల మోడీ పాలనలో పేదలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. బడా కార్పొరేట్ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు రాయితీలు కల్పిస్తూ సామాన్యులపై జిఎస్టి పేరుతో పన్నుల భారం మోపారని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ మాటలు నీటిమూలయ్యాయని ఎద్దేవా చేశారు. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనం తేకపోగా దేశంలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. మోడి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం కల్పించి వచ్చే స్వారత్రిక ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాతంత్ర లౌకిక శక్తులతో సిపిఐ జతకట్టి బిజెపిని గద్దు దించేందుకు కృషి చేస్తుందన్నారు.  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ పాలన తుగ్లక్ పాలనను మరిపిస్తోందన్నారు. స్థానిక ఎంఎల్‌ఎలు, మంత్రుల ఒత్తిడికి తలొగ్గి కలెక్టర్‌లను ఇష్టారాజ్యంగా బదిలీ చేసి పరిపాలనను అస్తవ్యస్థంగా మార్చాడని విమర్శించారు. పరిపాలన సౌలభ్యం కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు అని చెప్పిన సిఎం నేడు పాలనను ప్రజలకు అందుబాటులో లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్రీనివాస్‌రావు దుయ్యబట్టారు. కెసిఆర్ పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా తీవ్రంగా నిర్లక్షానికి గురైందని, దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు సిఎంపై జిల్లా అభివృద్ధి విషయంలో ఒత్తిడి తేవడం లేదని అన్నారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున, ఇప్పటికైనా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు సరియైన గుణపాఠం చెబుతారని శ్రీనివాస్‌రావు హెచ్చరించారు.  ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి మండ సదాలక్ష్మి, జిల్లా కార్యవర్గసభ్యురాలు తోట చంద్రకళ, వీరగోని శంకరయ్య, గుంపెల్లి మునీశ్వరుడు, మండల కార్యదర్శులు జున్న సాంబయ్య, ఇల్లందుల రాములు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments