Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

విద్యుత్ కొనుగోలులో అవినీతి : రేవంత్‌రెడ్డి

Revanth

హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జరిగిన అవినీతిని ఆధారాలతో సహా తాను నిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. తాను చేసిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తానని, లేనిపక్షంలో అబిడ్స్ సెంటర్‌లో నేలకు ముక్కు రాస్తానని ఆయన అన్నారు. కెసిఆర్ అవినీతిపై సిబిఐ లేదా సివిసితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ రేవంత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గన్‌పార్కు వద్ద శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంపత్‌కుమార్, నాయకులు కార్తీక్‌రెడ్డి, రవీంద్రనాయక్, జంగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎపి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ కేటాయింపులు జరిపిన ఘనత తమ నేత సోనియాగాంధీదేనని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. ఈ అంశంపై చర్చకు వస్తామని టిఆర్‌ఎస్ నేతలు సుమన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భాను ప్రసాద్‌లు సవాల్ విసిరారని, తాము చర్చకు వస్తామని చెప్పగానే, టిఆర్‌ఎస్ నేతలు తోకముడిచారని ఆయన ఎద్దేవా చేశారు.

తన విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారని, కానీ పోలవరం కడితే రక్తం ఏరులై పారుతుందని చెప్పిన కెసిఆర్ ఆ తరువాత తన బినామీ సంస్థ ఎస్‌ఇడబ్లుకు ఆ ప్రాజెక్టును ఇప్పించుకున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. ఎవరి విశ్వసనీయత ఎమిటో అమరవీరుల కుటుంబాలను, ఓయూ విద్యార్థులను అడిగి తెలుసుకుంటే మంచిదన్నారు. దళితుడిని సిఎం చేస్తానని కెసిఆర్ చెప్పారని, సోనియా కాళ్లు పట్టుకుని కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తానని ఆయన చెప్పారని, ఇదేనా మీ విశ్వసనీయత అని రేవంత్ ఘాటుగా అన్నారు.

Corruption in Power Purchase: Revanth Reddy

Comments

comments