Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

మహా వేదికపైనా మహిళకు వివక్షే!

ప్రారంభ సభలో గానీ, ముగింపు సభలో గానీ ఒక్క మహిళ కూడా వేదిక మీద లేదు. ప్రధానమైన ఏ సభలో కూడా మహిళల పాత్ర నామమాత్రంగా కూడా లేదు. ప్రధానమైన వేదికల పేర్లలో కూడా ఎక్కడా మహిళల పేరులేదు. అవధానాలు, , పద్య పఠనాలు, కవితాపఠనాలు, సాహితీ చర్చలు అన్నీ మగవారి సభల్లాగే నడిచాయి. అడుగడుగునా  వారి ఆధిపత్యమే కనపడింది.

Telugu Maha Sabhalu (129)

పిల్లలకు భాష నేర్పడం ఒకటే కాదు, సాహిత్య రంగంలో కూడా మహిళల కృషి అపారం గానే ఉంది. కానీ దానికి గుర్తింపు లభించడంలేదు. తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక నుండి మొదలుకొని నేటి ఆధునిక రచయిత్రులు, కవయిత్రుల వరకు మహిళల కృషి అమోఘం. కానీ ప్రపంచ తెలుగు మహాసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం ప్రాముఖ్యం లభించలేదు.

మౌఖిక సాహిత్యంలోని లాలిపాటలు, పని పాటలు, పెండ్లి పాటలు, ఉయ్యాల పాటలు, బతుకమ్మ(బొడ్డెమ్మ) పాటలు, కోలాట పాటలు, రాట్నం పాటలు, జంగం పాటలు, విసుర్రాయి పాటలు మర్పియా లాంటి స్త్రీల పాటల్లో నిక్కమైన కవిత్వం కనిపిస్తుంది. ఆటల్లో, మాటల్లో, పనుల్లో, పాటల్లో, ప్రకృతితో జరిపే ముచ్చట్లలో ఎక్కడ చూసినా స్త్రీల సాహిత్య సృజన జరుగుతూనే ఉంటుంది. స్త్రీల సాహిత్యం ఎక్కువగా మౌఖిక రూపంలోనే కనపడుతుంది. ఈ మౌఖిక సాహిత్యంలోని లాలిపాటలు, పని పాటలు, పెండ్లి పాటలు, ఉయ్యాల పాటలు, బతుకమ్మ(బొడ్డెమ్మ) పాటలు, కోలాట పాటలు, రాట్నం పాటలు, జంగం పాటలు, విసుర్రాయి పాటలు మర్పియా లాంటి స్త్రీల పాటల్లో అమ్మ కవిత్వం కనిపిస్తుంది. ఏ పని జరిగినా, కార్యం జరిగినా జీవితంలోని అనుభఃతులే పాటలు గా తల్లుల నోటి నుండి జాలువారుతాయి. పని లోకంలో పాటలు తోడై నిలుస్తాయి. రాజులను ఆశ్రయించిన కవులలో ఆరాధనలు భక్తిభావాలు ఉంటే, ఆడవాళ్ల సాహిత్యంలో జీవిత సత్యాలు ఉంటాయి. మౌఖిక సాహిత్యమే కాదు. రచనా రంగంలో కూడా మహిళల పాత్ర తక్కువేమీ లేదు. మొట్టమొదటి తెలుగు కవయిత్రి కుప్పాంబిక (1230-1300) మన తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆమె భూత్పూరులో వేయించిన శాసనం నేటికీ ఉంది.
“వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా

వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే” అంటూ ఆమె రాసిన పద్యాలు నాడు ఎంతో ప్రాశస్త్యాన్ని పొందాయి. 12వ శతాబ్దంలో కర్నాటక నుండి వచ్చి మహబూబ్‌నగర్ లో నివసించిన అక్కమహాదేవి ఎన్నో కీర్తనలు రచించింది. 16వ శతాబ్దంలోనే బాల పాపాంబ, అక్కమహాదేవి చరిత్రను యక్షగానంగా రచించింది. తెలుగులో మొట్టమొదటి యక్షగాన రచయిత్రి గా నిలిచింది. 16వ శతాబ్దంలోనే తెలుగులో రామాయణాన్ని రచించిన మొల్ల కూడా మన తెలంగాణ ఆడబిడ్డ. మౌఖిక సాహిత్యంలో నైతే ఆడవాళ్ళ పాత్ర చాలా కొనియాడదగినది. చిందు బాగోతం, శారదకాండ్రకథ, అనేక సంచార జాతులు చెప్పుకునే కథలు, పాడుకునే పాటలు ముఖ్యంగా ఆడవాళ్ళు ఆనందంగా జరుపుకొనే పూల పండుగ బతుకమ్మ పాటల ఊటగా సాహిత్య సృజన చేస్తూనే ఉంది. చిందు బాగోతాన్నీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చిందు ఎల్లమ్మ మనకు ఉండనే ఉంది. నాడే కాదు నేడు కూడా అద్వితీయ సాహిత్య సృజన చేస్తున్న ఎందరో కవయిత్రులు, రచయిత్రులు, సాహితీవేత్తలు ఉన్నారు.

తెలంగాణ ఉద్యమ కెరటమై ఎగసిన విమలక్క, ముదిగొండ సుజాతారెడ్డి, జూపాక సుభద్ర, గోగు శ్యామల, జాజుల గౌరి, అనిశెట్టి రజిత, కొండపల్లి నీహారిణి ఒకరేమిటి మన ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన మూడు వందల మంది కవయిత్రులు, రచయిత్రులు, సాహితీ వేత్తలు తమ ప్రతిభతో అక్షర జల్లులను కురిపించి సాహితీ సేద్యం చేస్తున్నారు. తెలంగాణ ఖ్యాతిని జగమెల్లా చాటుతున్నారు. తెలంగాణ సాహితీ సేద్యంలో ఎన్నో సాక్షర కుసుమాలను పూయిస్తున్న మహిళామణులు వందల సంఖ్యలో ఉన్నారు. కానీ వారికి ప్రపంచ తెలుగు మహాసభలలో వివక్షే బహుమానంగా లభించింది. అడుగడుగునా ఆధిపత్య భావజాలం చాలా స్పష్టంగా కనబడింది. మొత్తం ముఖ్యమంత్రిగారి ఉపన్యాసంలో ఒక్క ముదిగొండ సుజాతా రెడ్డి గారి పేరు తప్ప ఇంకో మహిళ పేరు వినపడలేదు. ఈ వివక్ష మహాసభల ముందునుండే కనపడుతున్నది. మహాసభల నిర్వహణ కోసం వేసిన ప్రధామైన కమిటీలలో కూడా మహిళకు ప్రాతినిథ్యం లేదు.

ఒకరోజు కేటాయించిన మహిళా కార్యక్రమాల నిర్వహణకు మాత్రం మహిళలతో కమిటీ వేశారు. ప్రారంభ సభలో గానీ, ముగింపు సభలో గానీ ఒక్క మహిళ కూడా వేదిక మీద లేదు. ప్రధానమైన ఏ సభలో కూడా మహిళల పాత్ర నామమాత్రంగా కూడా లేదు. ప్రధానమైన వేదికల పేర్లలో కూడా ఎక్కడా మహిళల పేరులేదు. అవధానాలు, , పద్య పఠనాలు, కవితాపఠనాలు, సాహితీ చర్చలు అన్ని మగవారి సభల్లాగే నడిచాయి. అడుగడుగునా ఆధిపత్యం కనపడింది. మహిళలు చాలా అల్ప సంతోషులు. ఒకరోజు వేదిక అప్పగించి ఇక మీ పని మీరు చేసుకోండి అనగానే ఆహా మాకు కూడా ఒకరోజు కేటాయించారని ఎంతో సంబురపడిపోయారు. 300 మంది కవితలతో సిద్దమయ్యారు. ఆహా ఇది మా పండుగ అని మురిసిపోయారు. ముఖ్యమంత్రిగారిని కలిసి ధన్యవాదాలు కూడా చెప్పారు. కుడుమిస్తే పండుగ అనుకునే అల్పసంతోషులు మహిళలు. అలాంటి వారికి తగిన ప్రాతినిధ్యం ఇస్తే ఇంకా ఎంతో సంబురపడేవాళ్ళు.సమాజంలో సగం, ఆకాశంలో సగం మహిళలు. అలాంటి మహిళలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కాలంలో ఘనంగా జరిగిన మహాసభలు మహిళలను నిరాశపర్చినాయి.

ఈ సందర్భంగా ఒక కథ గుర్తొస్తున్నది. కొడుకు తమను సరిగా చూసుకోవడం లేదు, కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ అతని తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లారు. ఏమయ్యా తల్లిదండ్రులకు తిండి పెట్టక పోవడం న్యాయమా నువ్వెక్కడ కొడుకువయ్యా? అని అడుగుతడు జడ్జి. లేదు సర్, దేవతల లెక్క చూసుకుంటున్నాను అని కొడుకు సమాధానం చెప్తాడు. ఏమిటమ్మా అంత బాగా చూసుకుంటుంటే నువ్విలా కొడుకును బద్నాం చేయడం తప్పు గదమ్మ అని తల్లిని మందలిస్తాడు జడ్జి. అయ్యా మతలబంతా అక్కడే ఉంది. దేవతలకు నైవేద్యం పెట్టి భక్తులు తామే తిన్నట్టుగా మా కొడుకు కూడా మాకు నైవేద్యం పెట్టినట్లు అన్నం చూపించి మహాప్రసాదం అంటూ తానే తింటున్నాడు అని సమాధానమిస్తుంది తల్లి. ఇదిగో అచ్చం ఇలాగే ఉంది పరిస్థితి. తెలుగు తల్లి తెలంగాణా తల్లి అంటూ దండలు వేయటం, దండాలు పెట్టడంతో సరిపుచ్చారు. నిజమైన సాహితీమూర్తులైన అమ్మలను మాత్రం వివక్షకు గురి చేశారు. పాలభాషను, బాలభాషగా మార్చి అత్యంత ప్రతిభతో భాషను సహజాతి సహజంగా నేర్పగలిగిన సహజ బోధకురాలైన అమ్మకు ఈ మహాసభల్లో తగిన చోటు లభించకపోవడం బాధాకరం.

మరిపెద్ది వినుతారెడ్డి 9515405916

Comments

comments