Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ప్రైవేటీకరించొద్దు

Air-Indiaన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను ఇప్పుడే ప్రైవేటీకరించొద్దని, దాని పునరుద్ధరణకు, అప్పులు తీర్చేసేందుకు కనీసం మరి ఐదేళ్ల సమాయాన్ని ఇవ్వాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి తెలుపనున్నది. అప్పులో కూరుకుపోయిన ఎయిరిండియాకు ఉపశమనం కలిగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందిగా సూచించింది. దీనికి సంబంధించిన సవరణల ముసాయిదాను రూపొందించింది.
టర్న్ ఎరౌండ్ ప్లాన్(టిఎపి)లో భాగంగా ఎయిరిండియాలో జొప్పించిన ఈక్విటీ ‘పీస్ మీల్ బేసిస్’ మాదిరిగా ఉందని, అది దాని ఆర్థిక స్థితిపై , నిర్వహణ తీరుపై ప్రతికూలత ప్రభావాన్ని చూపుతోందని, అది నిలదొక్కుకునేందుకు అధిక వడ్డీరేటుకు మరిన్ని రుణాలు తీసుకోవలసి వస్తోందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అర్థం చేసుకుంది. రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పడిన స్టాండింగ్ కమిటీ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాలని కమిటీ కోరింది. ఎయిరిండియా మన జాతి గౌరవమని ఈ సందర్భంగా పేర్కొంది. దేశవిదేశాల్లో ప్రకృతి విపత్తులు, సామాజిక, రాజకీయ అశాంతి నెలకొన్న సమయాల్లో ఎయిరిండియా గురుతర బాధ్యత నిర్వహించిందని ఉటంకించింది.
ప్రతిపాదిత పెట్టుబడి ఉపసంహరణపై సవరించిన ముసాయిదా నివేదికలో కమిటీ ఆర్థిక పునర్నిర్మాణ పథకం(ఎఫ్‌ఆర్‌పి) కింద 2012 నుంచి 2022 వరకు పదేళ్లలో ఎయిరిండియా కోలుకునేందుకు సమయాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, టర్న్ ఎరౌండ్ ప్లాన్ కాలంలో అదే విధానాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సూచించింది. ఆ గడువు ముగిసేలోపు ఎయిరిండియా పనితీరు ఎలా ఉందన్నది పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
ఎయిరిండియా వాటాదారుల వాదనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలించింది. ఇప్పుడిప్పుడే ఎయిరిం డియా లాభాలను ఆర్జించడం జరుగుతోంది, ఇలాంటి సమయంలో పెట్టుబ డుల ఉపసంహరణ నిర్ణయం సరైనది కాదని ప్యానెల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎయిరిండియా అనుబంధ సంస్థలు ఎయిరిండియా ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఎఐఎటిఎస్‌ఎల్), ఎయిరిండియా ఎస్‌ఎటిఎస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఐఎస్‌ఎటిఎస్), అలియెన్స్ ఎయిర్ అండ్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లాభాల్లో పయనిస్తున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అందువల్ల ఈ యూనిట్లను తొలగించడం సరైనది కాదని తెలిపింది. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల ఆయా సంస్థల్లో పనిచేస్తున్న పలువురు తమ ఉద్యోగాలను కోల్పోవలసి వస్తుందని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక వేళ ఎయిరిండియా వాటాలను అమ్మాలనుకున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు వేరే మార్గం చూపించాల్సిందిగా పార్లమెంటరీ సంఘం తన నివేదికలో పేర్కొంది.
2017 మార్చి నాటికి ఎయిరిండియా అప్పు మొత్తం రూ . 48,877 కోట్లుంది. దానిలో రూ. 17,360 కోట్లు విమాన రుణాలు కాగా, రూ. 31,517 వర్కింగ్ క్యాపిటల్ రుణం. 201718 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా రూ. 3579 కోట్లు నికర నష్టాన్ని చూపెట్టనునదని భావిస్తున్నారు. ఎయిరిండియా తన ఆపరేటింగ్ లాభాన్ని పెంచుకోనున్నదని పార్లమెంటుకు సమర్పించిన డేటాలో పేర్కొంది. 201617లో ఆపరేటింగ్ లాభం రూ. 215 కోట్లుండగా, 201718లో అది రూ. 531 కోట్లకు పెరుగనుందని తెలిపింది.

Comments

comments