Search
Friday 20 April 2018
  • :
  • :

బ్రిటీష్ సేనల తాగునీటి అవసరాలను తీర్చిన నక్కల చెరువు

Lake

జలవనరుల సంరక్షణను మహాపుణ్యకార్యంగా భావించిన అనేకరాజవంశాలు చెరువుల నిర్మాణానికి అధికప్రాధాన్యత ఇచ్చాయి. ప్రజలతాగు, సాగునీటి అవసరాలకే కాకుండా విదేశీ సైనికుల అవసరాలకు రాజసంస్థానాలు నిర్మించిన చెరువులు ఉన్నాయి. రెండవప్రపంచయుద్ధకాలంలో బ్రిటీష్ పక్షాన భారదేశం నిలవడంతో రాజసంస్థానాలు సైనికుల అవసరాలకు అనేక చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మించిన చెరువు కొల్లా చెరువు. ఆనాటి హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దట్టమైన అడవిలో జీడిమెట్ల కుగ్రామంలో నిర్మించిన ఈచెరువు సమీపాన నక్కల బెడద ఉండటంతో క్రమేణ కొల్లాచెరువు నక్కలచెరువుగా మారింది. హైదరాబా ద్ సంస్థానాన్ని 1826 నుంచి 29 ఆగస్టు 1911 వరకు పరిపాలించిన మహబూబ్ అలీఖాన్ కాలంలో నక్కల చెరువు నిర్మాణం జరిగింది. బ్రిటీష్ వైస్ రాయ్ సర్ అర్దర్ లోధిన్ మహబూబ్ అలీ పట్టాభిషేకానికి హాజరు కావడం, హైదరాబాద్‌లో బ్రిటీష్ రెసిడెన్సీ, సైనిక సహకారపద్ధతి అమల్లో ఉండటంతో బ్రిటీష్ పాలకులకు నిజాం రాజులకు గాఢమైన స్నేహం ఉండేది. హైదరాబాద్, సికింద్రాబాద్ శివార్లలో బ్రిటీష్ సైనిక శిక్షణ కేంద్రాలు నిరంతర శిక్షణలో ఉండేవి. ఈనేపథ్యంలో ఆంగ్లేయుల సేనలకు సౌకర్యాలను మెరుగుపర్చే బాధ్యత నిజాం రాజులపై పడింది. సైనికులకు సౌకర్యాలను పెంపొందించేందుకు జలవనరులు అవసరమయ్యాయి. బ్రిటీష్ ఇంజనీర్ల సహకారంతో మహబూబ్ అలీ సైనికుల తాగునీటి అవసరాలకు జీడిమెట్ల సమీపంలో కొల్లా చెరువును 1972లో తొలిదశ.1987లో రెండవదశ నిర్మించి అవసరాలను తీర్చారు. సైనికుల తోపాటు ఈ చెరువునీటిని సాగుకు వినియోగించారు.

హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఐదు చెరువులు నిర్మించగా అందులో ఇది ఒకటి. నిజాంరాజులు గతపాలకుల విధానాలు అవలంబించి హైదరాబాద్ సంస్థానంలో 31 చెరువులను నిర్మించి జలవనరుల పరిరక్షణకు అధికప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఊటకాల్వలు, బావులు అనేకం నిర్మించారు. ఆ చెరువుల్లో అనేకం కబ్జాలకు గురికాగ మిగిలిన చెరువులు కాలుష్యం విరజిమ్ముతున్నాయి. సైనికావసరాలకు నిర్మించిన నక్కల చెరువు రెండవప్రపంచయుద్ధ కాలంలోను సైనికులకు తాగునీరు అందించిన చారిత్రక నేపథ్యం ఉంది. బ్రిటీష్ ఇంజనీర్ల సహకారంతో నిర్మించిన ఈ చెరువు పొడవు వెడల్పు రెండు కిలోమీటర్లు ఉండేదని ఆధారాలు లభిస్తున్నాయి. ఈ చెరువు కే సొంతమైన ఇనుపవంతెన ఆనాటి ఇంజనీర్ల నైపుణ్యానికి తార్కాణంగా నిలిచింది. ఈవంతెన నుంచి సూర్యోదయం,సూర్య అస్తమయం చూసేందుకు ఆనాడే ఇక్కడికి పర్యాటకులు వచ్చేవారు. ఇనుప వంతెనతో పాటు పంపు హౌజ్ కు ప్రత్యేకత ఉంది. ఇంగ్లాండ్ ఇంజనీర్ల సహకారంతో నిజాం నవాబు మహబూబ్ అలీ ప్రత్యేక్ష పర్యవేక్షణలో పంపు హౌజ్ నిర్మాణం జరిగింది. నీటి నిలువలను తట్టుకుని అవసరం మేరకు విడుదల చేసే ఇంజనీరింగ్ ఇందులో దాగి ఉంది. అలాగే అత్యవసర పరిస్థితుల సమయంలోనూ, చెరువులో నీరు ఇంకిపోయిన సందర్భాల్లో డెడ్ స్టోరేజి నుంచి నీటిని విడుదల చేసే విధానం నేటికి కొత్తగానే అగుపించడం ఈచెరువుకే పరిమితమైంది.

అయితే ఆనాటి ఇంజనీర్ల కృషి, నిజాం పాలకుల దూరదృష్టి నక్కలచెరువు కాలుష్య జలాలు ప్రశ్నార్థకం చేశాయి. వేల ఎకరాల సాగుకు అందించిన నీరు వ్యర్థరసాయనమైంది. చెరువు నీళ్లుతాగి శత్రువులతో చెలగాటమాడిన బ్రిటీష్ సేనల శౌర్యం భూకబ్జా దారుల బిగికౌగిలిలో నలిగి పోయింది. అక్కడ పీల్చేగాలి,తినేతిండి కాలుష్యంతో విషతుల్యం అవుతోంది. 1950 నాటి పారిశ్రమిక విధానం తో చెరువు మనుగడ ప్రశ్నార్థకమైంది. ఒక నాడు చిన్న గ్రామంగా ఉన్న జీడిమెట్ల పారిశ్రామిక వాడైంది. వేలాది పరిశ్రమల వ్యర్థాలు చెరువులోకి చేరడంతో కాలుష్యం పరిసరాలను కాటు వేస్తుంది. ప్రధానంగా ఫార్మా, రసాయన పరిశ్రమల వ్యర్థ పదార్థాలు ఇందులో చేరడంతో పాటు పట్టణీకరణతో చెరువు శిఖం భూమిలో గునపాల్లాగా బహుళ అంతస్తుల మేడలు దిగడం తో నక్కల చెరువుదగ్గర ఆనాటి నక్కలబెడద లేకపోయినా కాలుష్యంతో రోగపీడుతుల బాధలు వినిపిస్తున్నాయి. రాజులు పుణ్యకార్యంగా భావించి నిర్మించిన చెరువులను కాపాడటం కూడా పుణ్యకార్యంగా ప్రతి ఒక్కరు ఆలోచించి భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన ప్రకృతిని అందిస్తారని ఆశిద్దాం….

వి. భూమేశ్వర్
మన తెలంగాణ ప్రతినిధి

Comments

comments