Search
Tuesday 19 June 2018
  • :
  • :

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

amrapali

* బహిరంగ మల విసర్జన చేయవద్దు
* స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 4041 పట్టణాలు పోటిపడుతున్నాయి
* వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ప్రతి వ్యక్తికి తాను పరిశుభ్రత పాటించడంతో పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాల్సిన సామాజిక బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మంగళవారం హంటర్‌రోడ్డులోని జూపార్క్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రకృతి-పర్యావరణం, -మనం అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ అమ్రపాలి, అటవీశాఖ సిఎఫ్‌ఒ ఎంజె అక్బర్, అటవీశాఖ డిఎఫ్‌ఒలు పురుషోత్తం, అర్పణ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ స్టాటిస్టికల్ అధికారి జాన్సన్‌లు జూపార్కులో స్వచ్ఛత కార్యక్రమంలో చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూపార్క్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, పార్క్ అప్‌గ్రేడ్ చేస్తున్నందుకు అటవీశాఖ అధికారులను అభినందించారు. స్వచ్ఛ్, స్వచ్ఛ్ భారత్ మిషన్ గురించి కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ప్రతిరోజు చెత్తను తీసుకెళ్లడానికి మున్సిపల్ కార్మికులు వస్తున్నారని, ఖాళీస్థలాల్లో చెత్తను వేయవద్దని పరిసరాలను పరిశుభ్రంగాఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నగరంలో వంద వరకు కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని, ఇవి పెట్రోల్‌బంక్‌ల వద్ద కూడా ఉన్నాయని వాటిని పౌరులు వినియోగించుకుని, బహిరంగ ప్రదేశాలలో మలమూత్రాలు విసర్జించవద్దని కలెక్టర్ సూచించారు. మన ఆరోగ్యం, మన చుట్టుపక్కల వారి ఆరోగ్యం మనం పాటించే పరిశుభ్రతపై ఆధారపడి ఉందని గమనించాలన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 4041 పట్టణాలు పోటీపడుతున్నాయి…భారత ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో శుభ్రత, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం అమలును అంచనా వేయడానికి స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం ప్రారంభించిందని, ఈ పోటీ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 4041 పట్టణాలు పోటీపడుతున్నాయని, అందులో వరంగల్ నగరం ముందు వరుసలో ఉండాలంటే నగర పౌరులు స్వచ్ఛ భారత్ యాప్ ద్వారా పాల్గొనాలని, ఎంత ఎక్కువ మంది పౌరులు మన నగరంలో పరిసరాల శుభ్రత విషయంపై అనుకూల ప్రతిస్పందన ఇవ్వగలిగితే మన ర్యాంకు మెరుగుపడి నగరానికి అదనంగా పరిశుభ్రత కొరకు నిధులు రాగలవని ఆమె వివరించారు. అందువలన ప్రతి ఒక్కరు ఈ యాప్ ద్వారా మన నగరంపై స్పందన తెలపాలని, అలాగే 1969 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా కూడా మన స్పందన తెలుపవచ్చన్నారు.  అంతకుముందు స్వచ్ఛ భారత్ మిషన్‌పై విద్యార్థిని, విద్యార్థులచే ఏర్పాటు చేసిన ర్యాలీని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్టాటిస్టికల్ అడ్వయిజర్ జాన్సన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో పాటు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంజె అక్బర్, అర్బన్ జిల్లా అటవీ శాఖాధికారి అర్పణ, రూరల్ జిల్లా అటవీ శాఖాధికారి పురుషోత్తంలు జూపార్క్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి హనుమంతరెడ్డి, మున్సి పల్ ఆరోగ్య అధికారి రాజారెడ్డి కూడా పాల్గొన్నారు.

Comments

comments