Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పంచాయతీలకూ కో-ఆప్షన్ సభ్యులు?

ktr

రెండు ఎన్నికలకూ ఒకే రిజర్వేషన్ 

సర్పంచ్‌లకు విస్తృత అధికారాలు
కొత్త చట్టంపై రెండవ రోజు ఉపసంఘం సుదీర్ఘ చర్చ

హైదరాబాద్ : గ్రామ సర్పంచ్‌లకు విస్తృతాధికారాలు కల్పించేలా రాష్ట్ర నూతన పంచాయతీరాజ్ చట్టం సిద్ధమవుతోంది. సర్పంచ్‌ల చేతికే కార్య నిర్వహణాధికారాలను పూర్తిగా అప్పగిస్తూ విధులను కూడా స్పష్టంగా చట్టంలో పేర్కొననున్నారు. పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వరుసగా రెండో రోజూ మంగళవారం ప్రగతి భవన్‌లో ఏడు గంటల పాటు సుదీర్ఘం గా చర్చించింది. ప్రధానంగా నిధులు, కార్యనిర్వహక అధికారాలతో పాటు సర్పంచ్‌లకు అప్పగించాల్సిన బాధ్యతలపైనా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. సర్పంచ్‌లకు విస్తృతాధికారులు కల్పించడంతో పాటు ప్రస్తుతం జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల్లో అమలు చేస్తున్నట్లుగానే పంచాయతీల్లోనూ కో ఆప్షన్ సభ్యున్ని నియమించే అంశంతో పాటు వరుసగా రెండు ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ అమలు చేయాలనే దానిపై చర్చ జరిగింది. దీనిద్వారా గ్రామాల్లో సర్పంచ్‌ల, పాలకవర్గ సభ్యులకు జవాబుదారీతనం పెరగడంతో పాటు, నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే గ్రామాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా గ్రామసభను తప్పకుండా నిర్వహించేలా చట్టంలో మార్పులు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానంగా గ్రామ సభ కాలవ్యవధిని ఆరు నెలల నుంచి ఒకటి లేదంటే రెండు నెలలకు కుదించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలోనూ స్వయం సహాయక సంఘాలు, ఫంక్షనల్ గ్రూప్‌ల నుండి కో ఆప్షన్ సభ్యున్ని తీసుకోవచ్చనే అంశం పొందు పర్చి ఉన్నప్పటికీ అది అమలు కావడం లేదు. దీనిని అమలు చేస్తూ గ్రామంలోని నిపుణుడు, ఏదైనా విషయ పరిజ్ఞానం ఉన్న సీనియర్ వ్యక్తిని కో ఆప్షన్ సభ్యునిగా నియమించే అంశంపైనా చర్చించారు. రా ష్ర్టంలో ఏ గ్రామంలో అయినా లే అవుట్లతో పాటు… గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్థుల కన్నా ఎక్కువ చేపట్టే భవన నిర్మాణాల కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లోని పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ అనుమతి పొందాల్సి వస్తోంది. దీనిని కొంత సరళీకరిస్తూ జిల్లాల్లోనే డిపిఒల ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ప్రస్తావన మంత్రవర్గ ఉపసంఘంలో సమావేశంలో వచ్చింది. ఈ కమిటీ కూడా నిర్ణీత కాల పరిమితిలోగా దరఖాస్తును తిరస్కరించమో, ఆమోదించడమో చేసేలా చట్టంలో పొందుపర్చే అంశంపైనా కూలంకుశంగా చర్చించారు. బుధ, గురువారాల్లోనూ సబ్ కమిటీ బేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు కెటిఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. చట్ట రూపకల్పనలో తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలకు సంబంధించి అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డితోనూ సుదీర్ఘంగా చర్చించారు.

Comments

comments