Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పల్లెకు పండుగ కళ

buws*పట్నం నుంచి పల్లెకు తరలుతున్న జనం
*ఖాళీ అవుతున్న శివారు కాలనీలు
*బస్సులు లేక జనం ఇక్కట్లు
*ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రజలు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకుంటున్నాయి. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని వరుస సెలవులు రావడంతో విద్య, ఉపాధి తదితర కారణాలతో గ్రామాలకు దూరంగా ఉన్న ప్రజలు పల్లె బాట పట్టడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామాలకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు అంతా గ్రామాలకు చేరుకుని పండుగ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలనుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో రద్దీకి అనుకూలంగా బస్సులను నడపటంలో అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. రంగారెడ్డి జిల్లా ఆర్‌టిసి అధికారులు జిల్లాలోని బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడపడంలో ఉన్న ఆసక్తి జిల్లాలోని ప్రజలపై మాత్రం లేకుండా పోయింది. తెలంగాణ జిల్లాలతో పాటు అంధ్రాలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతు అదనంగా 50 శాతం టికెట్ ధరలను వసూళ్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తాండూర్, వికారాబాద్, కొడంగల్ రూట్‌లో రద్దీకి అనుకూలంగా బస్సులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రయాణించడం కనిపించింది. రవాణా మంత్రి సొంత నియోజకవర్గం తాండూరుకు పోవడానికి మొయినాబాద్‌లో ప్రజలు డిసిఎం వ్యాన్ ఎక్కిపోతున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. షాద్‌నగర్, కల్వకుర్తి రూట్‌లో సైతం ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. ప్రైవేట్ వాహనాల నడిపేవారు సైతం నిన్నటివరకు వంద రూపాయలు వసూళ్లు చేసే రూట్‌లో శనివారం నుంచి 150 రూపాయల వరకు వసూళ్లు చేస్తూ దోచుకుంటున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండగ కోసం ప్రత్యేకంగా గాలి పటాల దుకాణాల వద్ద సందడి కనిపిస్తుంది. సినిమా హీరోలు, దేవుళ్ల పేరుతో ప్రత్యేకంగా తయారు చేసిన గాలిపటాల దుకాణాల వద్ద జనం క్యూ కట్టి కొనుగోలు చేస్తున్నారు. మహిళలు ప్రత్యేకంగా రంగు రంగుల ముగ్గులు వేయనున్నారు.
శివార్లు ఖాళీ..
సీమాంధ్రులు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నగర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివసించే సీమాంధ్రులు సంక్రాంతి పర్వదినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడానికి గ్రామాలకు తరలిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్.బి.నగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి ప్రాంతాల నుంచి సీమాంధ్ర ప్రాంతాల వైపు వాహనాల ర్యాలీలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిధి గుండా ఆంధ్రాకు వెళ్లే హయత్‌నగర్ రోడ్డు, ఇబ్రహీంపట్నం రోడ్లతో పాటు రాయలసీమ వైపు వెళ్లే షాద్‌నగర్ రోడ్డులో వాహనాల జాతర సాగుతుంది. శివారు నుంచి ఆంధ్రా ప్రజలు పండుగకు తరలివెళ్లడంతో కాలనీలు పూర్తిగా బోసిపోతున్నాయి. సీమాంధ్రలకు తరలుతున్న ప్రజలకు కావలసిన రవాణా సౌకర్యాలు కల్పించడంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు. సంక్రాంతి రద్దీ ఉంటుందని తెలిసినా అధికారులు నామమాత్రంగా ప్రత్యేక బస్సులు వేసి దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సామాన్య ప్రజల గోస పట్టించుకోవడం లేదని పలువురు సీమాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీలో పండుగకు స్వంత ఊరు వెళ్లలేక కొంత మంది మాత్రం చాలా బాధపడుతున్నారు.

Comments

comments