Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

పండుగ వేళ.. జనం పల్లెబాట

ppleవిజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు
పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ సంఖ్యలో నిలిచిన కార్లు
ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు

చౌటుప్పల్ : పండుగ వేళ..పట్టణ జనమంతా పల్లెబాట పట్టారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరసగా ఐదు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పట్టణ వాసులంతా తమ తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక జిల్లాలోని ప్రజలు రాజధాని నుంచి తమ స్వగ్రామాలకు తరలివెళుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లింపునకు నిమిషాల వ్యవధి వాహనాలు నిలిపివేయాల్సి వస్తుండటంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. పాత ఘటనలు పునరావృతం కాకుండా ఈ సారి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పండుగ ప్రయాణం ప్రశాంతంగా సాగాలనే సంకల్పంతో ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక తయారు చేశారు. ట్రాఫిక్ పర్యవేక్షణకు సిబ్బంది తక్కువగా ఉన్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు చౌటుప్పల్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం మరో ఇద్దరు ఎఎస్‌ఐలను కేటాయించారు. హోంగార్డులు, పోలీసు సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు మొత్తం కలిసి చౌటుప్పల్ ఆర్‌టిసి ప్రయాణ ప్రాంగణం నుంచి రెడ్డిబాయి క్రాసింగ్ వరకూ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. చౌటుప్పల్‌లోని ఆర్‌టిసి బస్టాండ్ వద్ద , తంగడపల్లి క్రాస్‌రోడ్డు, వలిగొండ క్రాస్‌రోడ్డు, అంకిరెడ్డిగూడెం క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక బారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌ప్లాజా వద్ద అదనపు టోల్ కౌంటర్లు తెరిచేలా ఏర్పాట్లు చేయించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం టోల్‌ప్లాజా వద్ద 9 కౌంటర్లు తెరిపించారు. పండుగ ప్రయాణంలో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి వెళుతుండటంతో ఎలాంటి ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పోలీసులు చౌటుప్పల్ వద్ద, పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లింపునకు ఎక్కువ సమయం పడితే ఒకేసారి వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు జాతీయ రహదారి వెంట హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడ కొద్దిసేపు వాహనాలను నిలిపివేసి టోల్‌ప్లాజా వద్ద రద్దీ తగ్గగానే ఈ వాహనాలు వదులుతున్నారు. సంక్రాంతి పర్వదిన ప్రయాణం సుఖంగా ఉండాలని..ప్రజలంతా తమ తమ గమ్యస్థానాలకు ఎలాంటి అంతరాయం లేకుండ చేరుకోవాలన్నదే తమ లక్షమని చౌటుప్పల్ ట్రాఫిక్ ఎస్‌ఐ కె. మధుసూదన్, స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ. వెంకటయ్యలు తెలిపారు. వాహన చోదకులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

Comments

comments