Search
Tuesday 19 June 2018
  • :
  • :

చెక్కు చెదరకుండా

etalaచెక్కుల ద్వారానే రైతులకు పెట్టుబడి సాయం 

పలు మార్గాల పరిశీలన తరువాత మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే విధంగా అందజేత
పెద్ద రైతులు స్వచ్ఛందంగా వదులుకునేందుకు అవకాశం కల్పించే గివ్ ఇట్ అప్
బ్యాంకుల్లో తగినంత నగదు ఉండేలా చర్యలు
భూమి సాగులో లేకపోయినా చెల్లింపు

హైదరాబాద్ : వ్యవసాయ పెట్టుబడి పథకం కింద ఇవ్వనున్న ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. భూయజమానులకు ఎంత భూమి ఉన్నా సీలింగ్ లేకుండా ప్రతి ఎకరాకూ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. వ్యవసాయ భూములు ప్రస్తుతం సాగులో ఉన్నా లేకున్నా ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలనే భావిస్తోంది. ఒకవేళ ధనిక రైతులు ఎవరైనా ఈ ఆర్థిక సాయం అవసరం లేదని భావించినట్లయితే ఎల్‌పిజి సిలిండర్‌లపై సబ్సిడీ వద్దనుకుంటున్నట్లుగానే ‘గివ్ ఇట్ అప్’ తరహాలో స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ అంశాలన్నింటినీ సిఎం కెసిఆర్‌కు మంత్రివర్గ ఉపసంఘం వివరించింది. చెక్కుల పంపిణీ గురించి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలోని మెజార్టీ రైతులు చెక్కుల రూపంలోనే చెల్లించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో ఎంపి క చేసిన గ్రామాల్లోని రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాల్లో చెక్కుల ద్వారా చెల్లించాలన్న వారే ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వివరిస్తామని తెలిపారు. ప్రతి సీజన్‌లో రైతులకు ముంద స్తు పెట్టుబడిగా రూ. 4 వేలు అందించే విధానంపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రెండో రోజూ బుధవారం సచివాలయంలో సమావేశమైంది. రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలపై చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా 551 మండలాలలోని 624 గ్రామాలలోని 62,677 మంది రైతుల నుండి వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాల్లో చెక్కుల ద్వారా పంపిణీకే ఎక్కువమంది మొగ్గు చూపారు. అందుకనుగణంగానే నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో సభ్యులు మంత్రులు తి టి. హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర రావు, ఈటెల రాజెందర్, జగదీశ్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థ సారధి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, టిఎస్‌క్యాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ మణికందన్ పాల్గొన్నారు.
సరిపడా నగదు సరఫరాకై ఢిల్లీకి మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు పెట్టుబడి పథకాన్ని మే నెలలో వానకాలం సీజన్ నుంచే అమలు చేయాలనుకుంటున్నందువల్ల సుమారు రూ. 5685 కోట్లు అవసరమౌతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఒకే నెలలో ఇంత మొత్తం నగదు బ్యాంకుల వద్దు సర్దుబాటు అయ్యే అవకాశం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో వ్యవసాయ మంత్రి పోచారం, ఉన్నతాధికారులు ఈ నెల 17, 18 తేదీల్లో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ను కలిసి స్వయంగా ఈ పథకం గురించి వివరించి తగినంత నగదును రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరనున్నారు. వీలైతే కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా వివరించే అవకాశం ఉంది.
సాగుకు యోగ్యం కాని భూమికి పెట్టుబడి పై చర్చ
ఈ సమావేశంలో ప్రధానంగా సాగుకు యోగ్యం కాని భూములను పథకం పరిధి నుంచి తొలగించాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఆర్థిక భారం తగ్గించుకోవడంతో పాటు పథకం లక్షం నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెవిన్యూ రికార్డు ప్రక్షాళన తరువాత కేటగిరి ఎ కింద రాష్ట్రంలో 71 లక్షల 75,000 మంది రైతు ఖాతాలు, 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో చాలా వరకు పట్టా భూములు గుట్టలు, బండ రాళ్లతో సాగుకు పనికి రాకుండా ఉన్నాయని వీటిని గుర్తించాలని నిర్ణయించారు. మిగతా భూమిలో ఖచ్చితంగా ఏదో ఒక పంట వేసేలా చూడాలని పేర్కొన్నారు.
చెక్కులపై తండ్రి లేదా భర్త పేరు
ప్రభుత్వం పంపిణీ చేయనున్న చెక్కులపై రైతు పేరుతో పాటు తండ్రి లేదా, భర్త పేరును కూడా ప్రచురించనున్నారు. గ్రామాలలో ఒకే ఇంటి పేరుతో పాటు ఒకే పేరు కలిగిన వ్యక్తులు ఉండే అవకాశం ఉంటుందని, ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు చెక్కుల వెనక భాగంలో ఆధార్ కార్డు నెంబర్‌ను కూడా వేయాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. దండోరా వేయించి గ్రామ సభలు నిర్వహించి, వ్యవసాయ, రెవి న్యూ శాఖ అధికారుల సహకారంతో ప్రజాప్రతినిధులందరూ పాలుపంచుకుని పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ చేయాలని మంత్రులు చర్చించుకున్నారు.
అవసరం లేని వారు స్వచ్ఛందంగా వదులుకోవాలి
పెట్టుబడి పథకం ద్వారా అందించనున్న ఆర్థిక సహాయాన్ని అవసరం లేని వారు స్వచ్ఛందంగా వదులుకునేలా ప్రచారం చేయాలని క్యాబినేట్ సబ్ కమిటీ సూచించింది. ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చేపట్టిన గివ్ ఇట్ ఆప్ పనిచేసిందని, రాష్ట్రంలోనూ పెట్టుబడి పథకానికి అన్వయించుకోవాలని మంత్రులు పేర్కొన్నారు. తద్వారా నగర, పట్టణ ప్రాంతాలలో పదులు, వందల ఎకరాలకు కలిగిన వారు ముందుకొచ్చి పెట్టుబడి సొమ్మును వదులుకుంటారని భావిస్తున్నారు. అలాగే సాగు భూములు కలిగిన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు ఇతర ఉన్నతాధికారులు స్వచ్ఛందంగానే ఎకరాకు రూ. 4 వేలు వద్దని ముందుకు వస్తారని చర్చలో అభిప్రాయ పడ్డారు.

Comments

comments