Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

హిందూ ప్రార్థనలు ఎలా సమ్మతం?

sampadakeyam

దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉదయం ప్రార్థనల్లో హిందూ శ్లోకాల పఠింపును తప్పనిసరి చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విద్యా కోడ్‌ను సవరించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి, కెవి సంఘటన్‌కు నోటీసు జారీ చేసింది. “ఇది తీవ్రమైన రాజ్యాంగ విషయ సమస్య. సంస్కృతం, హిందీలో అటువంటి ప్రార్థనలు రాజ్యాంగ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయా, లేదా” పరిశీలించాలని పిటిషనర్ వీనాయక్ షా అనే వ్యక్తి కోర్టును అర్థించారు. ఆయన పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. హిందూమత భావాలను అన్యులకు సైతం తలకెక్కించే యత్నంగా కెవి సంఘటన్ సవరించిన కోడ్ విమర్శలకు గురి అవుతున్నది. ఈ కోడ్ హిందూమత సంబంధ ప్రార్థనను విద్యార్థుల మతం, విశ్వాసంతో నిమిత్తం లేకుండా విద్యార్థులందరికీ తప్పనిసరి చేస్తూ టీచర్లకు పర్యవేక్షణాధికారం ఇచ్చింది. విద్యార్థులు కళ్లు మూసుకుని హస్తాలు జోడించి ప్రార్థన పఠించాలి. ఏ విద్యార్థి అయినా నిర్దేశిత పద్ధతిలో ప్రార్థన పఠించకపోతే టీచర్ ఆ విద్యార్థిని స్టేజి పైకి పిలిచి బహిరంగంగా మందలించాలి. ఆ విధి నిర్వహణలో టీచర్లు విఫలమైతే ప్రిన్సిపాల్ వారిని మందలిస్తాడు. మైనారిటీల, నాస్తికుల, హేతువాదుల పిల్లలు సైతం ఉమ్మడి ప్రార్థన పఠించాల్సిందే. భిన్నమతాలు, ఆచారాలు, సంస్కృతులున్న లౌకికదేశంలో దేశమంతటికీ ఉమ్మడి ప్రార్థనను ప్రభుత్వం విధించవచ్చా? ఆర్టికల్ 28 అర్థం పరిధిలో ఇది ఒక మత ప్రచారం కిందకు రాదా అని పిటిషనర్ ప్రశ్నించారు.
కేంద్రీయ విద్యాలయాలు మనదేశంలో కేంద్రప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అవి ఏర్పాటైనాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ కింద దేశవ్యాప్తంగా 1125 స్కూళ్లు పనిచేస్తున్నాయి. అవి ఉమ్మడి పాఠ్యప్రణాళికను, సిలబస్‌ను అమలు చేస్తున్నాయి. 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ వ్యవస్థ క్రమక్రమంగా విస్తరించింది. నాణ్యమైన విద్యకు పేరుపొందిన ఈ స్కూళ్లలో సీటు దొరకటం కష్టం. అందువల్ల తమ పిల్లల భవిష్యత్ దృష్టా సమాజంలోని అన్ని విభాగాలకు చెందిన తల్లిదండ్రులు సీటు సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. లౌకికతను వ్యాప్తి చేయాల్సిన కేంద్ర విద్యాలయాలు హిందూమత ప్రార్థనను నిర్బంధం చేయటం రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధంగా కనిపిస్తున్నది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో మత బోధన చేయకూడదన్నది లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణం. మద్రసాలు, వైదిక పాఠశాలలు మాత్రమే మతవిద్యకు పరిమితం. మిగతా విద్యాలయాలన్నీ విద్యార్థుల మతం, కులం, లింగం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అడ్మిషన్‌లు నిర్వహిస్తాయి.అందువల్ల లౌకిక విలువలను, మత సామరస్యాన్ని అవి ప్రోత్సహించాలి, పెంపొందించాలి. కేంద్రీయ విద్యాలయాలపై విధించిన ఉమ్మడి హిందూ ప్రార్థన అట్టి లక్షానికి విఘాతం, విరుద్ధం కాదా? ఇది లౌకికతత్వాన్ని స్కూలు స్థాయిలో పెంపొందించదని విద్యానిపుణులు భావిస్తున్నారు. “విద్యాసంస్థల్లో రాజ్యాంగ వ్యతిరేక ఆచరణలను నివారించాలి. కెవిఎస్ ల్లోనే కాదు, అసంఖ్యాకమైన రాష్ట్రప్రభుత్వ స్కూళ్లలో కూడా హిందూమత ప్రార్థనలు చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నవోదయ విద్యాలయాల్లో, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో, హాస్టళ్లలో భోజనానికి ముందు హిందూమత ప్రార్థన చేయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లలో వినాయకచవితి, నవరాత్రి ఉత్సవం జరుపుతున్నారు. విద్యాసంస్థల్లో ఒక మత ఆచరణలను అనుమతించరాదు” అంటున్నారు స్కూలు టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్.నారాయణ.
విద్య, సాంస్కృతిక సంస్థల్లో హిందూ మతాధిక్య భావాలను బరితెగించి చొప్పిస్తున్న, పాఠ్యగ్రంథాలను తిరగరాస్తున్న, హిందూత్వ వాదులను ఉన్నత స్థానాల్లో నియమిస్తున్న ప్రస్తుత పాలనలో, కేంద్రీయ విద్యాలయాల్లో హిందూమత ప్రార్థనను నిర్బంధం చేయటం ఆశ్చర్యం కలిగించదు. అయితే సుప్రీంకోర్టు నోటీసుకు కేంద్ర ప్రభుత్వం ఏమి జవాబిస్తుందో ఆసక్తితో వేచిచూడదగిన అంశం.

Comments

comments