Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

చట్టాలను సరిగ్గా అమలు చేస్తే

mahilaమహిళలపై జరుగుతున్న  హింసను అరికట్టవచ్చు

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా : మహిళలపై జరుగుతున్న శారీరక, మానసిక, లైంగిక హింసలను అరికట్టేందుకు ఎన్నో చట్టాలు వచ్చాయని, ఇట్టి చట్టాలను సరిగ్గా అమలు చేస్తే హింసను అరికట్టవచ్చని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించిన మహిళా చట్టాలు-అవగాహన సదస్సు రెండు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలు వచ్చాయని, 2013లో నిర్భయ చట్టం ప్రస్తుతం ముమ్మారు తలాక్ చట్టం కూడా రూపొందించబోతున్నారని తెలిపారు. ఎన్నో చట్టాలు వచ్చినా మహిళలలో అవగాహన లేక సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. వరకట్నం నిషేధ చట్టం, ఆస్తిలో సమాన హక్కు చట్టం అమలు కావడం లేదన్నారు. అంతేగాక మహిళలు సాంఘిక, ఆర్థిక, రాజకీయాలలో సాధికారత సిద్ధించాలన్నారు. బాల్య వివాహాలు నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పోలీస్ అధికారులు ఏవైనా ఫిర్యాదు వచ్చిన ఎడల వెంటనే స్పందించి చట్టపరంగా  చర్యలు చేపడితే వీటిని నిరోధించవచ్చన్నారు. కొత్తగా పెళ్లి జరిగిన ప్రతి వారు 30 రోజుల లోపు కుల, మతాలకు అతీతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా గృహహింస, అత్యాచారాలు, వరకట్న వేధింపులు తదితర అంశాలపై చిత్ర ప్రదర్శన ద్వారా మహిళలకు అవగాహన కల్పించారు. జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ, మహిళలకు చట్టాలపై అవగాహన లేక దాడులకు గురవుతూ మౌనంగా భరిస్తున్నారని తెలిపారు. 19వ శతాబ్దం నుంచి నేటి వరకు ఎన్నో చట్టాలు వచ్చాయని, కాని అవగాహన లేక చట్టాలు నిరూపయోగంగా ఉన్నాయని తెలిపారు. మహిళలందరు ఈ రెండు రోజుల అవగాహన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించుకోవాలని కోరారు. అదేవిధంగా వారి వారి గ్రామాలలో చట్టాల పట్ల ఇతర మహిళలకు అవగాహన కల్పించుకోవాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు వరకట్నం తీసుకోకుండా అవగాహన కల్పింఇచ సహకరించాలన్నారు. బాల్య వివాహాలు భ్రూణ హత్యలు జరుగుకుండా చూడాలని మహిళలకు సూచించారు. జిల్లా ఎస్‌పి అన్నపూర్ణ మాట్లాడుతూ, జిల్లాలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడుల, వేధింపులకు సంబంధించి 450 కేసులు గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సంబంధితులకు నష్ట పరిహారం కూడా చెల్లించడం జరిగిందన్నారు. బాల్య వివాహాలను సంబంధిత రెవెన్యూ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల వారు కలిసి అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో భరోసా అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, దీనికి రాష్ట్ర రవాణశాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి, పూర్వపు జిల్లా కలెక్టర్ దివ్య 35 లక్షల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. బాధిత మహిళలకు సంబంధించిన స్టేట్‌మెంట్లు, మెడికల్ చెకప్‌లు ఇతర అన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా చేపట్టిన విషయాలను ఆమె వివరించారు. అదేవిధంగా షీ టీం ద్వారా మహిలకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బి.సంజీవరావు, డిడబ్లుఓ జ్యోత్న, ఎంపిడిఒ సత్తయ్య, హైకోర్టు అడ్వకేట్ విజేత, జడ్‌పిటిసి సభ్యుడు ముక్తార్ షరీఫ్, ఎంపిపి భాగ్యలక్ష్మి, జిల్లా మహిళ  సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర  పాల్గొన్నారు.

Comments

comments