Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఈ ఏడాదిలో పుంజుకోనుంది..

 ఇతర వర్ధమాన దేశాలకంటే వేగంగా భారత్ వృద్ధి
 2018లో భారత్ జిడిపి అంచనా 7.3 శాతం : ప్రపంచ బ్యాంక్

world-Bank

న్యూఢిల్లీ : ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్ మరింత సామర్థం కల్గి ఉందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)ని పెంచేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. 2018లో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగా, వచ్చే రెండేళ్లలో 7.5 శాతంగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. డీమానిటైజేషన్(నోట్ల రద్దు), జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలు వంటి నిర్ణయాలతో తాత్కాలికంగా మందగమనం చోటుచేసుకుందని, అందుకే 2017 సంవత్సరంలో 6.7 శాతం వృద్ధి రేటును అంచనా వేశామని 2018 గ్లోబల్ ఎకనమిక్స్ ప్రాస్పెక్ట్‌లో వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అత్యంత వేగంగా భారత్ వృద్ధిని చూపనుందని, ఇండియాకు ఆ సామర్థం ఉందని ప్రపంచ బ్యాంక్ డెవలప్‌మెంట్ ప్రాస్పెక్ట్ గ్రూప్ డైరెక్టర్ అయాన్ కోస్ అన్నారు. అందువల్ల స్వల్పకాలిక గణాంకాలపై తాము దృష్టి పెట్టలేదని, వచ్చే సంవత్సరాల్లో భార త్ వృద్ధి అద్భుతంగా ఉండనుందని అంచనా వేశారు.
క్రమక్రమంగా పుంజుకోనుంది..
చైనాతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు ప్రస్తుతానికి నెమ్మదించినా.. క్రమక్రమంగా వేగం పుంజుకుంటుందని అన్నారు. గత మూడేళ్లలో భారత్ వృద్ధి చాలా ఆరోగ్యకరంగా ఉందని కోస్ తెలిపారు. 2017లో చైనా 6.8శాతం వృద్ధి సాధించిందని, ఇది భారత్ కంటే 0.1శాతం ఎక్కువని అన్నారు. అదే సమయంలో 2018లో చైనాలో వృద్ధి రేటు అంచనా 6.4 శాతంగా ఉందని, అయితే ఆ తర్వాత రెండేళ్లలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గి 6.3, 6.2 శాతాలకు పరిమితం కానుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్పాదక విషయంలో భారత్‌కు మంచి సామర్థ్యం ఉందని తెలిపారు. కార్మిక్, విద్య, ఆరోగ్యం విషయాల్లో సంస్కరణలు, పెట్టుబడులకు అవకాశాలు తదితర అంశాలు భారత్ సామర్థ్యాన్ని పెంచుతున్నాయని అన్నారు. భారత్‌లో సామర్థ్యంతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే ప్రభుత్వానికి ఈ సవాళ్లపై అవగాహన ఉందని, వాటిని పరిష్కరించడానికి సాధ్యమైనంత కృషి చేస్తోందని ప్రపంచబ్యాంకు అధికారి తెలిపారు. జనాభా భారత్‌కు అనుకూలమైన అంశమని, ఇతర ఆర్థిక వ్యవస్థల్లో ఇది అంతగా లేదని అన్నారు.
మహిళా కార్మిక శక్తి కీలకం
మహిళా కార్మిక శక్తిని మెరుగుపర్చుకోవడం భారత్‌కు కీలకమని, ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మహిళా కార్మిక శక్తిలో ఇండియా వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే యువత నిరుద్యోగాన్ని తగ్గించడం ప్రధానమని, ప్రైవేటు పెట్టుబడులను పెంచాలని అన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యత, మొండి బకాయిలు వంటి సమస్యలు భారత్‌కు తెలుసని, వీటిని పరిష్కరించుకుంటే ఇంకా సామర్థం మెరుగువుతుందని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టి కీలకమైనదని భావించిన భారత్.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని అమలు వరకు తీసుకొచ్చిందని, బ్యాంకులకు మూలధనం అందించాలనే నిర్ణయం స్వాగతించదగిందని తెలిపారు.

Comments

comments