Search
Monday 23 April 2018
  • :
  • :

హిందీకి అంతర్జాతీయ హోదా?

edit

హిందీ భాషకు ఐక్యరాజ్య సమితిలో భారతీయ అధికార భాష హోదా లభింపచేయడానికి కేంద్రప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నం వ్యర్థమేకాక దేశ ప్రజలను విభజించేదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిందీకి జాతీ య భాష హోదాయే లేదు. అది కేవలం ఇంగ్లీషువలే అనుసంధాన భాష. ఐక్యరాజ్య సమితిలో భారత దేశపు భాషగా హిందీకి అధికారిక గుర్తింపు సాధించాలని ప్రభుత్వం రూ.400కోట్లు వ్యయం అయ్యే ఒక పథకాన్ని పరిశీలిస్తోంది. హిందీ అభిమానులలో ఆ వార్త ఉత్సాహాన్ని రేకెత్తించడం ఖాయం. ఆ భాషకు ఇప్పటిదాకా జాతీయ భాష హోదా రాకపోవడంపట్ల వారంతా అసహనంతో ఉన్నారు. చాలామంది హిందీ భాష రాజ్యాంగంలో అంతర్భాగమని తప్పుగా అనుకుంటారు. వాస్తవానికి హిందీ భాష 22 అధికార భాషల్లో ఒకటి మాత్రమే. ఆంగ్లంతోపాటు దానిని దేశంలో అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే అనుసంధాన భాషగా మాత్రమే భావిస్తారు. ఏ భాష హోదా అయినా ప్రాచీనకాలంలో దాని స్థితి ఏమిటి అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పురాతన కాలంలో హిందీ ఎన్నడూ అధికార భాషగా లేదు. భారతదేశంవంటి వైవిధ్యభరితమైన దేశంలో సామాజిక అంగీకారం లేకుం డా ఏ గౌరవాలు ఏ అంశానికి ఆపాదించలేము. ఇక్కడ ఓ విషయం తప్పనిసరిగా చెప్పాలి. ఇంగ్లీషు అన్ని ప్రాంతాలలో అర్థమయ్యే అనుసంధాన భాష.
ఇంగ్ల్లీషు తిండిపెడుతుంది. సమాజంలో ఆధిక్యతా భావన అందిస్తుంది. అధికార ప్రపంచంలోకి సులభంగా ప్రవేశం లభింపజేస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే ఇంగ్లీషు భాష జ్ఞానానికి, సాధికారతకు మారుపేరుగా మారిపోయింది. దానిని ‘సివంగి పాలు’ గా అంబేడ్కర్ అభివర్ణించారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని తోటి దళితులకు ఆయన పిలుపునిచ్చారు. ‘ప్రపంచంలో తలెత్తుకు ముందడుగు వేయాలంటే ఇంగ్లీషుపట్ల వ్యామోహం పెంచుకోవలసిందే’ అని కూడా ఆయన చెప్పారు. అసలైన అంశం ఇందులోనే ఉంది. ఇంగ్లీ షు భాష తన ప్రత్యేక హోదాతో అన్ని భారతీయ భాషలతో ఆటాడుకుంటోంది. ముఖ్యంగా హిందీని అది పక్క కి తోసింది. ఇంగ్లీషు వ్యాప్తి మూలంగా ఇతర భారతీయ భాషలన్నీ స్థానిక యాసలుగా మారిపోయాయి. ప్రాంతీయ భాషల్లో కేవలం కథలు, కవితలు, నవలలు మాత్రమే రాస్తారు. చలన చిత్రాలు, టివి ఫిల్మ్‌లకు కూడా ప్రాంతీయ భాషలే ప్రాతిపదిక. ఇతర అవసరాలకు రాతకోతలు ఆంగ్లంలోనే సాగుతాయి. ఈ సందర్భంలో కేంద్రప్రభుత్వం హిందీ భాషతో రాజకీయాలు ఆడాలని చూడడం ఆసక్తి కలిగించే విషయం. మరోపక్క అది భయాలను కూడా రేపుతోంది. జాతీయ భాష హోదాలేని హిందీకి ఐక్యరాజ్య సమితిలో భారతదేశపు అధికార భాష హోదా సాధించడానికి ఉరకలెత్తడం ఇతర భాషలలో గందరగోళం, అయోమయం, అరాచకం సృష్టించే విషయం. ఒకపక్క హిందీ భాషా ప్రాంతాలన్నీ ఈ ప్రతిపాదనకు హర్షాలు ప్రకటిస్తాయి. గొప్ప జాతీయవాద స్ఫూర్తితో ప్రభుత్వాన్ని బలపర్చాలని ఉవ్విళ్లూరుతాయి.
మరో పక్క ఇతర భాషా ప్రాంతాలలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు రాజుకునే ప్రమాదం ఉంది. మళ్లీ విద్వేష రాజకీయాలు భాషను కేంద్ర స్థానంలో నిలిపి సాగుతాయి. మత వైషమ్యాలు కూడా హిందీ చుట్టూ అల్లుకుంటాయి. చివరకు తేలేదేమంటే దేశాన్ని ఐక్యంగా ఉంచే అసలైన అనుసంధాన భాష ఇంగ్లీషే అని. దేశంలో ఆధిక్య భావనగల ఉన్నత వర్గాల్లో ఇంగ్లీషు అభిమాన భాషగా కొనసాగుతోంది. ఆ వర్గాలు కూడా జ్ఞాన సముపార్జన ఇంగ్లీషుతోనే సులభసాధ్యమని భావిస్తారు. అయితే ఆ భాష విభజన ధోరణిని పెంచినది మాత్రం వాస్తవమే. అది పాలకుడికి, పాలితుడికి మధ్య విభజన రేఖను సృష్టించింది. ‘ప్రపంచ జనాభాలో చరిత్రకందని కాలంలో ఒక వర్గం పదాన్ని సృష్టించగా మిగతా వర్గం ఆ పదాన్ని వాడకంలో పెట్టింది’ అని ప్రముఖ ‘అస్తిత్వవాద రచయిత’ జీన్‌పాల్ సార్త్రే ‘రెచెడ్ ఆఫ్ ది ఎర్త్’ అనే ప్రాన్జ్ ఫేనన్ పుస్తకానికి ముందుమాటలో రాశారు. భారతదేశంలో ఏ భాషా రచయితనైనా హిందీ రచయితగా విదేశీయులు భావించే ఆనవాయితీ ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతీయ భాష రచనలు హిందీలోకి విరివిగా తర్జుమా అయ్యాయి. గాలిబ్, ఇక్బాల్, ఇస్మత్ చుగతాయ్‌వంటి ఉర్దూ రచయితలు కూడా హిందీ అనువాదాలవల్లనే ప్రాచుర్యంలోకి వచ్చారు. అయితే ఒక భాష తన పరిమితికి మించి ఉత్సాహం ప్రదర్శిస్తే సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా హిందీ, ఇతర ప్రాంతీయ భాషలకంటే ఉన్నతమైనది అన్న ఆలోచనను రుద్దడం తప్పనిసరిగా వివాదాలు రేపేదే. భాష అన్నది భావోద్వేగాలను రెచ్చగొట్టేదిగా భావించడం ప్రభుత్వాలు మానాలి. యువతలో ఉద్యోగాల కల్పన భారీ ఎత్తున సాగాల్సి ఉంది. అంటే నేటి యువతను ఉద్యోగాలకు అర్హులను చేయడమే. హిందీ పేరుతో వారిని ప్రాంతీయులు, స్థానికులుగా పనిగట్టుకుని మార్చితే వారి భవిష్యత్తు దెబ్బతినడం ఖాయం. హిందీని ఇతర భాషల కంటే మిన్నగా తీర్చిదిద్దాలంటే ఆ భాషలో ఉపాధి అవకాశాలు పెంచాలి తప్ప అభిజాత్యాలను పెంచడంతో కాదు. అంతేకాకుండా పరభాషలను గౌరవించే వాతావరణాన్ని పెంపొందించాల్సి ఉంది. ఇందుకు భాషల మధ్య పరస్పర గౌరవం అవశ్యం. ఐక్యరాజ్యసమితిలో హిందీకి భారతీయ అధికార భాషా హోదా సాధించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను ఈ కోణంలో వ్యతిరేకించవలసిందే. ఈ విషయంలో ఇటీవల పార్లమెంట్‌లో మాజీమంత్రి శశి థరూర్‌కు, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం నెలకొంది. అది విభజన సూత్రం అవుతుంది తప్ప మరోటి కాదని థరూర్ గట్టిగా అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలో హిందీని అంతర్జాతీయ స్థాయిలో పైకి తీసుకురావడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రయత్నించడం తెంపరితనమే అవుతుంది. మరోపక్క ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లో ఒకటి వెంట ఒకటి ఇంగ్లీషు భాషా స్కూళ్లను తెరుస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధ పోకడలు అర్థం లేనివిగా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. దేశానికి ఒకటి అందిస్తూ, అంతర్జాతీయంగా మరొకదాన్ని పైకి తేవాలనుకోవడం అసంబద్ధం. ఇంతకు ముందుకంటే ఈ విషయంలో ప్రభుత్వం మరింత హ్రస్వదృష్టితో వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. ముఖ్యంగా బిజెపి విరుద్ధ పోకడలతో వ్యవహరించడం దక్షిణ భారతదేశంలో విస్మయం గొలుపుతోంది. తమపై హిందీ ప్రాంతపు దేవుళ్లను, సంస్కృతిని, భాషను రుద్దుతున్నారని దక్షిణ భారత ప్రజలు భయపడుతున్నారు. వారి భయాలను నిజం చేస్తూ నేటి కేంద్రప్రభుత్వం కంటక విధానాలను అవలంబిస్తోంది. జాతీయ భాష హోదాలేని హిందీ కి అంతర్జాతీయ హోదా సాధించాలనే తహతహ ప్రదర్శిస్తూ నవ్వులపాలు అవుతోందని మేధావులు అంటున్నారు. అసలు హిందీకి జాతీయ భాష హోదా తెప్పించడం అంత సులువు కాదు. ఇక అంతర్జాతీయ హోదా సంగతి సరేసరి.

* ప్రియదర్శన్

Comments

comments