Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సాధ్యమేనా..?

mills* మూడున్నర ఏళ్లుగా పరిశ్రమ మూసివేత

* మిల్లులో పని చేయని యంత్రాలు

* రెండు రోజులుగా యంత్రాలను పరిశీలిస్తున్న జెకె బృందం

* మిల్లు ప్రారంభం కోసం యత్నిస్తున్న ఎంఎల్‌ఏ 

* ఇప్పటికే వలస బాట పట్టిన కార్మికులు 

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా వెలుగొందిన సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్‌పిఎం) పునరుద్ధరణ సాధ్యమేనా అనే విషయం చర్చనీయాంశంగా మారి బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత 2014 సెప్టెంబర్ 27న  మిల్లు మూత పడగా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. మిల్లు మూత పడడంతో  సన్నగిల్లి 50 శాతం మంది కార్మికులు వలస బాటపట్టారు. మిల్లు మూత పడకుండా కాపాడాల్సిన తెలంగాణ ప్రభుత్వం మూసివేత సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిల్లు పునరుద్ధరణపై మొసలి కన్నీరు కార్చడం ఆయా ప్రతినిధుల బృందాలను తీసుకెళ్లి మిల్లునుసందర్శించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మూడున్నర ఏళ్లుగా యంత్రాలు పని చేయకపోవడంతో ఎక్కడికక్కడే తుప్పుపట్టి పనికి రాకుండా పోయాయి.  గతంలో పరిశీలించిన వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు యంత్రాలు పని చేయవని చెప్పడంతో ఆశలు వదలుకున్న కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొందరు కార్మికులు దిక్కుమొక్కు లేక అదే క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు.  మిల్లులో పని చేసే దాదాపు 5 వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గతంలో సిర్పూర్ ఎంఎల్‌ఏ కోనేరు కోనప్ప మిల్లు పునరుద్ధరణ కోసం ముంబాయ్ వెళ్లి మంత్రి కెటిఆర్‌తో సహా ఐడిబిఐ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అదే విధంగా అవకాశం ఉన్న సమాయాల్లో మిల్లు పునరుద్ధరణకు ఎంతగానో కృషి చేశారు. ప్రస్తుతం గత రెండు రోజులుగా జెకె పేపర్ మిల్లు(ఒడిషా) నిపుణుల బృందం సిర్పూర్ పేపర్ మిల్లులోని యంత్రాలను పరిశీలిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో మిల్లులోని వివిధ భాగాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జెకె పేపర్ మిల్లు యూనిట్ హెడ్ పికె సూరి, చీఫ్ జనరల్ మేనేజర్  ఎం. జిందాల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంబి రాజా, జనరల్ మేనేజర్ భట్‌లతో సిర్పూర్ ఎంఎల్‌ఏ కోనేరు కోనప్ప  మిల్లులోని 10 యంత్రాలను పరిశీలించారు. ఈనెల 17, 18న  వెస్ట్, కోస్ట్ కాగితం మిల్లు(కర్ణాటక) నిపుణుల బృందం సభ్యులు ఎస్‌పిఎంను సందర్శించనున్నారు. మిల్లులోని అన్ని డిపార్టుమెంట్లు క్వార్టర్లు, నీటి సదుపాయం, తదితర వాటిని పరిశీలించనున్నారు. దీంతో మళ్లీ పేపర్ మిల్లు పునరుద్ధరణపై ఆశలు చిగురిస్తుండగా కొందరు సాధ్యం కాదని కొట్టి పారేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఎన్నో పరిశ్రమలు మూతపడగా ఇప్పటి వరకు ఒక దానిని కూడా పునరుద్ధరించలేదని, పేపర్ మిల్లు విషయంలో చీటికిమాటికి ప్రతినిధుల బృందాలు రావడం మిల్లును చూసి వెళ్లడం పరిపాటిగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఎస్‌పిఎం ప్రచారాస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ టిఆర్‌ఎస్‌ను గెలిపించినట్లయితే పేపర్ మిల్లును తెరిపిస్తామనే నినాదం ముందుకు రానుంది. ఏదిఏమైనా ఎస్‌పిఎం పునరుద్ధరణపై పలు బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా మెజార్టీ కార్మికులు నమ్మలేకపోతున్నారు.

Comments

comments