Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కలెక్టర్ల బదిలీకి రంగం సిద్ధ్దం?

collect*మెతుకుసీమలోసర్వత్రాచర్చ
*హాట్ టాపిక్‌గా మారిన అంశం

సంగారెడ్డి ప్రతినిధి : రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు వుంటాయనే సంకేతాలు వెలువడుతుండటంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్ల బదిలీలు కూడా వుండవచ్చనే అభిప్రాయం అటు అధికార, ఇటు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్ల బదిలీ అంశం గురించి రెండు జిల్లాల్లో సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వం ఇటీవల రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన సమయంలోనే మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్ల బదిలీ కూడా జరుగుతుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం కేవలం రెండు జిల్లాల కలెక్టర్ల బదిలీలను మాత్రమే చేసింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె. సింగ్ వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేస్తుండటం, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు సిఎం కెసిఆర్ ఆశించిన మేరకు ఫలితాలు చూపడం లేదనే విమర్శలు వున్న నేపథ్యంలోనే ఈసారి పెద్ద ఎత్తున ఐఎఎస్‌ల బదిలీలు వుంటాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు మాణిక్యరాజ్, భారతి హోలికేరిల బదిలీలుకూడా వున్నట్టు ప్రచారం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ స్వయంగా తానే బదిలీ కోరుకుంటున్నట్టు తెలిసింది. గత ఎనిమిది నెలల క్రితమే కలెక్టర్ తనను హైదరాబాద్‌కు పోస్టింగ్ ఇవ్వాలని సిఎం కెసిఆర్‌ను కోరినట్టు సమాచారం. కలెక్టర్ మాణిక్యరాజ్ సతీమణి యోగితారాణ ఇటీవల నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హోలికేరికి, డిప్యూటీ స్పీకర్ పద్మావేదేందర్‌రెడ్డికి మధ్య గత కొంత కాలంగా సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పద్మాదేవేందర్‌రెడ్డి కలెక్టర్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ప్రచారం జరిగింది. పద్మాదేవేందర్‌రెడ్డి, భారతి హోలికేరిలు ఎవరికి వారే యమునా తీరే విధంగా వ్యవహరించడం కూడా కలెక్టర్ బదిలీకి పద్మ సిఫార్సు చేశారనే విషయాన్ని బలపర్చినట్లయింది. ప్రజాప్రతినిధులంటే కలెక్టర్‌కు కనీస గౌరవం లేదని, ఏ పనులు చెప్పినా సకాలంలో చేయడం లేదని కూడా పద్మ సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్టినట్లు తెలిసింది. గత రెండు నెలల క్రితమే కలెక్టర్ బదిలీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే గత సంవత్సరం 19వ తేదీన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన భారతి హోలికేరి బాగా పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ పద్మతో సత్సంబంధాలు సరిగ్గా లేని కారణంగానే ఆమెను బదిలీ చేయాలని పద్మ కోరినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పద్మ, కలెక్టర్ భారతి హోలికేరి మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరకుండా భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది. ఏదిఏమైప్పటికీ సంగారెడ్డి, మెదక్‌జిల్లాల కలెక్టర్ల బదిలీలు ఆయా జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Comments

comments