Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

‘జై సింహా’తో ఆ కోరిక తీరింది

jai
నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్, సి.కళ్యాణ్, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, నటాషా, ఎం.రత్నం, వి.ఆనంద్ ప్రసాద్, ఆదిశేషగిరి రావు, జెమిని కిరణ్, అశోక్ కుమార్, ప్రసన్నకుమార్, ఎన్.వి.రెడ్డి, సాగర్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ “ఈ సినిమాలో జానీ కంపోజ్ చేసిన పాట చూశాను. బాలయ్య బాబు ఈ పాటలో డ్యాన్స్‌తో అదరగొట్టారు. ‘నరసింహనాయుడు’ సినిమా తర్వాత ఒక బిడ్డ సెంటిమెంట్‌తో బాలకృష్ణ చేసిన చిత్రం ‘జై సింహా’. యాక్షన్‌తో పాటు మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. నాకు చాలా ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సి.కళ్యాణ్ అన్నయ్య ఈ సినిమాను ఎంతగానో ప్రేమించి చేశారు”అని అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే చారిత్రాత్మక చిత్రం తర్వాత బాలయ్య బాబుతో చిరంతన్ భట్ చేసిన సినిమా ఇది. అతను ఈ కమర్షియల్ సినిమాకు మంచి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందజేశారు. ‘నరసింహ’ సినిమా చేసిన దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఇప్పుడు ‘జై సింహా’ చేశారు. నరసింహ ఎంత పెద్ద హిట్ సాధించిందో ‘జై సింహా’ అంతకన్నా పెద్ద హిట్ సాధించాలి. బాలయ్య బాబు ఏ సినిమాలోనైనా కసితో నిలబడతారు… సినిమాను నిలబెడతారు. వందశాతం అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో ఆయన ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని చెప్పారు. కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ “బాలకృష్ణకు కోపం ఎక్కువని ఈ సినిమా చేయడానికి ముందు చాలా మంది నాకు చెప్పారు. అయితే షూటింగ్ చేసేటప్పుడు ఆయనలో ఒక్కరోజు కూడా కోపాన్ని చూడలేదు. ఇప్పటివరకు నేను 47 సినిమాలు చేశాను. కథ విన్న తర్వాత హీరోలు సినిమా చేస్తారు. అలా చేయడం వారి ఇమేజ్‌కు తగ్గట్టు తప్పేమీ కాదు. కానీ నాతో చేసిన ఇద్దరు హీరోలు మాత్రమే ఏం అడగకుండా సినిమా చేశారు. వారిద్దరెవరో కాదు… తమిళంలో అజిత్ అయితే తెలుగులో బాలకృష్ణ. బాలయ్య గురించి మరో విషయం చెప్పాలి. తన తండ్రిపై ఆయనకు ఎంతో ప్రేమ ఉంది. ఇలాంటి కొడుకును నేను ఇంతవరకు చూడలేదు”అని పేర్కొన్నారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ “15 ఏళ్ల క్రితం బాలయ్యబాబు ఎలాంటి డ్యాన్సులతో ప్రేక్షకులను మెప్పించారో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమాలో తన డ్యాన్సులతో ప్రేక్షకులను అలరిస్తారు. డ్యాన్సులు, యాక్షనే కాదు… ప్రేమ, అభిమానంతో ఎలా ఉండాలి, ఎదుటివారిని ఎలా గౌరవించాలి అని చెప్పే సినిమా ఇది. చిరంతన్ భట్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు”అని అన్నారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “నవరసాలున్న సినిమా ‘జై సింహా’. నేను, కె.ఎస్.రవికుమార్ కలిసి ఓ సినిమా చేద్దామని ఎనిమిదేళ్లుగా అనుకుంటున్నాం. ఆ కోరిక ఈ చిత్రంతో తీరింది. ‘జై సింహా’ సాధారణమైన టైటిల్ కాదు. నిర్మాతగా మా నాన్నగారి మూడో సినిమా ఇదే టైటిల్‌తో రూపొందింది. అప్పట్లో ఆ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రత్నం అద్భుతమైన కథను అందించారు. చిరంతన్‌భట్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పాటలకు చక్కటి బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. సంక్రాంతి పండుగకు సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘జై సింహా’. నటుడిగా నేను ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ వంటి వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటివరకు ఏ సినిమాలో రాని ట్విస్ట్ ఈ సినిమాలో ఉంటుంది”అని తెలిపారు.

Comments

comments