Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సెంటిమెంట్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్

jai

నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోహీరోయిన్లుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం ‘జై సింహా’. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. గత రెండుళ్లుగా సంక్రాంతి సినిమాలతో పలకరించిన బాలయ్య ఈసారి కూడా ‘జైసింహా’తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు.
సినిమా కథ
నరసింహ (బాలకృష్ణ) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ వదిలేసి అనేక ప్రాంతాలు తిరుగుతూ చివరికి కుంభకోణం చేరుకుంటాడు. కుంభకోణంలోని ఓ ప్రముఖ ఆలయ ధర్మకర్త (మురళీమోహన్) దగ్గర డ్రైవర్‌గా చేరతాడు. అయితే ఆయన కూతురు ధాన్య (నటాషా దోషి) యాక్సిడెంట్ చేస్తే నరసింహ ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఓ పెద్ద రౌడీకి శత్రువుగా మారతాడు. మరోవైపు ఆ ప్రాంత ఏసీపీతోనూ అతనికి గొడవ మొదలవుతుంది. కానీ తర్వాత కొన్ని పరిణామాల మధ్య ఏసీపి కుటుంబాన్ని ఆ రౌడీ బారి నుంచి కాపాడే బాధ్యత తీసుకుంటాడు. ఒకప్పుడు వైజాగ్‌లో సంతోషంగా బతికిన నరసింహ కుంభకోణం ఎందుకు వచ్చాడు? అతను పెంచుతున్న పసిబిడ్డ ఎవరు? ఏసీపి కుటుంబంతో అతనికున్న సంబంధమేంటి? … ఈ విషయాలన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తనను అభిమానించే వాళ్ల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని నరసింహ పాత్రలో బాలకృష్ణ జీవించాడు. ఎక్కడా అభినయాన్ని వేరే కోణంలోకి తీసుకెళ్లకుండా ఒకేలా నటించి మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో బాలయ్య నటనకు చప్పట్లు కొట్టాల్సిందే. ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్సుల్లో కూడా తన మాస్ మార్క్ ప్రదర్శించి హీరోగా సినిమాకు ఎంత చేయాలో అంత చేశాడు బాలయ్య. ఇక సినిమా విషయానికొస్తే ఆరంభం బాగానే ఉంది. ఫస్టాఫ్‌లో కుంభకోణం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే బ్రాహ్మణుల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించే సన్నివేశం చాలా బాగుంది. ఈ సన్నివేశంలో బాలయ్య చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్‌లోని ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తించింది. ద్వితీయార్థంలో బాలకృష్ణ గత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు, అతను ఎందుకు వైజాగ్ వదిలి వచ్చేశాడనే అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్ సన్నివేశం గుండెను బరువెక్కిస్తుంది. ఈ సన్నివేశంలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ గత హిట్ సినిమాల తాలూకు ఛాయలు కొన్ని కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ‘జై సింహా’లో పసిబిడ్డతో ముడిపడ్డ సెంటిమెంట్ ఎపిసోడ్ బలంగా, ప్రభావితంగా ఉంటుంది. ఇది కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కథను మలుపు తిప్పేది ఈ అంశమే. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. హీరోయిన్లలో నయనతార మాత్రమే ప్రత్యేకతను చాటుకుంది. నటాషా, హరిప్రియ పర్వాలేదనిపించారు. విలన్లుగా అశుతోష్ రాణా, కాలకేయ ప్రభాకర్ ఆకట్టుకున్నారు. సినిమాలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ముద్ర కనిపిస్తుంది. మొత్తానికి ‘జై సింహా’ సెంటిమెంట్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా చెప్పుకోవచ్చు.

Comments

comments