Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కుంభమేళా తరహాలో జాతర ఏర్పాట్లు

hallమన తెలంగాణ/భూపాలపల్లి: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సచివాలయంలో మేడారం జాతర ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభించేలా చూడాలన్నారు. అంతర్జాతీయ, జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా చానళ్లు, బ్లాగులు, సోషల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు. విదేశీయాత్రికుల కోసం అత్యున్నత సదుపాయాలతో ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందు కోసం సాంస్కృతిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి జాతర కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు.
దేశంలోని గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారు లను ఆహ్వానించాలి
సుప్రసిద్ధ మేడారం జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన గిరిజనశాఖల మంత్రులు, ఎంపిలు, ప్రభుత్వ కార్యదర్శులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఎస్‌పి సింగ్ అధికారులను ఆదేశించారు. జాతర కోసం వచ్చే వివిధ ముఖ్య అతిథులను తగు ప్రొటోకాల్‌లో ఆహ్వానించాలన్నారు. మేడారంలో పారిశుద్ధానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో తగు సిబ్బందిని నియమించాలన్నారు. జాతరలో సరిపడా మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు అత్యాధునిక మరుగుదొడ్లను కూడా నిర్మించాలని ఎస్‌పి సింగ్ అధికారులను ఆదేశించారు. సాంస్కృతిక, దేవాదాయశాఖ అధికారులు జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శాఖలవారిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక బ్రోచర్‌ను విడుదల చేయాలన్నారు. జాతర కోసం హెలికాప్టర్ సేవలను కూడా భక్తులకు కల్పించాలన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు తీసుకోవాలసి ఎస్‌పి సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ అరవింద్‌కుమార్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిష్టినా జడ్ చొంగ్తూ , నాగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

comments