Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అనుమతిలేని లే ఔట్‌లకు రిజిస్ట్రేషన్ నో

పంచాయతీల పరిధిలో గృహ నిర్మాణాలపట్ల కఠినంగా వ్యవహరించాలని యోచన
కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్‌ఆర్‌ఐలు, mdtr గ్రామవాసులు కాని వారు

హైదరాబాద్ : పంచాయతీల్లో అనుమతి లేని లే అవుట్ల ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందన్న దానిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం ఆలోచన చేస్తోంది. నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రుల కమిటీ మూడో రోజూ సమావేశమైంది. సబ్‌కమిటీ సభ్యులైన మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలపై, ప్రతిపాదనలపై, ఆలోచనలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనుమతిలేని లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను ఆపివేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అంతకు ముందు సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటి సిఎం మహమూద్ అలీతోనూ ఉప సంఘం ప్రత్యేకంగా చర్చించింది. ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్లు చేస్తూ విచ్చలవిడిగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, దీని వల్ల సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని సబ్ కమిటి సమావేశంలో చర్చకు వచ్చింది. లే అవుట్‌కు అనుమతి ఉంటేనే ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయింది. ప్రస్తుతం జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఉన్నట్లుగానే పంచాయతీ పాలకవర్గ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు కూడా సిట్టింగ్ ఫీజు ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం అయింది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా వరుసగా మూడుసార్లు పాలకవర్గ సమావేశాలకు గైర్హాజరైతే అనర్హత వేటు కూడా వేసే అంశంపై కూడా వీరు చర్చించారు. పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యులను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్న సబ్ కమిటి ఇందులో ఎన్‌ఆర్‌ఐ (ప్రవాస భారతీయులు)లకు, గ్రామంలో లేని వారికి కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారు. అలాగే పంచాయతీ జనాభానుబట్టి ఇద్దరు, ముగ్గురిని కూడా నామినేటెడ్ చేసుకునే అవకాశాలపై కమిటి సభ్యులు చర్చించారు. ఇందులో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, నిపుణులకు అవకాశం కల్పించడం వల్ల గ్రామ అభివృద్ధికి వారి సహకారం కూడా అందుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. భవనాల అనుమతులపైనా ఈ సమావేశంలో చర్చించారు. 200 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో జి ప్లస్ 2 ఎత్తులో నిర్మించే భవనాల అనుమతులను గ్రామ పంచాయతీల్లో ఇస్తుండగా , అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో అయితే మండలాల్లోనూ ఎంపిడిఓ , తహసీల్దార్, ఈఓ పిఆర్‌డి, పంచాయతీరాజ్ ఎఈల నేతృత్వంలో కమిటి ఏర్పాటు చేసి అనుమతించే అంశంపై చర్చించారు. అలాగే భవన నిర్మాణానికి హెచ్‌ఎండిఏ అనుమతిచ్చిన వారం రోజుల్లోనే పంచాయతీ క్లియరెన్స్ ఇవ్వాలని, లేని పక్షంలో అది అనుమతిచ్చినట్లుగానే భావించాల్సి ఉండేలా చట్టంలో పొందుపర్చే అంశం కూడా సబ్ కమిటి భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పంచాయతీల నుండి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చట్టంలో పొందుపరిచే అంశంపైనా చర్చించారు. చాలా అంశాలు చర్చలకు మాత్రమే పరిమితమై స్పష్టమైన నిర్ణయం జరగకపోవడంతో గురువారం కూడా కెబినెట్ సబ్ కమిటి మరో సారి సమావేశం కానుంది.

Comments

comments