Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ఫిబ్రవరి 3 లేదా 4న కోదండరామ్ రాజకీయ పార్టీ

Kodanda-Ram

త్వరలోనే ఢిల్లీకి ముఖ్యనేతలు
టచ్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలు

హైదరాబాద్: తెలంగాణ జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖారారైనట్టు తెలిసింది. ఫిబ్రవరి 3 లేదా 4వ తేదీన జెఎసి విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి కోదండరామ్ అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ గురించి జెఎసిలోని కొందరు ముఖ్యనేతలు త్వరలోనే ఢిల్లీకి వెళ్ళనున్నారు. కాగా తెలంగాణ జెఎసి, రాజకీయ పార్టీ రెండూ వేర్వేరుగా కొనసాగాలని భావిస్తున్నారు. రైతు సమస్యలు, నిరుద్యోగం, ఉపాధి కల్పన, భూ నిర్వాసితుల సమస్యలే పార్టీ ప్రధాన ఎజెండాగా ఉంబోతున్నట్లు జెఎసి నేతలు చెబుతున్నారు. గత కొంత కాలంగా జెఎసి ప్రతినిధుల బృందం క్షేత్ర స్థాయి పరిసి ్థతులను అధ్యయనం చేశారు. ఇదే క్రమంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. వివిధ జిల్లాలోని కొందరు రాజకీయ ముఖ్యనేతలతో జెఎసి ప్రతినిధులు చర్చించారు. ఎన్నికలకు గడువు దగ్గరపడడం, మరో వైపు పార్టీ ఏర్పాటుపై జెఎసి శ్రేణులు, విద్యార్థి సంఘాల నుంచి కోదండరామ్‌పై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇంతకు ముందు వరకు జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలోనే పార్టీ పెడుతున్నట్టు జెఎసి శ్రేణులకు కోదండరామ్ సంకేతాలు అందజేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ విధి విధానాలు, తదితర అంశాలపై పలువురు ముఖ్యులతో ఆయన చర్చిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇది వరకే కోదండరామ్‌తో చర్చలు జరిపారు. అధికార టిఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నేతలు కూడా కోదండరామ్ ఏర్పాటు చేసే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని జెఎసి కార్యాలయంలో శనివారం జరిగింది. టిజెఎసి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని ఫిబ్రవరి 3 లేదా 4వ తేదీలో హైదరాబాద్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, క్షేత్ర స్థాయి అధ్యయనంలో వెల్లడైన అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణను ప్రకటించాలని తీర్మానించారు. జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు కె.రఘు, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, గురిజాల రవీందర్, బి.ఎన్.రెడ్డి, బైరి రమేష్, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జెఎసి నిర్మాణం, రైతు అధ్యయన యాత్రలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు గోపాల్‌శర్మ అరెస్టు పరిణామాలపై వారు చర్చించారు.రైతు అధ్యయన యాత్రలు దాదాపుగా పూర్తయ్యాయని, మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడాఈ నెల 20 తేదీ లోపు పూర్తి చేయాలని, ఈ నెల 22 నుంచి30వరకు ఉమ్మడి పది జిల్లా లో అధ్యయనంలో తేలిన అంశాలపై చర్చించేందుకు సదస్సులను నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ తీర్మానించింది.
గోపాల్‌శర్మను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం
కంపెనీకి సంబంధించిన కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన బకాయిల కేసు విషయమై న్యాయ సలహాదారునిగా వ్యవహారిస్తున్న తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సభ్యులు గోపాల్‌శర్మ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిచండాన్ని కూడా నేరంగా చిత్రీకరించడాన్ని తెలంగాణ జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ఖండించారు.తన క్లయింట్ తరపున వెళ్లిన న్యాయవాదిని దోషిగా చిత్రీకరించడం అన్యాయమని శనివారం కోదండరామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసు విషయంలో న్యాయవాదిగా గోపాల్‌శర్మ నిర్వర్తించిన బాధ్యతను కూడా అధికార పార్టీకి చెందిన పత్రిక ఒక నేరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

Comments

comments