Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

టీమిండియా ముమ్మర సాధన

indiaసెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు కోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మర సాధనలో నిమగ్నమయ్యారు. తొలి టెస్టులో ఘోర పరాజయం నేపథ్యంలో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. 208 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక చతికిల పడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలావుండగా శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో గెలిచి సఫారీలపై కసి తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే గురువారం జట్టు సభ్యులు సెంచూరియన్ గ్రౌండ్‌లో కఠోర సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా సాధనలో పాలు పంచుకున్నాడు. కాగా, తొలి టెస్టుకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా కూడా సాధనలో నిమగ్నమయ్యాడు. ఓపెనర్ లోకేష్ రాహుల్, స్టార్ ఆటగాడు అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, జడేజా తదితరులు చాలా సేపు ప్రాక్టీస్ చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో ఆడని రహానె, రాహుల్‌లకు జట్టులో చోటు దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక, రవీంద్ర జడేజాను కూడా ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఎవరు తుది జట్టులో స్థానం కోల్పోతారో అంతు బట్టకుండా మారింది. రోహిత్‌ను తొలగించి రహానెను ఆడించాలనే ఒత్తిడి కోహ్లిపై నెలకొంది. అయితే కోహ్లి మాత్రం రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలనే లక్షంతో కనిపిస్తున్నాడు.
ఒత్తిడిలో కోహ్లి ….
తొలి టెస్టులో జట్టు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లి విఫలమయ్యాడు. దీంతో అతనిపై అభిమానులతో పాటు బిసిసిఐ అధికారులు కూడా గుర్రుగా ఉన్నారు. మితిమిరిన ఆత్మవిశ్వాసం, నిర్లక్షం వల్లే గెలవాల్సిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక జట్టు ఎంపికలో కోహ్లి వ్యవహరించిన తీరును కూడా చాలా మంది తప్పుపడుతున్నారు. బౌన్సీ పిచ్‌లపై మెరుగైన రికార్డు కలిగిన అజింక్య రహానెను తప్పించడంపై అందరు ఆశ్చ ర్యం వ్యక్తం చేస్తున్నారు. రహానె, రాహుల్ బరిలో ఉంటే ఫలితం కచ్చితంగా భారత్‌కు అనుకూలంగా ఉండేదనే విమర్శలు ఉన్నాయి. కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి అనుసరిస్తున్న విధానలపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఇలాగే ఉంటే జట్టు ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయమని మాజీ క్రికెటర్లు గంగూలీ, గవాస్కర్, మంజ్రేకర్, సెహ్వాగ్ తదితరులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఒకే ఒక్క ఓటమితో ప్రస్తుతం కోహ్లి ఆత్మరక్షణలో పడిపోయాడు. ఇక, జట్టును ముందుండి నడిపించడం అతనికి సవాలుగా మారింది. అయితే సవాళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకునే కోహ్లి మళ్లీ భారత్‌ను గెలుపు బాటలో నడిపిస్తాడని అభిమానులు ధీమాతో ఉన్నారు.

Comments

comments