Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ప్రేమోన్మాది ఘాతుకం

Murder-attak

ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో పొడిచి పరారైన దుండగుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల డిమాండ్

మనతెలంగాణ/ మూసాపేట/ కూకట్‌పల్లి: ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో యువతిని కత్తితో పొడిచి దుండగుడు పరారైన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి రూంమేట్ రూప తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గుయ్య న వలస గ్రామానికి చెందిన బోను జానకి(24) గత కొద్ది నెలల క్రితం బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కేపీహెచ్‌బికాలనీ 5వఫేజ్‌లోని డిమార్ట్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తుంది. మూసాపేట హబీబీనగర్‌లో అదే జిల్లాకు చెందిన రూప అనే యువతితో కలిసి రూం అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా పేద్దేముల్‌కు చెందిన అనం త్ అలియాస్ అనంతప్ప అనే యువకుడు మూసాపేట ప్రగతినగర్‌లో ఉంటూ గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో జానకి వెంటపడుతున్నాడు. దీంతో మంగళవారం రాత్రి 8 గంటలకు పని ముగించుకుని రూంకు వచ్చిన రూపకు రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జానకి కనిపించింది. దీంతో కొద్ది సేపు షాక్‌కు గురైన రూప స్థానికుల సహకారంతో హుటాహుటిన మూసాపేట శ్రీహరినగర్‌లోని వసుంధర ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి డాక్టర్లు చెప్పడంతో అక్కడి నుంచి కూకట్‌పల్లిలోని ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జానకి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి శరీర భాగంలో మూడు చోట్ల కత్తి గాట్లు ఉన్నాయి. కడుపు భాగంలో రెండు చోట్ల, వెన్ను భాగంలో మరోచోట కత్తితో పొడవడంతోపాటు గొంతుని నులిమి హంతకుడు పరారైనట్లు శరీరంపై ఉన్న గాయాలను బట్టి పోలీసులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రేమించమని వెంటపడుతున్న అనంత్ అలియాస్ అనంతప్ప అనే యువకుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని మృతురాలి రూం మేట్ రూప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కఠినంగా శిక్షించాలి
ప్రేమోన్మాది కిరాతకానికి యువతి బలైందన్న సమాచారం తెలుసుకున్న పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ప్రేమోన్మాది అనంత్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షులు గువ్వల జ్యోతి, ఉమావతిగౌడ్, అనితా శ్రీపాద్‌తోపాటు బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్యాహరీష్‌రెడ్డి, సబియాగౌసుద్దీన్, కాంగ్రెస్‌నాయకురాలు స్వరూప గౌడ్‌లు వేర్వేరుగా కూకట్‌పల్లి సీఐని కలిసి వినతిపత్రాలు అందజేశారు.

Comments

comments