Search
Friday 20 April 2018
  • :
  • :

పల్లెల్లో మల్లన్న పట్నాల సందడి

mallanaమన తెలంగాణ/కోహెడ : మండలంలో ఏ గ్రామంలో చూసినా బుకా గులాల గుమగుమలతో మల్లన్న పట్నాల సందడి కనిపిస్తోంది. ఏటా జనవరిలో మల్లన్న పండగ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం డిసెంబర్ నుంచే పట్నాల సందడి మొదలైంది. కొందరు మల్లన్న కొలువుండే కొంరవెళ్ళికి వెళ్ళి ఆక్కడే ఒకరోజు నిద్ర చేసి పట్నాం చేసుకొని వస్తారు. మొక్కులున్న కుటుంబాలు తమ మొక్కులను బట్టి చిన్న పట్నాం,పెద్ద పట్నాలు వేసుకుంటారు. చిన్న పట్నాం ఒక్కరోజులో ముగిస్తే పెద్ద పట్నాం ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.పెద్ద పట్నాం వేసుకునే వారి ఇళ్ళల్లో పెళ్ళి సందడి కనిపిస్తుంది.బందువులను అహ్వనిస్తారు.కొత్త బట్టలు ధరించి వైభవంగా మల్లన్న పట్నాల(పెండ్లి) కార్యక్రమం నిర్వహించుకుంటారు. పుట్టబంగారం తీసుకురావడంతో మల్లన్న పట్నాల సందడి మొదలవుతుంది. బియ్యంతో పోలు పోసిన తరువాత దేవుడికి అభిషేకం(స్నానం)చేసి పోలుమీదకు తీసుకువచ్చి ఆరోజు కార్యక్రమం ముగిస్తారు.మరుసటి రోజు ఉదయమే పసుపు,కుంకుమ బియ్యం పిండితో పట్నాలు వేస్తారు.బంతిపూలతో అలంకరణ చేసి వంటలు చేసి నైవేద్యం పెడతారు.ఆ తర్వాత ఒగ్గు పూజారులతో మల్లన్న దేవుడి పెండ్లి తంతు నిర్వహిస్తారు.పెండ్లి తంతు ముగిసిన తరువాత దేవుడిని గదిలో ప్రతిష్టిస్తారు.ఆ తరువాత శివసత్తులతో పట్నం తొక్కించడంతో మల్లన్న దేవుడి (పెండ్లి)పూర్తవుతాయి.
ఈ పెండ్లి తంతులో దేవుడికి కొత్త బట్టల అలంకరణ,తలంబ్రాలు పోయాడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. పట్నాలు వేసుకునే రోజుల్లో (శట్టివారాలు)పట్నాలు వేసుకునే వ్యక్తులు మద్యం,మాంసం ముట్టకుండా నిష్టతో ఉంటారు.కాగా మండలంలోని నాగసముద్రాల గ్రామానికి చెందిన మంగళారం మల్లయ్య, రాములు, లక్ష్మన్‌ల ఇంట్లో ఆదివారం మల్లన్న పట్నాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Comments

comments