Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మందు దందా..!

wine

*విచ్చల విడిగా బెల్ట్ షాప్‌లు
*ఎంఆర్‌పి కన్నా 20 అధికం
*మాసానికి రూ.4 లక్షల అదనపు వసూళ్లు
*సిండికెట్‌గా మారిన వ్యాపారులు

మన తెలంగాణ / ధర్మారం : ధర్మారంలో మందు దందా జోరుగా నడుస్తుంది. మండలంలోని మూడు వైన్స్ దుకాణాలు యజమానులు ఏకమయ్యారు. మందు ప్రియుల్ని అందినంతా దోచుకుంటున్నారు. గ్రామ గ్రామాన విచ్చల విడిగా నడుస్తున్న బెల్ట్ షాప్‌ల యాజమానుల నుండి ఎంఆర్‌పి కన్నా అధికంగా వసూలు చేస్తూ ఎక్సైజ్, పోలీస్‌లు అడ్డు తగలకుండా లోబరుచుకుంటున్నారు. దీంతో వీరు ఆడిందే ఆట..పాడిందే పాటగా  తయారైంది. బాటిళ్లపై ప్రత్యేక స్టిక్కర్లు వేసి అమ్మకాలు  సాగిస్తున్నారు. ప్రధాన దేవాలయాలు, బస్టాండ్ నివాస గృహాల మధ్య అమ్మకాలు సాగిస్తున్నారు.  ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలదే హవాగా మారింది.   మండల కేంద్రంలో రెండు వైన్స్‌లుండగా, దొంగతుర్తిలో ఒక వైన్స్‌ను నిర్వహిస్తున్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయితీలతో పాటు 13 అనుబంధ గ్రామాల్లో ప్రతి గ్రామానికి నాలుగు నుండి ఐదు చొప్పున బెల్ట్ దుకాణాలు బహిరంగంగానే నడుస్తున్నాయి.ధర్మారం ఎస్‌ఐగా కోట బాబురావు రాగానే బెల్ట్ దుకాణాలపై ఉక్కు పాదం మోపి మూసివేయించారు. రెండు నెలలు కాక ముందే బార్లలా బెల్ట్ గేట్లు తెరుచుకున్నాయి. విభేదాలు ఎన్ని వున్నా అందరు అధికార పార్టీ నేతలే కావడంతో అంతా అమ్మకాల జోరు పెంచారు. ఏకమై పోలీస్‌లు, ఎక్సైజ్ అధికారులకు మామూళ్లుత అందిస్తున్నారు.

బెల్ట్ దుకాణం నడిపే ప్రతి వ్యాపా రి నుండి ఎంఆర్‌పి క న్నా క్వార్టర్‌కు ఐదు, ఆ ఫ్‌కు పది, ఫుల్‌కు  ఇరవై అదనంగా వసూలు చేస్తున్నారు. అనధికారికంగా మండలంలోని మూడు వైన్స్‌ల పరిధిలో 39 గ్రామ పంచాయితీలు, అనుబంధ గ్రామాల్లో 120 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. సగటున ఒక్కో దుకాణం దారుడి అమ్మకాలపై అదనంగా వంద నుండి రెండు వందలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన పోలీస్, ఎక్సైజ్ మామూళ్ళ బూచి చూపి 4 లక్షల పై చిలుకు అదనంగా వైన్స్ యాజమానులు గుంజుతున్నారు. ఫుల్‌బాటిల్‌పై ఎంఆర్‌పి కన్నా ఇరవై అదనంగా ఇచ్చిన వ్యాపారి గ్రామాల్లో యాభై అదనంగా వసూలు చేస్తుండడంతో మద్యం ప్రియులు గొడవపడుతున్నారు. ఎంఆర్‌పి కన్నా అధికంగా వసూలు చేయడంతోనే సమస్యలు వస్తున్నాయని బెల్ట్ వ్యాపారులు వాపోతున్నారు.  లిక్కర్ పాయింట్ నుండి కొనుగోలు చేసిన మద్యాన్ని వైన్స్ షాప్‌లకు పంపే ముందే స్కానింగ్ చేస్తున్నప్పటికీ ఇక్కడి యాజమానులు ప్రత్యేక స్టిక్కర్లు వేసి ఎక్సైజ్ శాఖకు సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు.  నివాసం గృహాలు, దేవాలయాలు పాఠశాలల సమీపంలో అమ్మకాలు నిషేధం అయినప్పటికీ ధర్మారం  మండల కేంద్రంలో  నివాసం  గృహాలు, బస్టాండ్ ఎదురుగానే వైన్స్‌ను ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యం ప్రియులు అర్థరాత్రి వరకు తాగిన మైకంలో చేస్తున్న హంగామాతో ధర్మారంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ వ్యవహారంపై కొందరు ఎక్సైజ్ కమిషనర్, రామగుండం సిపికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఇటీవలే టాస్క్‌ఫోర్స్ ఎసిపిగా బాధ్యతలు చేపట్టిన విజయసారథి ధర్మారం పై దృష్టి సారించి దాడులు నిర్వహిస్తే బెల్ట్ షాపుల బాగోతం, వైన్స్ నిర్వాహకుల దందాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

Comments

comments