Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

పంచాయతీకి పవర్స్

mnstr

సర్పంచ్‌లకు అప్పిలేట్ ట్రిబ్యునల్, కలెక్టర్ చర్యలపై అప్పీల్‌కు అవకాశం?

దోషులకు జరిమానా విధించే అధికారం
రోడ్ల ఆక్రమణ, ఇష్టానుసారంగా చెత్త వేయడం,

ఇంట్లోని నీరు వీధిలోకి వదిలేయడం వంటి 22 అంశాల్లో ఉల్లంఘనలపై చర్య తీసుకునే పవర్స్
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చ

హైదరాబాద్ : సర్పంచ్‌లపై కలెక్టర్ తీసుకునే క్రమ శిక్షణ చర్యలపై అప్పిలేట్ అథారిటీగా ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై నూతన పంచాయతీరాజ్ చట్టంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ చర్చించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో నాలుగో రోజూ సమావేశమైంది. ఈ సందర్భంగా చట్టంలో పొందుపర్చాలనుకుంటున్న పలు కీలక అంశాలపై చర్చించారు. కాగా ఇప్పటి వరకూ సర్పంచ్‌లపై తీసుకునే క్రమశిక్షణా చర్యలపై అప్పిలేట్ అథారిటీగా ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ మంత్రే వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సబ్ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు సూచించారు. అలాగే ప్రజలు ఎవరైనా కూడా చట్టానికి లోబడి ఉండక పోతే వారికీ జరిమానాను విధించే హక్కును కూడా సర్పంచ్ నేతృత్వంలోని పాలకవర్గానికి కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, రోడ్డుపై ఇష్టారాజ్యంగా చెత్త వేయడం, ఇంట్లోని నీటిని వీధుల్లోకి వదిలేయడం సహా 22 అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించే వారికి పంచాయతీ పాలకవర్గమే జరిమానా విధించే విషయంపై చర్చించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్రమ నిర్మాణాలు లాంటివి చేపడితే వాటిని తొలగించేందుకు అయ్యే ఖర్చును కూడా కారకుల నుండే వసూలు చేసే అంశాన్నీ సబ్ కమిటీ పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు దానిని సరిచేసేలా చట్టంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరం పూర్తయిన 9 నెలలలోపు ఆడిటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. పంచాయతీల్లో జరుగుతున్న ఆడిటింగ్ ప్రక్రియకు సంబంధించి డైరెక్టర్ వెంకటేశ్వరరావు సబ్ కమిటికి వివరించారు. దీనిలో చేపట్టాల్సిన మార్పులపై చర్చించిన సబ్ కమిటి ఆడిటింగ్ ప్రక్రియ కాల పరిమితిని తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించింది. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల వ్యయం, పన్నుల వసూళ్లు లాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనే నిబంధనలను చట్టంలో పొందుపర్చే అంశంపైనా సబ్ కమిటి చర్చించింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీలోను ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాలనే అభిప్రాయాన్ని సబ్ కమిటి వ్యక్తం చేసింది. సరిగా పనిచేయని కార్యదర్శులను సరెండర్ చేసే అధికారాన్ని పాలక వర్గానికి కట్టబెట్టే దిశగానూ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు సిఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ , అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయండి
ముగ్గురు సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పేర్కొంటూ 1995లో విధించిన చట్ట నిబంధనను ఎత్తి వేయాలని తెలంగాణ గిరిజన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గాంధీ నాయక్ ఈ సందర్భంగా మంత్రి జూపల్లికి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే ఎంఎల్‌ఎలు, ఎంపిలకు లేని నిబంధన స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం ఎందుకుండాలన్నారు.

Comments

comments