Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నాదల్‌కు టాప్ సీడ్

int2

బరిలో జొకొవిచ్, వావ్రింకా
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పెయిన్ రఫెల్ నాదల్‌కు టాప్ సీడ్ లభించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు రెండో సీడ్ దక్కింది. ఆరు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ సాధించిన సెర్బియా యోధుడు నొవాక్ జొకొవిచ్‌కు 14వ సీడిండ్ కేటాయించారు. మహిళల విభాగంలో సిమోనా హెలెప్‌కు టాప్ సీడ్, కరొలినా వోజ్నియాకికి రెండో సీడ్ దక్కింది. వింబుల్డన్ విజేత, స్పెయిన్ స్టార్ గార్బయిన్ ముగురుజాకు మూడో సీడ్ దక్కింది. వీనస్ విలియమ్స్‌కు ఐదో సీడ్ లభించింది. కాగా, పురుషుల విభాగంలో అనుకున్నట్టే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ క్రీడాకారుడు, కిందటి రన్నరప్ నాదల్‌కు టాప్ సీడింగ్ దక్కింది. స్విట్జర్లాండ్ స్టార్ ఫెదరర్‌కు రెండో సీడ్ లభించింది. కిందటి ఏడాది రోజర్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా గాయం కారణంగా బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే, జపాన్ స్టార్ నిషికొరి ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగడం లేదు. అదే విధంగా ఫిట్‌నెస్ లేమితో సతమతమవుతున్న 23 సార్ల గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజేత సెరెనా విలియమ్స్ కూడా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరంగా ఉంటుంది. ఇదిలావుండగా చాలా కాలం తర్వాత జొకొవిచ్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే ఆరు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ సాధించి సత్తా చాటాడు. తాజాగా తన ఖాతాలో ఏడో టైటిల్ జమ చేసుకోవాలని భావిస్తున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జొకొవిచ్ టైటిల్ సాధించడం అంత సులువు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఫెదరర్, నాదల్ నుంచి జొకొవిచ్‌కు గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు జొకొవిచ్ 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. గాయం కారణంగా కిందటి ఏడాది చాలా టోర్నీలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫ్రాన్స్ ఆటగాడు వావ్రింకా కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అతనిపై కూడా అందరి దృష్టి నెలకొంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌కు జనవరి 15న తెరలేవనుంది.

Comments

comments