Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

రగిలి రగిలిస్తోన్న రాధికలు

Dalith-wmones

బంతిని ఎంత బలంగా గోడకేసి కొడితే అంతే వేగంగా వెనక్కు వస్తుంది. ఒక చర్యకు ప్రతి చర్య సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేస్తుందన్న న్యూటన్ చలన సూత్రం సామాజిక- రాజకీయ రంగాలకు కూడా వర్తిస్తుంది. గత మూడు సంవత్సరాల్లో దళితుల మీద అనేక అఘాయిత్యాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.  దళిత చైతన్యం ఇప్పుడు మరింత రాటుదేలి కొత్త పుంతలు తొక్కుతున్నది. అది కేవలం దళిత పురుషులకే పరిమితం కాకుండా మడమ తిప్పని మహిళా యోధులను కూడా తయారుచేసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ప్రతిఘటన, ఊనా చలో దళిత్  పాదయాత్ర, మహారాష్ట్రలో భీమా కోరెగావ్ సంఘటన మొదలైనవన్నీ క్రమక్రమంగా దళిత పోరాట మహా సైన్యాలు రూపుదిద్దుకుంటున్న వాస్తవాన్ని  రుజువు చేశాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా అణచివేతను ఎదురొడ్డి ప్రతిఘటించడంలో దళిత మహిళలు సృష్టిస్తున్న కొత్త చరిత్ర అరుణారుణ ఉదయభానోదయం కంటే గాఢంగా కళ్లకు కడుతున్నది. కుల వివక్ష లేకపోవడం నిస్సందేహంగా ఉత్తమ ఆదర్శమే. కాని మన దేశంలో కులం వాస్తవం. కులం ఆధారంగా ఏ ప్రయత్నమూ లేకుండా ఎదిగే అవకాశాలు ఉన్నట్టే కులం రీత్యా అబ్బిన వెనుకబాటు తనం అన్న సంకెళ్లను తెంచుకుని పురోగమించిన వారూ ఉన్నారు. ఇలాంటి వారే కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇప్పటి మహిళలు ఇంతకు ముందు మహిళలు చేయని పనులు చేసి చూపిస్తున్నారు. పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తున్నారు.

నాయకురాలైన రాధిక : పూల రేకులు తాకిన పూవుబోడి అంగుళులు కందిపోవుట అబ్బురంబె? అని మహిళలను కోమలాంగులని వారిని అణచి వేయడం పురుషాధిక్య సమాజ వాస్తవం. స్త్రీల విషయంలో అతి కర్కశంగా వ్యవహరించడం నిత్యానుభవం. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్ వేముల అక్కడి దారుణ పరిస్థితిని, బాహాటంగా కొనసాగిన వివక్షకు తాళ లేక 2016 జనవరి 17న ఆత్మ హత్య చేసుకున్నారు. నిజానికి ఆ విశ్వవిద్యాలయం ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. అంటే రోహిత్ ది నిస్సందేహంగా హత్యే. దళితులకు కులం తెచ్చిపెట్టే మచ్చ ఉంటుంది. మహిళల పరిస్థితికి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. రోహిత్ తల్లి రాధిక వేముల ఈ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని తన కొడుక్కు జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదన్న బలమైన పట్టుదల కారణంగా ఇప్పుడు దళితుల పక్షాన నిలబడుతున్నారు.

ఈ క్రమంలో నడివయసులో ఉన్న రాధిక అనేక అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోహిత్ వేముల మరణించి ఏడాది అయిన సందర్భంగా ఆమె హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలోని రోహిత్ విగ్రహం దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు ఆమెను, ఆమె మరో కుమారుడు రాజాను అరెస్టు చేశారు. అక్కడితో ఆమె కష్టాలు పూర్తి కాలేదు. అసలు వారి కుటుంబం దళిత కుటుంబమే కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది వేధింపులకు పరాకాష్ఠ. రాధిక కుమారుడి ప్రాణం కన్నా ఆమె వ్యక్తిగత సంబంధాలు అధికార వర్గాలకు ముఖ్యమైపోయాయి. అయితే ఆమె పోరాట పటిమ ఆమె వాదనను విస్మరించలేని స్థాయికి తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొన్నారు. అనేక ఉద్యమాలకు అగ్రభాగాన నిలిచారు. రోహిత్ చట్టం తీసుకు రావాలని నినదించారు. రాధిక భర్త భార్యా పిల్లల గురించి ఎన్నడూ పట్టించుకోకపోయినా ఆమె కులం గురించి వివాదం వచ్చినప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమై తాను వడ్డెర కులానికి చెందిన వాడినని చెప్పారు. రాధిక కేవలం తన కొడుక్కు జరిగిన అన్యాయం గురించే పోరాడడం లేదు. దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలం నుంచి 2016 అక్టోబర్ 15న అదృశ్యమైన నజీబ్ అహమ్మద్ కోసం పోరాడుతున్న అతని తల్లి ఫాతిమా నఫీస్‌కు అండగా నిలబడ్డారు. రాధిక అణగారినవర్గాల తరఫున పోరాడుతున్నారు.

ఫాతీమా నఫీస్ : జె.ఎన్.యు. నుంచి అదృశ్యమై పోయిన తన కొడుకు నజీబ్ అహమద్ కోసం అతని తల్లి ఫాతీమా నఫీస్ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. నజీబ్ జాడ కనిపెట్టడం కోసం దిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో దిల్లీ హైకోర్టు ఈ బాధ్యతను సి.బి.ఐ.కి అప్పగించి ఏడు నెలలు దాటింది. అయినా నజీబ్ కనిపించనే లేదు. నజీబ్ జె.ఎన్.యు.లో ఎం.ఎస్సీ. బయోటెక్నాలజీ విద్యార్థిగా ఉండేవాడు. సంఘ పరివార్ కు అనుబంధ విద్యార్థి సంస్థ ఎ.బి.వి.పి. కి చెందిన వారితో గొడవ జరిగిన తర్వాత నజీబ్ కనిపించకుండా పోయాడు. ఎ.బి.వి.పి. విద్యార్థులు నజీబ్ మీద దాడి కూడా చేశారు. నజీబ్ జాడ తెలుసుకోవాలని అభ్యర్థిస్తూ ఫాతీమా నఫీస్ సి.బి.ఐ. డైరెక్టర్ కు విజ్ఞప్తి చేసినా ఫలితం దక్క లేదు. నజీబ్ జాడ కనిపెట్టడంలో దిల్లీ పోలీసులు ఎంత అస్తవ్యస్తంగా వ్యవహరించాలో అంత అస్తవ్యస్తంగా వ్యవహరించారు. సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయడంలో క్షమించరాని తాత్సారం చేశారు. అంటే నజీబ్ మీద దాడి చేసిన ఎ.బి.వి.పి. కార్యకర్తలతో దిల్లీ పోలీసులు కుమ్మక్కయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నజీబ్ మీద దాడి చేసిన వారిని దిల్లీ పోలీసులు కనీసం ప్రశ్నించలేదు. పైగా నజీబ్ ముస్లిం అయినందువల్ల చాలా సునాయాసంగా అతను ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.)కు చెందిన వాడని ఏ ఆధారం లేకుండానే నింద మోపారు. తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికే దిల్లీ పోలీసులు ఈ పన్నాగం పన్నారని జె.ఎన్.యు. విద్యార్థి సంఘం ఆరోపించింది. ఇంతవరకు నజీబ్ కు ఐ.ఎస్. తో సంబంధం ఉన్నట్టు నిరూపించలేకపోయారు. ఈ వ్యవహారంలో సి.బి.ఐ. స్వతంత్రంగా దర్యాప్తు చేసే అవకాశం కల్పించాలని జె.ఎన్.యు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు మొహిత్ పాండే అన్నారు.

సి.బి.ఐ. కేంద్ర ప్రభుత్వ అధీనంలో పని చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అయినందువల్ల ఈ అనుమానం నిరాధారమైంది కాదు. దిల్లీ పోలీసుల వ్యవహార సరళి ప్రశ్నార్థకంగా ఉన్నందువల్లే దిల్లీ హైకోర్టు నజీబ్ ను వెతికే బాధ్యతను సీబీఐ కి అప్పగించిందని జె.ఎన్.యు. విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్ అన్నారు. నజీబ్ కేసును సీబీఐకి అప్పగించి ఏడు నెలలైనా ఇంతవరకు ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో అతని తల్లి నఫీస్ ఫాతీమా కూడా పోరుబాట పట్టక తప్పలేదు. నజీబ్ జె.ఎన్.యు. నుంచి కనిపించకుండా పోయినప్పుడు ఓ ఆటోలో వెళ్లాడంటున్నారు. సీబీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది కూడా. నజీబ్ ను జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలం దగ్గర వదిలేశానని చెప్పమని ఆ ఆటో డ్రైవరును దిల్లీ పోలీసులు బలవంత పెట్టారని ఫాతీమా న్యాయవాది పల్లవి శర్మ చెప్పారు. ఎలాగైనా నజీబ్ కు తీవ్రవాద సంస్థ అయిన ఐ.ఎస్.ఐ.ఎస్. తో సంబంధం ఉందని నమ్మించడమే దిల్లీ పోలీసుల పన్నాగంలా కనిపిస్తోంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగానే ఫాతీమా పోరాడుతున్నారు. ఆమె ఇప్పటికీ “నా కొడుకు ఎక్కడ? నా కొడుకు నాకు కావాలి” అని నినదిస్తూనే ఉన్నారు. పోలీసుల జులుం చూసి ఆమె జంకడం లేదు. ప్రతిఘటనకు మారు పేరుగా మారి పోయారు. పురుషుల ఆవరణలోకి : మహిళలను ఆకాశంలో సగం అని గొప్పగా చెప్తుంటాం. కాని కొన్ని పనులు పురుషులు మాత్రమే చేయాలనుకుంటాం. పురుషులు చేయవలసిన పనులను మహిళలు చేస్తే మగరాయుళ్లు అని అవహేళన కూడా చేస్తాం. కాని పట్నాకు దగ్గరలోని దిబ్రా గ్రామానికి చెందిన మహిళలు ఇంతవరకు పురుషులకు మాత్రమే ప్రత్యేకం అనుకునే డోలు వాయించే పని చేసి కొత్త ఒరవడి సృష్టించారు.

సవితా దేవి అనే మహిళ చొరవ తీసుకుని బాండు వాయించే పని పురుషులకే ప్రత్యేకం కాదు అని నిరూపించారు. నిరసన గళాలను లెక్క చేయకుండా సవితా దేవి కొంత మంది మహిళలను సమకూర్చి బ్యాండు మేళం వాయించే పని ప్రారంభించారు. పది మంది మహిళలతో కూడిన ఈ వాద్య బృందం ఇప్పుడు పెళ్లిళ్లలోనూ, ఇతర సంబరాలలోనూ బ్యాండు వాయిస్తోంది. దేవాలయాల దగ్గర కూడా వారు తమ వాద్య ప్రతిభ కనబరుస్తున్నారు. అక్కడితో ఆగకుండా భార్యలను కొట్టి, తిట్టి, వేధించే వారి ఇళ్ల ముందు కూడా ఈ వాద్య నైపుణ్యాన్ని ప్రదర్శించి మహిళల అణచివేతను సహించేది లేదని తెగేసి చెప్తున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా తమ నిరసనకు తాము సంపాదించిన నైపుణ్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. ఏ ఇంట్లో అయినా మహిళల మీద దాడి జరుగుతున్నట్టు తెలిస్తే అక్కడ ప్రత్యక్షమై పోయి బ్యాండు వాయిస్తారు. రెండేళ్ల కిందటి వరకు ఈ మహిళా వాద్య బృంద సభ్యులకు పిలల పెంపకం కాకుండా వ్యవసాయ పనులు మినహా మరేమీ తెలియదు. కాని ఇప్పుడు వారు నూతన మార్గం అనుసరించి, సంకెళ్లు తెంచుకుని సమాజానికి ఆశా కిరణాలుగా మారారు. ఈ వాద్య బృందానికి ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ఈ బృందాన్ని పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తుంటారు. ఒక్కో మహిళ నెలకు రూ. 30,000 నుంచి రూ. 50,000 దాకా సంపాదిస్తున్నారు. వారు వాద్య బృందం ప్రారంభించడం సాంప్రదాయ సంకెళ్లను అధిగమించడానికి మాత్రమే ప్రతీక కాదు. ఆర్థిక స్వాతంత్య్రం సంపాదించగలిగారు. ఆత్మ విశ్వాసంతో బతక గలుగుతున్నారు. వీరి బృందానికి ఇప్పుడు రోజూ పని దొరుకుతోంది. వారు బిహార్ కే పరిమితం కావడం లేదు. అవసరమైనప్పుడు భువనేశ్వర్, దిల్లీ లాంటి చోట్లకు కూడా వెళ్తున్నారు.ఆయితే వారు ఈ స్థితికి చేరుకోవడం సునాయాసంగా జరగలేదు. వారి భర్తలు అభ్యంతరపెట్టారు. గ్రామస్థులూ ఈసడించారు. స్థానిక వాద్యకారుడి దగ్గర ఈ విద్య నేర్చుకున్నారు. సమాజం ఈసడింపులను ఖాతరు చేయనందువల్లే వారు కొత్త బాట పట్టగలిగారు. మొదట్లో రోజుకు ఒక్కొక్కరికీ రూ. 500 రావడమే గగనమయ్యేది. ఇప్పుడు కనీసం తలా వెయ్యి నుంచి 1500 దాకా సంపాదిస్తున్నారు. గిరాకీ లేనప్పుడు తమ నైపుణ్యానికి పదును పెట్టడంలో నిమగ్నమవుతారు.

సుధా వర్గీస్ : వీరికి స్ఫూర్తినిచ్చింది మరో మహిళే. ఆమె 68 ఏళ్ల సుధా వర్గీస్. ఆమె కేరళలోని కొట్టాయంకు చెందిన కాథలిక్ సన్యాసిని. ఆమె నారీ గుంజన్ (నారీ గళం) అనే సంస్థను నెలకొల్పి బిహార్ లో దళిత మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆమె దళిత కుటుంబంలో పుట్టకపోయినా అత్యంత వెనుకబడిన బిహార్ లోని దళిత మహిళల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నారు. ఆమె కలిగిన కుటుంబంలోంచి వచ్చినా అంబేద్కర్ వల్ల స్ఫూర్తి పొందారు. 1965 నుంచి ఆమె బిహార్ లోనే ఉంటూ దళిత మహిళల్లో చైతన్యం పెంపొందింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నారీ గుంజన్ సంస్థ ద్వారా దళిత మహిళలకు చదువు, వృత్తి విద్యలు నేర్పుతారు. ఆరోగ్య పరిరక్షణలో శిక్షణ ఇస్తారు. మహిళల తరఫున న్యాయస్థానాలలో పోరాడడానికే ఆమె 1989లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. సుధా వర్గీస్‌కు 2006 లో పద్మశ్రీ అవార్డు దక్కింది. దక్షిణ భారత దేశంలో మహిళలు సంగీత వాద్యాలు వాయించడం చూసి బిహార్ లో పూర్తిగా మహిళలతో కూడిన వాద్య బృందాన్ని తయారు చేయాలని సంకల్పించానని సుధా వర్గీస్ అంటారు.

అందాల భరిణ ఆ దళిత యువతి :
ప్రతిభ, అందం తమ పంచల్లోనే ఉంటుందని అగ్రవర్ణాల వారు భ్రమ పడ్తుంటారు. కాని ఈ రెండూ ఏ వర్గం సొత్తూ కావు. దళిత యువతులు అందాల పోటీలో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. దళితులు కొన్నింటికి అర్హులు కారు అనే అంధవిశ్వాసాన్ని బెంగుళూరుకు చెందిన రోష్మిత హరిమూర్తి పటాపంచలు చేశారు. ఆమె తండ్రి దళితుడు. ఆమెకు అంబేద్కర్ ఆదర్శప్రాయుడు. తన కులం గురించి ఆమె దాచుకోవడం లేదు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకున్న రోష్మిత హరిమూర్తి భార త్ తరఫున ఈ నెల 31న జరిగే మిస్ యూనివర్స్ పోటీలో ఉన్నారు. ఆమె సోదరి అందాల పోటీల్లో పాల్గొనే వారే.

సృజనాత్మకతలోనూ… :
స్వదేశంలో దళితులు ఉద్యమించడం విదేశాల్లో ఉంటున్న వారికి సైతం ప్రేరణ కలిగిస్తోంది. సుజాత గిడ్ల ఆంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ గ్రంథం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. తన తల్లి మంజుల జీవితానుభవాలనే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని సుజాత ఈ పుస్తకం రాశారు. ప్రముఖ కవి, పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకర్ అయిన కె.జి. సత్య మూర్తి (శివసాగర్) ఆమెకు దగ్గరి బంధువు. కింది కులాల వారి పేదరికం, లింగ వివక్షను ఆమె ఈ పుస్తకంలో చిత్రీకరించారు. సుజాత కళాశాల విద్య అభ్యసిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మారిన బ్రాహ్మణులతో పరిచయం కలిగింది. వారూ తనను అగ్రవర్ణాల వారు చూసినట్టుగానే ఏహ్యభావంతో చూశారని సుజాత అంటారు. సహజంగానే అమెరికాలో ఆమెను ఈ అంటరానితనం వెంటాడలేదు. దళితుల అణచివేత గురించి దశాబ్దాలుగా లోకానికి తెలియని అంశాలను బయట పెట్టారు. సుజాత దారిలోనే మరో ప్రవాస భారతీయ రయా సర్కార్ అనే 24 ఏళ్ల వనిత దక్షిణాసియాలోని విద్యాధికులు మహిళలను ఎలా వేధిస్తారో మొత్తం 61 మంది పేర్లు ఫేస్ బుక్ లో ప్రకటించారు. ఈ జాబితాలో ప్రసిద్ధ భారతీయ, పాశ్చాత్య విశ్వ విద్యాలయాల్లో పని చేసే ప్రొఫెసర్లు ఉన్నారు. ఈ జాబితా పెద్ద సంచలనం రేపింది. స్త్రీవాదులు బిత్తర పోయేట్టు చేసిం ది. మహిళలు బాధితులుగా మిగిలిపోకుండా తమకు న్యాయంగా దక్కాల్సిన అధికారం సంపాదాలించాలన్న అభిప్రాయంతోనే రయా సర్కార్ ఈ పని చేశారు. ఇలా ంటి వారు దేశవ్యాప్తం గా వివిధ చోట్ల అనేక మంది ఉండవచ్చు. వారి గురించి లోకానికి తెలియకనూ పో వ చ్చు. కాని అన్యాయం జరిగినప్పుడు నిర సన తెలియజేయడం, అప్పుడూకుదరకపోతే తిరుగు బాటు చేయడం, అదీ కుదరనప్పుడు సంకెళ్లు తెం చుకోవడానికి విప్లవమార్గం పట్టడం అసంభవం ఏమీ కాదు.

                                                                                                                                   ఆర్వీ రామారావ్ సీనియర్

                                                                                                                                       పాత్రికేయులు 9676999856

Comments

comments