Search
Sunday 21 January 2018
  • :
  • :

కోటి ఆశలతో..కొత్త కలలతో నూతన ఏడాదిలోకి

sun

*అతి ఉత్సాహంతో ఆంక్షలు విధించిన పోలీసులు
*జిల్లాల్లో సజావుగా సాగిన కొత్త ఏడాది వేడుకలు
*శుభాకాంక్షలు తెలుపుకున్న యువత
*భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి:  కోటి ఆశలతో….. కొత్త కలలతో ….. మరో తొలి ఏడాది ఉషస్సు…. మబ్బు తెరలను చీల్చుతూ …. నేలను తాకింది నవవసంతం తొలిపొద్దు….కాల పుష్పం ఒక్కో రేకులను జారవిడుస్తూ….. మరో వేకువను తెచ్చింది. ఆశే శ్వాసగా భవిష్యత్‌పై మరింత మక్కువతో జీవనం సాగించేందుకు ప్రజలు సన్నద్ధులయ్యారు. భవిష్యత్ ఆశలు పెంచుకున్న నాగరిక సమాజం నవ్యపథాన పయనిస్తోంది. వర్తమాన ప్రపంచంతో పోటీగా  అన్నింట్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నట్లుగానే  కొత్త ఏడాది వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతించారు. ఉరుకుల పరుగుల జీవితంలో స్వాంతన పొందేందుకు అన్ని రకాల ఉత్సవాలను అంగరంగవైభంగా జరుపుతున్నట్లే నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పట్టణాల్లో. పల్లెలోని ప్రజలు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి ఆనందోత్సవాలు జరిపారు. పదుల సంఖ్యలో ఒకచోట చేరి అన్నిరకాల పిండివంటలను ఆరగిస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలుప్రైవేటు విద్యాసంస్థలో, ప్రార్ధనా మందిరాల్లో, విశ్రాంతి గృహాల్లో కేకులను కట్‌చేసి పంచారు. పిల్లలు గ్రీటింగ్ కార్డులు చేతపట్టుకొని తమ సహవాసగాళ్ల ఇంటికి వెళ్లి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాలనీలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది జనవరి1 ప్రభుత్వం సెలవు దినంగా  ప్రకటించడంతో నూతన సంవత్సర వేడుకలకు మరింతగా కొనసాగాయి. భోజనప్రియులు మాంసాహార వంటకాలతో రుచులు చూడగా మద్యం ప్రియులు మత్తులో జోగారు. భక్తులతో ఆలయాలు కిటకిట లాడాయి. కొత్తసంవత్సరం తమ జీవితాల్లో శుభా లు కలుగజేయాలని ప్రార్థనలు జరిపారు. నూతన వాహనాలకు పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని పలు వ్యాపార సంస్థలను నూతనంగా ప్రారంభించుకున్నారు. కాగా నూతన సంవత్సర వేడుకల పేరుమీద అతిగా మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యేవారు, ప్రమాదాలు కొని తెచ్చేవారిపై  పోలీసులు ఆంక్షల వల విసిరారు. మూడు రోజుల మందుగా తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వాహనాలు సీజ్ చేస్తామని ప్రకటించడంతో మందు బాబుల జోరు తగ్గింది. అనేక మంది ఇండ్ల వద్దనో, అపార్టుమొంట్‌లో వేడుకలను జరుపుకున్నారు. ఫోన్‌లలో ఒకరి నొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుకున్నారు. మహిళలు ఇంటి ముందు అందమైన రంగు రంగుల రంగవళ్లికతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉదయాన్నే దేవాలయాలకు వెళ్ళి సుఖసంతోషాలతో గడపాలని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వివిధ మతాలకు చెందిన ప్రజలు తమ ఆరాధ్య దైవాలను వేడుకున్నారు. నూతన సంవత్సరం శుభాలు కలుగజేయాలని జిల్లా ప్రజలు ఆకాంక్షించారు.

Comments

comments