Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

నిబంధనలకు తూట్లు..బిల్డర్లకు కోట్లు

building

* బహుళ అంతస్తుల, భవనాల నిర్మాణాల్లో భారీగా అక్రమాలు
* అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు
* భవన నిర్మాణాల్లో నిబంధనలకు ఎగనామం
* ముడుపులు పొంది పట్టించుకోని అధికారులు, పాలకవర్గం
* మున్సిపల్ ఆదాయానికి
కోట్లలో గండి

బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తుండగా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. లక్షలాది రూపాయల ముడుపులు పొందుతున్న అధికారులు, పాలక వర్గం సభ్యులు సమస్య పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా దినదినానికి అక్రమ భవన నిర్మాణాల సంఖ్య పెరిగిపోతుండగా మున్సిపల్ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రం లో గత మూడు సంవత్సరాలుగా లెక్కకు మించి భవన నిర్మాణాలు సాగుతుండగా  బిల్డర్లు సైతం అనుమతులు పొందడం లేదు. కొందరు బిల్డర్లు అపార్టుమెంట్లు నిర్మించే సమ యంలో ఒక మడిగను కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేస్తూ భవనాలను నిర్మిస్తుండగా మార్టిగేజ్ చేసిన భవనాలనుసైతం విక్రయిస్తున్నారు. మరికొందరు మార్టిగేజ్ చేసిన మడిగెలను విడిపించుకోవడం లేదు. గత కొంత కాలంగా జిల్లా కేంద్రంలో భూముల ధరలకు రెక్కలు రాగా కొందరు భూములను కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ భూముల్లో వెంచర్లను ఏర్పాటు చేసి, భవనాలను నిర్మిస్తుండగా మున్సిపల్ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుంది. మున్సిపల్ పరిధిలో సామాన్యులు ఇల్లు నిర్మించుకోవడానికి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లితే ముప్పతిప్పలు పెడుతున్న అధికారులు  రియల్ వ్యాపారులకు సహకరిస్తూ ఎలాంటి అనుమతులు పొందకుండా భవన నిర్మాణాలు చేపట్టేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. పట్టణంలో ఎక్కువశాతం తక్కువ స్థలంలోనే బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. 400 గజాలలోపు స్థలంలో జి+4 భవనం నిర్మించుకోవడానికి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు అనుమతి ఉంది. 1200 గజాలలోపు స్థలం ఉంటే జి+6 భవనం నిర్మించుకోవడానికి వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్‌ప్లానింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే వరంగల్ నుంచి అనుమతులు రాకముందే స్థానిక అధికారులకు పాలక వర్గం సభ్యులకు ముడుపులను అందిస్తూ భవన నిర్మాణాలను ప్రారంభిస్తున్నారు. కొందరు చెరువు శిఖం భూములను కూడా వదలకుండా బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో 17 అపార్టుమెంట్లు నిర్మించగా నివాసం, వాణిజ్య గృహాలు 19,640 ఉన్నాయి. అధికారుల అనుమతితో 12,880 భవనాలను నిర్మించగా అధికారుల అనుమతి లేకుండా 6,760 భవనాలను నిర్మించారు. మరో 101 ప్రభుత్వ కార్యాలయల భవనాలు ఉన్నాయి. అపార్టుమెంట్లు నిర్మించే సమయంలో 10 శాతం గదులను మున్సిపల్ కమిషనర్ పేరిట మార్టిగేజ్ చేయిస్తారు.
అనంతరం అపార్టుమెంట్ల నిర్మాణం నిబంధనల ప్రకారం నిర్మిస్తే మార్టిగేజ్ చేసిన గదులను విడుదల చేస్తారు. అనంతరం వారికి అమ్ముకునే అధికారం కల్పిస్తారు. అపార్టుమెంట్లు నిర్మించే బిల్డర్లు భవనం చుట్టూ ఫైరింజన్ తిరిగే విధంగా సెడ్‌బ్యాంక్ కింద ఖాళీ స్థలం ఉంచాలి. నేలపై భాగంలో ఫిల్లర్స్ కింద వాంచ్‌మెన్ గది తప్ప ఎలాంటి అదనపు గదులు నిర్మించరాదు. ఫిల్లర్స్ భాగం కేవలం పార్కింగ్‌కు మాత్రమే వదిలివేయాలనే నిబంధనలు ఉండగా బిల్డర్లు ఈ నిబంధనలు పాటించకుండా ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా పాలక వర్గం మున్సిపల్ అధికారులు కళ్లు తెరిచి అక్రమంగా నిర్మించే భవనాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments