Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

వ్యాట్ ఎగవేతపై నోటీసులు

vat

ఏడువేల మందికి జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రూ.708 కోట్ల వసూల్‌కు రంగం సిద్ధం

హైదరాబాద్: మూడేళ్ళుగా పేరుకుపోయిన మొండి ‘వ్యాట్’ బకాయిల వసూళ్ళపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సుమారు ఏడువేల మందికి నోటీసులను జారీ చేసింది. వారం రోజుల్లో చెల్లింపులు జరపాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో వాణిజ్యపన్నుల అధికారులు పేర్కొన్నారు. సుమారు రూ.708 కోట్ల మేరకు వసూ లు కావాల్సి ఉన్నదని, ‘వ్యాట్’ రిటర్న్‌లను దాఖలు చేసినా దానికి సంబంధించిన చెల్లింపులు చేయకపోవడం చట్టవిరుద్ధమని అధికారులు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఐటి సాంకేతిక సహకారంతో ప్రత్యేకంగా ‘రిటర్న్ బ్యాలెన్స్ మాడ్యూల్’ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశామని, ఇందులో 2014-2017 మధ్యకాలంలో ‘వ్యాట్’ రిటర్న్‌లను దాఖలుచేసినా అందులో పేర్కొన్న మొత్తాన్ని ఇప్పటివరకూ ప్రభుత్వానికి చెల్లించనివారి వివరాలను క్రోడీకరించి ఆ సాఫ్ట్‌వేర్ ద్వారానే ఆటోమేటిక్‌గా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఇలాంటి 1371 మంది పన్ను ఎగవేతదారులకు నోటీసులు జారీ చేయడంతో సగం మంది ఒక్క రోజు వ్యవధిలోనే చెల్లించారని, ప్రతిసారీ నోటీసులు జారీ చేయడం అలవాటుగా మారకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు వారం రోజుల వ్యవధిలోపు చెల్లించాలని స్పష్టంగా పేర్కొన్నట్లు ఆ అధికారులు తెలిపారు. గతేడాది జూలై నుంచి జిఎస్టి అమల్లోకి రావడంతో రిటర్న్‌లను దాఖలు చేసినా ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించలేదని, ఫలితంగా ప్రభుత్వానికి రూ. 185 కోట్ల మేర వసూలు కావాల్సి ఉన్నదని తెలిపారు. సకాలంలో చెల్లింపులు జరగకపోవడానికి తాము నిర్దిష్టంగా ఏడు కారణాలను గుర్తించామని, ఇందులో ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించడమే ప్రధానమైనదని తెలిపారు. జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత రిటర్న్‌లలో పేర్కొన్న విధంగా పన్నును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుందని, అయితే సెర్వర్ ఢిల్లీలో ఉన్నందువల్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలు సకాలంలో తమకు అందడంలేదని పేర్కొన్నారు. కానీ కేంద్ర జిఎస్టి అధికారుల నుంచి కొన్ని వివరాలను సేకరించిన తర్వాత ఐదు నెలల వ్యవధిలో సుమారు రూ. 185 కోట్ల మేర రిటర్న్‌లలో పేర్కొన్న పన్ను బకాయి ఉన్నట్లు తేలిందని, సగటున ప్రతి నెలా రూ. 30 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉందని తెలిపారు. వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు సుమారు 1.85 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉంటే జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత అది మూడు లక్షలు దాటిందని వివరించారు. ‘వ్యాట్’ బకాయిలను వసూలు చేయడానికి గతంలోనైతే మాన్యువల్‌గా నోటీసులు జారీ చేయాల్సి వచ్చేదని, కానీ హైదరాబాద్ ఐఐటి సహకారంతో తయారుచేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఒక్క సెకనులోనే అందరికీ నోటీసులు జారీ చేయడం సాధ్యమవుతోందని, ఒకేసారి మెయిల్ ద్వారా, మొబైల్ ఎస్‌ఎంఎస్ ద్వారా పంపడం సాధ్యమైందని తెలిపారు. తొలుత వారం రోజుల గడువు ఇస్తామని, ఆ తర్వాత చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం పెనాల్టీ విధిస్తామని, ఆ తర్వాత లైసెన్సుపై చర్య తీసుకునేలా నోటీసు జారీ చేస్తామని, అప్పటికీ మొండిగా వ్యవహరించినవారి బ్యాంకు ఖాతాలపై ఆయా బ్యాంకు యాజమాన్యాలతో మాట్లాడి ఖాతాలను స్థంభింపజేయడం లేదా ఇతర చర్యలకు చొరవ తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు పన్ను ఎగవేసినవారంతా కట్టడానికి ఆర్థిక స్థోమతలేనివారేమీ కాదని, అలసత్వం కారణంగానే కుంటిసాకులు చెప్తూ దాటవేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు వసూలవుతుందని, తప్పించుకోడానికి ఎలాంటి ఆస్కారమూ లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వాడడంలేదని, దేశంలోనే ఇది తొలిసారి అని దాని ప్రత్యేకతలను వివరించారు. జిఎస్టి వసూళ్ళ గురించి ఆ అధికారి మాట్లాడుతూ, వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు అంచనాలకు అనుగుణంగా వసూలైనట్లే ఇప్పుడు కూడా సంతృప్తికరంగానే జరుగుతోందని తెలిపారు. ఇటీవల ఎక్కువ పన్ను శ్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులను తక్కువ శ్లాబ్‌లోకి మార్చినందువల్ల దేశవ్యాప్తంగా పన్ను ఆదాయం తగ్గుతున్నట్లుగానే మన రాష్ట్రానికి కూడా ఒక మేరకు తగ్గే అవకాశం ఉందని, అయితే ఇది పెద్దగా ఆందోళనకర స్థాయిలో లేదని తెలిపారు.

Comments

comments