Search
Saturday 21 April 2018
  • :
  • :

ఇరాన్‌లో అశాంతి అణచివేత

sampadakeyam

ఇరాన్‌లో గతవారం విస్తృతంగా వ్యక్తీకరణ పొందిన ప్రజా నిరసనను విప్లవ రక్షణ దళాలు అణచివేశాయి. విదేశీ శక్తులు నిరసన ప్రదర్శనలను రెచ్చగొట్టినట్లు ఆ దళం పేర్కొన్నది. ఆర్థిక ఇబ్బందులపై గళమెత్తుతూ యువత, కార్మికవర్గం ప్రారంభించిన నిరసన ప్రదర్శనలు 80కి పైగా నగరాలు, పట్టణాలకు వ్యాపించాయి. భద్రతాదళాల అణచివేత చర్యల్లో కనీసం 22 మంది చనిపోయారు, వెయ్యిమందికి పైగా అరెస్టు చేయబడినారు. ఈ అసమ్మతి పెల్లుబుకటానికి మూలమేమిటి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుదల ప్రధాన కారణం. అయితే సంస్కరణవాది అయిన అధ్యక్షుడు హసన్ రోహానీకి వ్యతిరేకంగా చెదురుమదురుగా ప్లెకార్డులతోపాటు నినాదాలు కూడా వినిపించటంతో ఆందోళనలు రెచ్చగొట్టటంలో పచ్చిమితవాదుల పాత్ర ఉన్నట్లు అనుమానించబడింది. సర్వోన్నత మతాధికారి అయతుల్లా ఖొమేనీ, ప్రజల ఆందోళన వెనుక విదేశీ శక్తులు, ఇరాన్ విప్లవ వ్యతిరేకుల హస్తముందని ఖండించగా, విప్లవ రక్షణదళం దాన్నే వల్లించింది. కాగా ఆర్థిక కోర్కెలపైనే ప్రజలు ఆందోళన చేశారనటం వక్రీకరణ అవుతుందని, ప్రజలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక కోర్కెలు వ్యక్తం చేశారని అధ్యక్షుడు రోహాని వ్యాఖ్యానించారు. తన సంస్కరణలకు వ్యతిరేకులైన మితవాదులపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛల విస్తరణ, విదేశాలతో ఉద్రిక్తోపశమన చర్యలు ఆయన తల పెట్టారు. ఆందోళనల సందర్భంగా సోషల్ మీడియాపై విధించిన ఆంక్షల ఎత్తివేతకు, అరెస్టు చేసిన విద్యార్థులందరి విడుదలను ఆయన ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యందారీ ట్వీట్లు ఖొమేనీ ‘విదేశీ శక్తుల జోక్యం’ ఆరోపణకు బలం చేకూర్చగా, మాజీ అధ్యక్షుడు, పచ్చిమితవాది అహ్మద్ నేజాదీ రెచ్చగొట్టాడన్న వార్తలు మితవాదుల పాత్రపై అధ్యక్షుడు రోహానీ వ్యాఖ్యలకు ప్రాతిపదికగా కనిపిస్తున్నది. పాలక కూటమిలో భిన్నాభిప్రాయాలను ఇవి వెల్లడిస్తున్నాయి. కాగా అవినీతిని కూడా ప్రజలు నిరసించిన కారణంగా ఇరాన్ అధికారులను, మినహాయింపు లేకుండా విమర్శించేందుకు ప్రజలను అనుమతించాలని రోహానీ అన్నారు. ఎన్నికల నాటిలాగే ప్రజల తోడ్పాటుతో సంస్కరణలను ముందుకు గొనిపోవటం ఆయన ఉద్దేశంగా కనిపిస్తున్నది.
అయితే విదేశీ శక్తులనో, మితవాదులనో చూపి వాస్తవ సమస్యలను దాటవేయటం మతాధికారికి లేదా పాలనాధికారికి సాధ్యం కాదు. అణుకార్యక్రమంపై పి5ప్లస్1 (భద్రతామండలి శాశ్వత సభ్యులు ఐదుగురు ప్లస్ జర్మనీ)తో ఒప్పందం తదుపరి ఆర్థిక ఆంక్షలు ఎత్తివేసిన పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగవంతమైంది. అయితే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణించాయి, నిరుద్యోగం పెరిగింది. సిరియా అంతర్యుద్ధంలో అధ్యక్షుడు అస్సాద్‌కు ఇరాన్ అండగా నిలవటం, లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్లా బలపడి తన ప్రభావాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించుకోవటం, ఒకనాటి శత్రుదేశం ఇరాక్‌లో ఇరాన్ ప్రాబల్యం పెరగటం వీటన్నిటివెనుక ఇరాన్ ఆర్థిక, మిలటరీ సహాయం ఉంది. ఆ మేరకు నిధులు స్వదేశీ ప్రజల సంక్షేమానికి తగ్గినట్లే కదా! సౌదీ అరేబియాను ముందుపెట్టి అమెరికా వెనుకనుంచి నడుపుతున్న మధ్య ప్రాచ్య రాజకీయాల్లో తననుతాను కాపాడుకోవటంతోపాటు మిత్రులను పటిష్టంగా ఉంచటం ఇరాన్‌కు అనివార్యమైంది. అటు తమ విప్లవ క్రమానికి వ్యతిరేకులైన విదేశీ శక్తులను, ఇటు సంస్కరణలను వ్యతిరేకిస్తున్న అంతర్గత మితవాద శక్తులను ఎదుర్కొవలసి ఉంది. ఏమైనా దేశ ప్రజల జీవనాన్ని మెరుగుపరచడమే అంతిమంగా ప్రాధాన్యం వహిస్తుంది. ఇరాన్‌ను టెర్రరిజం ఎగుమతిదారుగా నిందిస్తూ, అణు కార్యక్రమ ఒప్పందం నుంచి వైదొలుగుతామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేయటం కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికే. సామాన్య ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచకపోతే, అశాంతి ఇప్పటికి అణచివేయబడినా మళ్లీ ఏదోక రూపంలో తలెత్తదన్న గ్యారంటీ లేదు. అందువల్ల ఇరాన్‌తో, దాని వైరి రాజ్యాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న భారత్ అత్యంత నేర్పుతో తన ప్రయోజనాలను పరిరక్షించుకోవలసి ఉంటుంది.

Comments

comments