Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

వైద్యశాఖలో పైసా వసూల్

hosp*డిప్యూటేషన్ల పేరిట అక్రమ వసూళ్లు
*అధికార పార్టీ నేతలు అధికారుల అండతో సాగుతున్న వ్యవహారం
*నిబంధనలకు ఎగనామం
*అక్రమ డిప్యూటేషన్లకు నిలయాలుగా ఆరోగ్య కేంద్రాలు

మనతెలంగాణ / మంచిర్యాలప్రతినిధి : వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటేషన్ల ప్రక్రియలో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ తీసుకొని మైదాన ప్రాంతాలకు వచ్చేందుకు డిప్యూటేషన్లు చేయించుకుంటుండగా ఈ వ్యవహారంలో వేలాది రూపాయాలు చేతులు మారుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతోనే ఈ తతంగం సాగుతుండగా ఎంతో మంది డిప్యూటేషన్‌లపై మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.  ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లడానికి ఇష్టపడకపోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  రెండు సంవత్సరాలుగా  వైద్యుని పోస్టు ఖాళీగా ఉందంటే  డిప్యూటేషన్‌ల వ్యవహారంలో అవినీతి అక్రమాలకు అద్దం పడుతున్నాయి. ఫలితంగా నేటికి గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలే వైద్యాధికారులుగా వ్యవహరిస్తూ అంతంతమాత్రంగానే వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లినట్లయితే అక్కడి సిబ్బంది పట్టణ ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు.  డిప్యూటేషన్‌ల పుణ్యమాని సిబ్బంది, డాక్టర్లు  మైదాన ప్రాంతాల్లో పని చేస్తుండగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందక సతమతమవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒక ఏరియా ఆసుపత్రి జిల్లా కేంద్రం లో ఉండగా మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, 126 సబ్ సెంటర్లు  ఉన్నాయి. వీటిలో దాదాపు 28 మంది డాక్టర్లు, సిబ్బంది డిప్యూటేషన్‌లపై వేరే చోటు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఉన్నతాధికారుల అక్రమాల వలన  ఫలితం కానరావడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పని చేస్తున్న సిబ్బందిని అవసరం లేకున్నా  డిప్యూటేషన్‌లపై ఇతర ప్రాంతాలకు  పంపించడం పలు అక్రమాలకు తావిస్తోంది. డిప్యూటేషన్‌ల వ్యవహారంలో నిబంధనలకు ఎగనామం పెట్టి ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

డిప్యూటేషన్‌లపై కొందరు సి బ్బంది వెళ్లిపోవడంతో ఉన్నవారిపై   ఒత్తిడి పెరుగుతుంది. జిల్లాలోనే  అంగరాజ్‌పల్లి, వేమనపల్లి,  మందమర్రి, కోటపల్లి, భీమిని, జన్నారం ప్రాథమిక ఆరోగ్య కే ంద్రాల్లో  సిబ్బందిని డిప్యూటేషన్‌లపై పంపించారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యాధికారిని లావణ్యను మంచిర్యాల ఏరియా  ఆసుపత్రిలోని ఐసియు వా ర్డులో  విధులు నిర్వహించేందుకు పంపించారు. అయితే సదరు వైద్యురాలు ఓపి  విభాగంలో సాధారణ విధులు నిర్వహిస్తున్నారు.  24 గంటల పాటు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య  కేంద్రంలో ప్రస్తుతం ఇద్దరు డాక్టర్లకు గాను ఒక్కరే పని చేస్తున్నారు. కోటపల్లిలో పని చేస్తున్న డాక్టర్ నిఖిల్‌ను మంచిర్యాల ఏరియా ఆసుపత్రి ఐసి యూ వార్డులో విధులు నిర్వహించేందుకు పంపించారు. అక్కడ ఉన్న వైద్యాధికారి ఈ నెల 1 నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో 24 గంటలు సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్క  వైద్యాధికారి కూడా లేకుండా పోయారు. ఫలితంగా  రోగులకు వైద్య సేవలు  అందడం లేదు. కోటపల్లి, భీమిని, ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఇద్దరు హెల్త్ అసిస్టెంట్‌లను జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు.  వాస్తవానికి హెల్త్ అసిస్టెంట్లు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాల్సి ఉండగా శిక్షణ పొందిన హెల్త్ అసిస్టెంట్లతో  కంప్యూటర్ విభాగంలో  పని చేయించడం  గమనార్హం. జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఇద్దరు సూపర్‌వైజర్లను  నాలుగు నెలల క్రితం వేమనపల్లి పిహెచ్‌సికి పంపించారు. అయితే మారుమూల ప్రాంతానికి వెళ్లలేమని  చెప్పడంతో పెద్ద ఎత్తున మూడుపులు పొంది వారిని మళ్లీ  వారి  డిప్యూటేషన్‌లను రద్దు చేసి, జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. ఈ విధంగా జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది  నిబంధలకు విరుద్దంగా డిప్యూటేషన్‌లపై విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటేషన్‌లపై మైదాన ప్రాంతాల్లో  పని చేస్తున్న సిబ్బందిపై వెంటనే విచారణ జరిపించి డిప్యూటేషన్‌ల వ్యవహారంలో అక్రమాలకు  పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments