Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

బాకీపడ్డ వేతనం చెల్లించాలి

kadiyam

*10న సమావేశానికి రేయాన్స్ కంపెనీ సిఈఒ రావాలి
*కార్మికులకు బాకీపడ్డ 32నెలల జీతాన్ని వెంటనే ఇచ్చేయాలి
*కార్మికులను నిర్లక్షం చేస్తే కంపెనీ యాజమాన్యంపై చర్యలు తప్పవు
*కమలాపూర్ రేయాన్స్‌బిల్ట్ యూనియన్ల జెఎసి, కంపెనీ ప్రతినిధుల సమావేశం
*హాజరైన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజనశాఖ మంత్రి చందులాల్

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: బిల్ట్ (బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) యాజమాన్యానికి తెలంగాణ సర్కార్ అల్టిమేటం ఇచ్చింది. బిల్ట్ పరిశ్రమ మూతపడినప్పటి నుంచి కార్మికులకు ఇవ్వవలసిన 32నెలల పెండింగ్ వేతనాలను ఈనెల 9లోపు చెల్లించాలని లేనిపక్షంలో కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ బిల్ట్‌కార్మికుల పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష ధోరణిపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన, పర్యాటకశాఖ మంత్రి చందులాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్యాక్టరీ మూతపడడం వల్ల పనిలేకుండా రోడ్డునపడిన 750 మంది కార్మికులకు ఈనెల 9న నెల జీతం కార్మికులకు ఇచ్చి, ఈనెల 10న కంపెనీ సిఈఒ సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఫ్యాక్టరీ మూతపడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలను తీర్చడంలేదని రేయాన్స్ ఫ్యాక్టరీ యూనియన్ల జెఎసి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందులాల్‌ను ఆశ్రయించడంతో వీరి ముగ్గురి ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయంలో యూనియన్ల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ యాజమాన్య ధోరణిని మంత్రులకు యూనియన్ ప్రతినిధులు వివరించారు. 32 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వేతనాలు ఇవ్వమని అడిగితే డెడ్‌లైన్లు పెడుతున్నారు తప్ప ముందుకు రావడంలేదని గోడు వెళ్లబుచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందులాల్ ఈనెల 9లోపు నెల జీతం ఇచ్చి, మిగిలిన జీతం ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చేందుకు 10వ తేదీ జరిగే సమావేశానికి రావాలన్నారు. ఈ రెండింటిలో దేనిలో ఫేయిల్ అయినా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.
రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడకూడదు, కార్మికులు ఇబ్బంది పడకూడదని మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద జరిగిన సమావేశంలో కంపెనీ యాజమాన్యం అడిగిన ప్రతి డిమాండ్‌ను సిఎం కెసిఆర్ అంగీకరించారన్నారు. సిఎం వద్ద జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా అన్నింటికీ అంగీకరించినందుకు ఆనందంగా ఉందని, త్వరలోనే కంపెనీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వర కు పట్టించుకోకపోవడం సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు. రాయితీలు ప్రోత్సహకాలు ఇచ్చినా కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ ప్రారంభించకపోగా.. 32 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం మంచిది కాదన్నారు. వీరి తీరు మారకపోతే చట్టపరంగా తీసుకోవాల్సిన చ్యలు ఏకకాలంలో చేపట్టాల్సి వస్తుందన్నారు.
ఈ సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమిషనర్ భాగ్యనాయక్, డిప్యూటి కమిషనర్ రమేష్‌బాబు, బిల్డ్ ఇండస్ట్రీ డిప్యూటి జనరల్ మేనేజర్ కేశవరెడ్డి పాల్గొన్నారు.

Comments

comments